Loading...
Goldy Brar: గోల్డీ బ్రార్ కోసం ఎఫ్‌బీఐ రూ.8.3 కోట్ల భారీ నజరానా.. టాప్ 10 జాబితాలో చోటు
గోల్డీ బ్రార్ కోసం ఎఫ్‌బీఐ రూ.8.3 కోట్ల భారీ నజరానా.. టాప్ 10 జాబితాలో చోటు

Goldy Brar: గోల్డీ బ్రార్ కోసం ఎఫ్‌బీఐ రూ.8.3 కోట్ల భారీ నజరానా.. టాప్ 10 జాబితాలో చోటు

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 29, 2026
08:29 am

ఈ వార్తాకథనం ఏంటి

భారత్‌కు చెందిన గ్యాంగ్‌స్టర్ సతిందర్‌జీత్ సింగ్ అలియాస్ గోల్డీ బ్రార్‌కు అమెరికా ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌బీఐ) భారీ రివార్డ్ ప్రకటించింది. బ్రార్‌ను తమ 'టాప్ 10 మోస్ట్ వాంటెడ్' జాబితాలో చేర్చిన ఎఫ్‌బీఐ.. అతడి ఆచూకీ తెలిపి అరెస్టుకు సహకరించే వారికి మిలియన్ డాలర్లు (సుమారు రూ.8.3 కోట్లు) అందించనున్నట్లు సోమవారం వెల్లడించింది. లాస్ ఏంజిల్స్ ఎఫ్‌బీఐ విభాగం ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. ఉత్తర అమెరికాలో లారెన్స్ బిష్ణోయ్ నేర సామ్రాజ్యానికి గోల్డీ బ్రార్ నాయకత్వం వహిస్తున్నాడని ఎఫ్‌బీఐ ఆరోపించింది. అమెరికా,కెనడాల్లో జరిగిన హత్యలు, కిడ్నాప్‌లు, దోపిడీలు, ఆయుధాల అక్రమ రవాణా, మాదకద్రవ్యాల సరఫరా వంటి పలు నేరాల్లో అతడికి సంబంధం ఉందని పేర్కొంది.

వివరాలు 

నిజ్జర్ హత్యలో ఆదేశాలు ఇచ్చినట్లు ఆరోపణ

ఈ వ్యవహారాలకు సంబంధించి లాస్ ఏంజిల్స్‌లోని ఫెడరల్ కోర్టులో బ్రార్‌పై పలు తీవ్రమైన అభియోగాలు నమోదయ్యాయి.

2023లో కెనడాలో సిక్కు వేర్పాటువాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యకు సంబంధించి కూడా ఎఫ్‌బీఐ బ్రార్‌పై ఆరోపణలు చేసింది.

జైలులో ఉన్న లారెన్స్ బిష్ణోయ్‌తో కలిసి నిజ్జర్ హత్యకు బ్రార్ ఆదేశాలు జారీ చేసినట్లు తన అభియోగాల్లో పేర్కొంది.

గతంలో బ్రార్ ఆచూకీ కోసం ఎఫ్‌బీఐ 50,000 డాలర్ల రివార్డ్ ప్రకటించింది. తాజాగా ఆ మొత్తాన్ని మిలియన్ డాలర్లకు పెంచింది.

''గోల్డీ బ్రార్ అత్యంత ప్రమాదకరమైన వ్యక్తి. అతడిని అరెస్టు చేయడం మాకు అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశం'' అని ఎఫ్‌బీఐ అధికారి పాట్రిక్ గ్రాండీ తెలిపారు.

వివరాలు 

ప్రజలు నేరుగా సంప్రదించొద్దు

గోల్డీ బ్రార్ వద్ద ఆయుధాలు ఉండే అవకాశం ఉన్నందున ప్రజలు అతడిని నేరుగా సంప్రదించవద్దని ఎఫ్‌బీఐ హెచ్చరించింది.

బ్రార్‌కు సంబంధించిన సమాచారం ఎవరికైనా తెలిస్తే తమ టోల్‌ఫ్రీ నంబర్‌కు తెలియజేయాలని కోరింది.

పంజాబ్‌కు చెందిన గోల్డీ బ్రార్ కోసం భారత్, కెనడాకు చెందిన దర్యాప్తు సంస్థలు కూడా ఇప్పటికే గాలిస్తున్నాయి.

ADVERTISEMENT