Florida Airport: పామ్ బీచ్ ఎయిర్‌పోర్టుకు ట్రంప్ పేరు? రాష్ట్ర శాసనసభ ఆమోదం
ఈ వార్తాకథనం ఏంటి
ఫ్లోరిడా రాష్ట్రంలోని పామ్ బీచ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు పేరులో త్వరలో మార్పు జరగనుంది. ఈ విమానాశ్రయానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేరు పెట్టే దిశగా చర్యలు ప్రారంభమయ్యాయి. ఇందుకు సంబంధించిన ప్రతిపాదన బిల్లును రాష్ట్ర శాసనసభ ఆమోదించింది. ఈ బిల్లుపై ఫ్లోరిడా గవర్నర్ రాన్ డిశాంటిస్ త్వరలో సంతకం చేయనున్నట్లు సమాచారం. గవర్నర్ ఆమోదం అనంతరం, అధికారికంగా పేరు మార్పు అమల్లోకి రావాలంటే ఫెడరల్ ఏవియేషన్ సంస్థ నుంచి కూడా అనుమతి అవసరం ఉంటుంది. ట్రంప్ నివాసమైన 'మార్ ఎ లాగో' ఎస్టేట్‌కు సమీపంలో ఉన్న ఈ విమానాశ్రయం ప్రాంతం విశాలమైన ఇసుక తీరాలు, విలాసవంతమైన ఎస్టేట్‌లతో ప్రసిద్ధి చెందింది.
వివరాలు
అమెరికాలోని ప్రముఖ ప్రాంతాలకు తన పేరు ఉండాలని భావిస్తున్న ట్రంప్
స్థిరాస్తి రంగంలో వ్యాపారం చేస్తున్న ట్రంప్ పేరుతో ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా అనేక భవనాలు ఉన్నాయి. అయితే, అమెరికాలోని ప్రముఖ ప్రాంతాలకు తన పేరు ఉండాలని భావిస్తున్న ట్రంప్.. ఈ క్రమంలో వాషింగ్టన్‌లో ఉన్న కెనడీ స్మారక కాంప్లెక్స్ పేరును 'ట్రంప్-కెనడీ సెంటర్'గా మార్చే ప్రతిపాదనకు ఇప్పటికే ఆమోదం లభించినట్లు సమాచారం. అలాగే, న్యూయార్క్ నగరంలోని ప్రధాన రవాణా కేంద్రం అయిన పెన్ స్టేషన్‌కు, వాషింగ్టన్‌లోని డల్లెస్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుకు తన పేరు పెట్టే ప్రయత్నాలు కూడా జరిగినప్పటికీ, వాటిపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైనట్లు తెలిసింది.