Explained:భారత్ కుంటే అమెరికా ఎన్నికల విధానం ఎందుకంత భిన్నం? యూఎస్ ప్రెసిడెంట్ ఎలా ఎన్నికవుతారు?ఎలక్టోరల్ కాలేజీ అంటే ఏమిటి?
అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయనే విషయంపై ప్రపంపమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఆ దేశంలోని ఎన్నికలపై భారత్‌లో కూడా చర్చ జరుగుతోంది. అయితే, అమెరికా ఎన్నికల విధానం భారత్‌తో పోల్చుకుంటే ఎందుకు అంత భిన్నంగా ఉందనేది చాలామందికి సందేహం. భారత్‌లో పార్లమెంటరీ వ్యవస్థ ఉండటంతో, ప్రజలు తమ ఎంపీలను నేరుగా ఎన్నుకుంటారు. గెలిచిన పార్టీ లేదా కూటమి అధికారం చేపట్టడానికి అత్యధిక ఎంపీలను ఎంచుకోవడం అవసరం. కానీ అమెరికాలో, అధ్యక్షుడిని ప్రజలు నేరుగా ఎన్నుకోవడం లేదు. అక్కడ 50 రాష్ట్రాలకు సంబంధించి 538 ఎలక్టోరల్ కాలేజీ ప్రతినిధులు ఉంటారు, వీరిని ప్రజలు ఓటు ద్వారా ఎన్నుకుంటారు. అమెరికా అధ్యక్షుడిని ఎన్నుకునేందుకు 270 ఎలక్టోరల్ ఓట్లు అవసరం.
నేషనల్ పాపులర్ ఓట్
అమెరికాలోని అనేక రాష్ట్రాలలో, అత్యధిక మెజారిటీని సాధించిన అభ్యర్థికి ఆ రాష్ట్రంలోని అన్ని ఎలక్టోరల్ ఓట్లు కేటాయిస్తారు. ఈ విధంగా, నేషనల్ పాపులర్ ఓట్ పొందకపోయినా, ఎవరైనా అభ్యర్థి అధ్యక్ష పీఠాన్ని దక్కించుకునే అవకాశం ఉంది. భారతదేశంలో ఎన్నికల ప్రక్రియ పూర్తి భిన్నంగా ఉంటుంది. 545 లోక్‌సభ స్థానాల్లో 543 మందిని ప్రజలు నేరుగా ఎన్నుకుంటారు, మిగతా ఇద్దరిని రాష్ట్రపతి నామినేట్ చేస్తారు. మెజారిటీగా 272 సీట్లు గెలిచిన పార్టీ లేదా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటుకు అధ్యక్షుడు ఆహ్వానిస్తారు.
ఎవరీ ఎలక్టర్లు?
అమెరికా ఎన్నికల్లో ప్రజలు ఎలక్టర్లను ఎన్నుకుంటారు. వివిధ రాష్ట్రాలలో కాంగ్రెస్ ప్రాతినిధ్యం, సెనేట్ ప్రాతినిధ్యం ఆధారంగా ఎలక్టోరల్ కాలేజీ సభ్యుల సంఖ్య ఉంటుంది. ఈ ఎలక్టర్ల ఎన్నిక ప్రక్రియ రెండు భాగాలుగా ఉంటుంది.మొదటి భాగంలో,ఏదైన పార్టీ నేతలు, మద్దతుదారులను ఆ రాష్ట్ర ఎలక్టర్లుగా నామినేట్ చేస్తారు. రెండవ భాగంలో, జనరల్ ఎలక్షన్స్‌లో ఓటర్లు తమకు నచ్చిన అధ్యక్షుడిని ఎంచుకునే ఎలక్టర్లకు ఓటు వేస్తారు. ఎన్నికల సమయంలో బ్యాలెట్‌పై ఎలక్టర్ల పేరు ఉండవచ్చు లేదా ఉండకపోవచ్చు, ఇది రాష్ట్రాల ఎన్నికల విధానంపై ఆధారపడి ఉంటుంది. ఫలితాల తర్వాత, విజేతగా ప్రకటించిన అభ్యర్థి పార్టీ తరఫున పోటీ చేసిన ఎలక్టర్లు రాష్ట్ర ఎలక్టర్లుగా అపాయింట్ అవుతారు. నెబ్రాస్కా, మైన్ రాష్ట్రాల్లో ఇది భిన్నంగా ఉంటుంది.
41 రోజుల తర్వాత ప్రమాణ స్వీకారం
అమెరికాలో ఎలక్టోరల్ సభ్యుల ఎన్నిక జరిగిన 41 రోజుల తర్వాత డిసెంబర్‌లో వారంతా అధికారికంగా అధ్యక్షుడిని ఎన్నుకునే ఓటింగ్‌లో పాల్గొంటారు. జనవరిలో ఆ ఓట్లను అమెరికా కాంగ్రెస్ లెక్కించి అధ్యక్షుడిని ప్రకటిస్తుంది. కానీ భారత్‌లో పోలింగ్ పూర్తయిన కొన్ని రోజుల్లోనే కౌంటింగ్ నిర్వహిస్తారు. కేంద్ర ఎన్నికల సంఘం ఏ పార్టీ అభ్యర్థులు ఎన్ని సీట్లు గెలిచారనే విషయాన్ని ప్రకటిస్తుంది.
ఎన్నికల సమయ ప్రాధాన్యత
అమెరికాలో, ఈసారి నవంబర్ 5న పోలింగ్ జరగనుంది. విజయం సాధించిన వారు ప్రమాణ స్వీకారం చేసేందుకు చాలా కాలం వేచి ఉండాలి. పోలింగ్ పూర్తయిన 11 వారాల తర్వాత జనవరిలో అధ్యక్షుడు ప్రమాణ స్వీకారం చేస్తారు. ప్రతి నాలుగేళ్లకోసారి అమెరికాలో ఎన్నికలు జరుగుతుంటాయి.
నవంబర్‌లో ఎన్నికలు నిర్వహించడానికి కారణం
నవంబర్‌లో జరుగుతున్న ఎన్నికలకు కారణం ఉంది. 1845కు ముందు అమెరికాలోని రాష్ట్రాల్లో వేర్వేరు తేదీల్లో ఎన్నికలు నిర్వహించేవారు. ఆ తర్వాత, దేశవ్యాప్తంగా ఒకే రోజున పోలింగ్ జరగాలనే చట్టం ప్రవేశపెట్టారు. ఆ కాలంలో, అమెరికా వ్యవసాయ ఆధారిత దేశంగా ఉండటంతో, నవంబర్ ప్రారంభంలో పంటలు చేతికి వచ్చిన తరువాత, రైతులు ఓటు వేయడానికి సులభంగా అందుబాటులో ఉండేవారు. ఆదివారం ఓటింగ్ ఉంటే, క్రైస్తవులు ప్రార్థనల కారణంగా పాల్గొనకుండా ఉండేవారు. తద్వారా, మంగళవారం ఓటింగ్ నిర్వహించడానికి అనుకూలమైన రోజుగా నిర్ణయించారు.
అమెరికా ఎన్నికల ప్రక్రియలో ప్రత్యేకతలు
భారత్ లో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పటి నుండి సందడి నెలకొంటుంది, అయితే, అమెరికాలో ఎన్నికలకు 9 నెలల ముందే పోలింగ్ ప్రక్రియ మొదలవుతుంది. ఆయా పార్టీలు తమ కాకస్‌లు, ప్రైమరీల ద్వారా తమ అధ్యక్ష అభ్యర్థిని ఎన్నుకుంటారు. కానీ అమెరికా అధ్యక్షుడిగా పోటీ చేయాలంటే, అభ్యర్థి నేచురల్ బోర్న్ అమెరికన్ సిటిజెన్ అయి ఉండాలి. కనీస వయసు 31 సంవత్సరాలు, కనీసం 14 సంవత్సరాలుగా అమెరికాలో నివాసం ఉండాలి.