Al-Thani family: గోల్డెన్ ప్యాలెస్,$400 మిలియన్ యాచ్,మూడు జెట్‌లు: కళ్లు చెదిరేలా ఖతర్ పాలకుడి సంపద
ఈ వార్తాకథనం ఏంటి
అధికారిక పర్యటనలో భాగంగా భారత్‌కు వచ్చిన ఖతార్ (Qatar) అమీర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్‌థానీకి విమానాశ్రయంలో ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ఆత్మీయ స్వాగతం పలికారు.
ఇరుదేశాల మధ్య వాణిజ్య సంబంధాలను మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా మోదీ, అల్‌థానీ మధ్య కీలక చర్చలు జరిగాయి.
ఈ సందర్భంగా ద్వైపాక్షిక వాణిజ్యాన్ని గణనీయంగా పెంచేందుకు నిర్ణయం తీసుకుని, దాదాపు రూ.2.43 లక్షల కోట్ల (28 బిలియన్ డాలర్లు) వ్యాపార విలువ సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
వివరాలు
ప్రపంచంలోని అత్యంత సంపన్న దేశాల్లో ఒకటైన ఖతర్ పాలకుడు అల్‌థానీ అపార ఆస్తుల్ని కలిగి ఉన్నారని మీకు తెలుసా?
ఖతర్ దేశం ఏర్పాటైనప్పటి నుంచి అల్‌థానీ కుటుంబమే (Al-Thani family) అధికారంలో ఉంది.
ప్రస్తుతం వారి వంశంలోని 11 మందికి అమీర్ (రూలర్) హోదా ఉంది. సహజవాయువు, చమురు నిల్వల ద్వారా ప్రపంచంలో గొప్ప స్థానం దక్కించుకున్న ఈ దేశం, 2013 నుంచి షేక్ తమీమ్ బిన్ హమద్ అల్‌థానీ పాలనలో ఉంది.
బ్లూమ్‌బర్గ్ నివేదిక ప్రకారం, అల్‌థానీ వంశానికి చెందిన ఆస్తుల మొత్తం విలువ 335 బిలియన్ డాలర్లు. ఇందులో షేక్ తమీమ్ వద్దే దాదాపు రెండు బిలియన్ డాలర్ల విలువైన ఆస్తులు ఉన్నట్లు అంచనా.
సహజవనరులే కాకుండా, విదేశాల్లో పెట్టుబడుల ద్వారా ఈ కుటుంబం ప్రపంచంలోని అత్యంత ధనిక కుటుంబాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది.
వివరాలు
"గోల్డెన్ ప్యాలెస్"
దోహాలోని విలాసవంతమైన రాయల్ ప్యాలెస్, దాదాపు ఒక బిలియన్ డాలర్ల విలువ కలిగిన సముదాయంగా పేర్కొనబడింది.
స్వర్ణంతో మెరిసే ఇంటీరియర్ కలిగి ఉండటంతో దీనిని "గోల్డెన్ ప్యాలెస్" అని కూడా పిలుస్తారు.
ఈ భవన సముదాయంలో 15 ప్రదేశాలు, 500 కార్లకు చోటు కల్పించే పార్కింగ్ స్థలం ఉంది.
అదనంగా, ఒమన్‌లో వైట్ ప్యాలెస్, లండన్‌లో 17 బెడ్రూంలతో విలాసవంతమైన భవనం, అలాగే పారిస్, న్యూయార్క్‌లలో ఖరీదైన నివాసాలు ఉన్నట్లు సమాచారం.
ఇదే కాకుండా,అల్‌థానీ కుటుంబానికి 400 మిలియన్ డాలర్ల విలువైన అత్యంత ఆధునిక నౌక కూడా ఉంది.
వీరు ఖతర్ అమీరి ఫ్లైట్ పేరిట ప్రత్యేక విమానయాన సంస్థను నిర్వహిస్తున్నారు, ఇది 1977లో స్థాపించబడింది.
వివరాలు
ప్రీమియం కార్ల కలెక్షన్
ఈ సంస్థలో ప్రధానంగా రాయల్ ఫ్యామిలీ సభ్యులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు మాత్రమే ప్రయాణిస్తారు.
మొత్తం 14 విమానాలను ఈ సంస్థ నిర్వహిస్తోంది, ఇందులో మూడు బోయింగ్ జెట్‌లు ఉన్నాయి.
అలాగే, లగ్జరీ కార్ల సంగతికొస్తే, బుగట్టి, చిరాన్, లంబోర్గిని, రోల్స్ రాయిస్ వంటి ప్రీమియం కార్ల కలెక్షన్ ఈ కుటుంబానికి ఉంది.
కళలపై ఈ కుటుంబానికి అపారమైన అభిరుచి ఉంది. ప్రపంచ ప్రఖ్యాత కళాకారులు పాల్ సెజాన్, మార్క్ రొత్కో వంటి వారి చేత చిత్రించబడిన కళాఖండాలను వందల మిలియన్ డాలర్లు వెచ్చించి సొంతం చేసుకున్నారు.
వివరాలు
ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో భారీ పెట్టుబడులు
అంతేకాదు, ఖతర్ స్పోర్ట్స్ ఇన్వెస్ట్‌మెంట్ (QSI) ద్వారా ప్రపంచవ్యాప్తంగా క్రీడారంగంలో పెట్టుబడులు పెట్టారు.
వివిధ ఫుట్‌బాల్ క్లబ్బులను కొనుగోలు చేసి, వాటిని అభివృద్ధి చేశారు. 2022 ఫిఫా వరల్డ్ కప్‌కి ఖతర్ ఆతిథ్యం ఇవ్వడం ఈ దేశం క్రీడా రంగంలో ఎంతటి ప్రాముఖ్యత కలిగి ఉందో రుజువు చేస్తుంది.
అంతేకాక, ఖతర్ ఇన్వెస్ట్‌మెంట్ అథారిటీ (QIA) ద్వారా ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో భారీ పెట్టుబడులు పెట్టడం షేక్ తమీమ్ ఆధ్వర్యంలోనే జరుగుతోంది.