
USA: మాన్‌హట్టన్ కార్యాలయ భవనంలో కాల్పుల కలకలం.. ఐదుగురి మృతి
ఈ వార్తాకథనం ఏంటి
అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పుల ఘటన తీవ్ర కలకలం రేపింది. న్యూయార్క్ నగరంలోని ప్రసిద్ధ మాన్‌హట్టన్ ప్రాంతంలో చోటుచేసుకున్న ఈ భీకర సంఘటనలో న్యూయార్క్ సిటీకి చెందిన ఒక పోలీస్ అధికారితో సహా మొత్తం ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. ఈ కాల్పుల వల్ల పలువురు వ్యక్తులు గాయపడినట్లు సమాచారం. ఈ దాడి 44 అంతస్తుల ఆఫీస్ భవనంలో జరిగింది, ఈ భవనంలో బ్లాక్‌స్టోన్, ఎన్ఎఫ్ఎల్ వంటి ప్రముఖ సంస్థల ప్రధాన కార్యాలయాలు ఉన్నాయి. సోమవారం సాయంత్రం 6:30 గంటల సమయంలో 27 ఏళ్ల షేన్ తమురా అనే యువకుడు ఆ భవనంలోకి ప్రవేశించి తన వద్ద ఉన్న రైఫిల్‌తో విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు.
వివరాలు
సంఘటనా స్థలానికి ఎఫ్‌బీఐ
తరువాత అతను తనను తాను కాల్చుకున్నాడు. ఘటనాస్థలంలోనే అతను ప్రాణాలు కోల్పోయాడు. ఒక్కసారిగా కాల్పుల శబ్దం వ్యాపించడంతో భవనంలోని ఉద్యోగులు, సందర్శకులు భయాందోళనకు గురయ్యారు. ఒక్కొక్కరుగా భయంతో పరుగులు తీశారు. ఈ ఘటన జరిగిన వెంటనే ఫెడరల్ దర్యాప్తు సంస్థ అయిన ఎఫ్‌బీఐ సంఘటనా స్థలానికి చేరుకుంది. ఎఫ్‌బీఐ డిప్యూటీ డైరెక్టర్ డాన్ బోంజినో తన బృందంతో కలిసి సంఘటన స్థలంలో క్రైమ్ సీన్ విచారణకు సహకరిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం దర్యాప్తు సంస్థలు నిందితుడి దాడి వెనక ఉన్న ఉద్దేశాన్ని, ఇతను ఒంటరిగా ఈ చర్యకు పాల్పడ్డాడా లేదా ఎవరైనా మద్దతుదారులతో కలసి పని చేశాడా అనే కోణాల్లో లోతుగా పరిశీలిస్తున్నాయి.