
Donald Trump golf club: ట్రంప్ గోల్ఫ్ క్లబ్ మీదుగా విమానం.. నో-ఫ్లై జోన్‌లోకి ప్రవేశించడంతో రంగంలోకి దిగిన ఫైటర్ జెట్‌లు
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉన్న సమయంలోనే, ఆయనకు చెందిన న్యూజెర్సీ రాష్ట్రం బెడ్‌మినిస్టర్‌లోని గోల్ఫ్ రిసార్ట్ వద్ద భారీ భద్రతా లోపం చోటుచేసుకుంది. రిసార్ట్ సమీప గగనతలంలోకి అనుమతి లేకుండా ఒక ప్రయాణికుల విమానం ప్రవేశించడంతో అప్రమత్తమైన భద్రతా వ్యవస్థ తక్షణమే యుద్ధ విమానాలను రంగంలోకి దించింది. ఈ ఘటన ఆదివారం జరిగింది.గోల్ఫ్ రిసార్ట్ వద్ద ఇప్పటికే అమలులో ఉన్న గగనతల ఆంక్షలను ఉల్లంఘిస్తూ ఆ ప్రయాణికుల విమానం ఆ దిశగా వచ్చి చేరింది. దీనిని గుర్తించిన యుద్ధ విమానాలు వెంటనే స్పందించాయి.ఆ విమానాన్ని ఆపడానికి, హెచ్చరిక ఇవ్వడానికి ప్రత్యేక రకమైన జ్వాలల (flares) ద్వారా సంకేతాలిచ్చాయి. ఈ చర్యలతో ఆ విమానం తిరిగి ఆ ప్రాంతం నుంచి వెళ్లిపోయింది.
వివరాలు
వారాంతంలో ఏడు భద్రతా ఉల్లంఘనల ఘటనలు
ఈ సమయంలో అధ్యక్షుడు ట్రంప్ రిసార్ట్‌లోనే ఉన్నారని నార్త్ అమెరికన్ ఏరోస్పేస్ డిఫెన్స్ కమాండ్ (NORAD) స్పష్టంచేసింది. వారాంతం (వీకెండ్)లో ఇలా ఏకంగా ఏడు భద్రతా ఉల్లంఘనల ఘటనలు జరిగినట్లు కూడా NORAD వెల్లడించింది. అధికారికమైన వ్యక్తులు, ముఖ్యంగా అధ్యక్షులు వంటి ఉన్నతస్థాయి నేతలు సందర్శించే ప్రదేశాల చుట్టుపక్కల ఫెడరల్ ఏవియేషన్ అధికారులు గగనతల పరిమితులను తాత్కాలికంగా మారుస్తూ ఉంటారు.
వివరాలు
భద్రతా లోపంపై సంబంధిత అధికార శాఖలు దర్యాప్తు
పైలట్లు వాటిని గమనిస్తూ తమ ప్రయాణాల్ని ప్లాన్ చేసుకోవాలి.కానీ అలాంటి మార్గదర్శకాలను సరిగ్గా గమనించనప్పుడే ఇలాంటి సంఘటనలు జరుగుతుంటాయని అధికారులు చెబుతున్నారు. ఇక ట్రంప్ వారాంతాల్లో తను అధిక సమయం గోల్ఫ్ క్లబ్‌లో గడుపుతూ ఉంటారు. ప్రతి ఆదివారం సాయంత్రం తిరిగి అధ్యక్ష భవనానికి (వైట్‌హౌస్) చేరుకుంటారు. ప్రస్తుతం జరిగిన భద్రతా లోపంపై సంబంధిత అధికార శాఖలు దర్యాప్తు ప్రారంభించాయి.