Page Loader
Emmanuel Macron: ఫ్రాన్స్ ప్రభుత్వం కీలక నిర్ణయం.. 15 ఏళ్లలోపు పిల్లలకు త్వరలో సోషల్ మీడియాపై నిషేధం.. 
ఫ్రాన్స్ ప్రభుత్వం కీలక నిర్ణయం.. 15 ఏళ్లలోపు పిల్లలకు త్వరలో సోషల్ మీడియాపై నిషేధం..

Emmanuel Macron: ఫ్రాన్స్ ప్రభుత్వం కీలక నిర్ణయం.. 15 ఏళ్లలోపు పిల్లలకు త్వరలో సోషల్ మీడియాపై నిషేధం.. 

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 11, 2025
05:00 pm

ఈ వార్తాకథనం ఏంటి

పిల్లలు సోషల్ మీడియా వేదికలను వినియోగించకుండా నియంత్రించేందుకు ఫ్రాన్స్ ప్రభుత్వం చర్యలకు శ్రీకారం చుట్టింది. 15ఏళ్ల లోపు వయసు గల పిల్లలు సామాజిక మాధ్యమాలను వాడకుండా అడ్డుకునేలా త్వరలోనే కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ స్పష్టం చేశారు. యూరోపియన్ యూనియన్‌ (ఈయూ) ఈ అంశంలో ముందడుగు వేయకపోతే, వచ్చే నెలల్లో ఫ్రాన్స్‌ స్వయంగా ఈ నిబంధనలను అమలు చేస్తుందని ఆయన హెచ్చరించారు. తూర్పు ఫ్రాన్స్‌లోని నోజెంట్ అనే ప్రాంతంలోని ఒక పాఠశాలలో 14 ఏళ్ల విద్యార్థి తన బ్యాగ్‌ను తనిఖీ చేస్తున్న సిబ్బందిపై కత్తితో దాడి చేసి హత్య చేశాడు. ఈ సంఘటన దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిన సమయంలోనే మెక్రాన్ ఈ ప్రకటన చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.

వివరాలు 

చిన్నారులు, టీనేజర్లపై సోషల్ మీడియా ప్రభావం

ఈ మేరకు ఆయన ఓ టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 15 ఏళ్లలోపు బాలలపై సామాజిక మాధ్యమాల నిషేధం అవసరమని అభిప్రాయపడ్డారు. ఈయూ చర్యలు తీసుకోకపోతే కొన్ని నెలల గడువు ఇచ్చి, ఆ తర్వాత ఫ్రాన్స్‌తానే ముందడుగు వేస్తుందని స్పష్టం చేశారు. నేటి యువతలో హింసాత్మక ప్రవర్తన పెరుగుతోందని, డిజిటల్‌ ప్లాట్‌ఫామ్స్‌ పట్ల పర్యవేక్షణ లేకపోవడం వల్లే ఈ ధోరణి విస్తరిస్తోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో చిన్నారులు, టీనేజర్లపై సోషల్ మీడియా ప్రభావంపై ఇప్పటికే అనేక దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. మెక్రాన్ వ్యాఖ్యలు ఈ పరిణామాల్లో మరింత ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.

వివరాలు 

16 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియా వాడకాన్ని నిషేధించిన  ఆస్ట్రేలియా 

ఇక నోజెంట్‌ ఘటనలో కత్తితో దాడి చేసిన బాలుడు ఆన్‌లైన్‌లో చూసిన కంటెంట్‌ వల్ల ప్రేరేపితుడయ్యాడా? అన్న విషయం ఇంకా నిర్ధారణ కాలేదు. అయినా సామాజిక మాధ్యమాల వేదికల ద్వారా యువతలో ఉగ్రత, మితిమీరిన స్వభావం పెరుగుతోందన్న అభిప్రాయాన్ని మెక్రాన్‌తో పాటు పలువురు ప్రభుత్వ అధికారులు వెల్లడించారు. ఈ నిర్ణయం అమలయితే, ఫ్రాన్స్‌ ఈ తరహా నిషేధం తీసుకొచ్చిన ప్రపంచంలోని రెండో దేశంగా నిలుస్తుంది. ఇంతకుముందు 2023లో ఆస్ట్రేలియా 16 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియా వాడకాన్ని నిషేధించిన తొలి దేశంగా చరిత్రలో నిలిచిన విషయం విదితమే.