LOADING...
Oil tanker collision: ఆయిల్‌ ట్యాంకర్, సరుకు నౌక ఢీ.. సిబ్బంది సురక్షితం 
ఆయిల్‌ ట్యాంకర్, సరుకు నౌక ఢీ.. సిబ్బంది సురక్షితం

Oil tanker collision: ఆయిల్‌ ట్యాంకర్, సరుకు నౌక ఢీ.. సిబ్బంది సురక్షితం 

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 11, 2025
10:08 am

ఈ వార్తాకథనం ఏంటి

ఇంగ్లండ్ తూర్పు తీరంలో ఆయిల్ ట్యాంకర్, సరుకు నౌక మధ్య జరిగిన ఘర్షణలో రెండు ఓడలు మంటల్లో చిక్కుకున్నాయి. హల్ తీరానికి సమీపంలో సోమవారం ఉదయం 9:48గంటల సమయంలో ఈ ప్రమాదం సంభవించింది. రెండు నౌకల్లో ప్రయాణిస్తున్న మొత్తం 37 మంది సురక్షితంగా రక్షించబడినట్లు రవాణా శాఖ మంత్రి తెలిపారు అని స్థానిక ప్రజా ప్రతినిధి గ్రాహం స్టువార్ట్ వెల్లడించారు. గాయాలపాలైన ఒక వ్యక్తిని ఆస్పత్రిలో చేర్పించినట్లు పేర్కొన్నారు. గ్రీస్ నుంచి వచ్చిన అమెరికాకు చెందిన ఎంవీ స్టెనా ఇమాక్యులేట్ అనే ఆయిల్ ట్యాంకర్ గ్రీమ్స్‌బీ పోర్టులో లంగర్ వేసి ఉంది. అదే సమయంలో,స్కాట్లాండ్ నుంచి నెదర్లాండ్స్‌లోని పోటర్‌డ్యామ్ వైపు వెళ్తున్న పోర్చుగల్‌కు చెందిన సొలొంగ్ అనే సరుకు నౌక ట్యాంకర్‌ను ఢీకొట్టింది.

వివరాలు 

లైఫ్‌బోట్ల ద్వారా  ప్రయాణీకులను రక్షించి.. 

ఈ ప్రమాదం కారణంగా రెండు ఓడల్లో మంటలు చెలరేగాయి. సరుకు నౌకలో సోడియం సైనైడ్ అనే అత్యంత విషపూరిత రసాయనం కలిగి ఉన్న కంటైనర్లు ఉన్నట్లు సమాచారం. దీనిని దృష్టిలో ఉంచుకుని బ్రిటన్ మారిటైం కోస్ట్‌గార్డ్ ఏజెన్సీ అత్యవసరంగా లైఫ్‌బోట్లను, రెస్క్యూ హెలికాప్టర్‌ను ఘటనాస్థలానికి పంపించింది. నౌకల నుండి బయటకు దూకిన ప్రయాణీకులను లైఫ్‌బోట్ల ద్వారా రక్షించి ఒడ్డుకు చేర్చారు. అమెరికాకు చెందిన మారిటైం మేనేజ్‌మెంట్ సంస్థ క్రౌలీ ప్రకారం,స్టెనా ఇమాక్యులేట్ ట్యాంకర్‌లో జెట్-ఏ1 ఇంధనం రవాణా అవుతోంది.

వివరాలు 

 సురక్షితంగా 23 మంది సిబ్బంది 

సరుకు నౌక ఢీకొట్టడంతో ట్యాంకర్‌ దెబ్బతిని ఇంధనం లీక్ కావడంతో మంటలు తీవ్రంగా వ్యాపించాయి. మంటల వల్ల పలుమార్లు పేలుళ్లు సంభవించినట్లు అధికారులు తెలిపారు. అయితే, ట్యాంకర్ నౌకలో ఉన్న మొత్తం 23 మంది సిబ్బంది పూర్తిగా సురక్షితంగా ఉన్నారు అని క్రౌలీ సంస్థ స్పష్టం చేసింది. ఈ సంస్థ ప్రధానంగా అమెరికా సైన్యానికి అవసరమైన ఇంధనాన్ని సరఫరా చేస్తుంది.