Mumbai Attack Mastermind: హఫీజ్ భుట్టవీ మృతిని ధృవీకరించిన ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి
హఫీజ్ సయీద్‌కు డిప్యూటీగా ఉన్న లష్కరే తోయిబా (LET) వ్యవస్థాపక సభ్యుడు హఫీజ్ అబ్దుల్ సలామ్ భుట్టవీ మరణించినట్లు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి గురువారం ధ్రువీకరించింది. అతను 2008లో 26/11 దాడులకు కూడా కీలక కుట్రదారుడు.అతను మే 2023లో గుండెపోటుతో మరణించాడని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తెలిపింది. 26/11 ముంబై దాడులలో 166 మంది మరణించగా, 300 మంది గాయపడ్డారు. అలాగే, హఫీజ్ సయీద్ ను భారతదేశానికి అప్పగించాలని పాకిస్థాన్ కు భారత ప్రభుత్వం ఇటీవల అభ్యర్థించింది. 77 ఏళ్ల భుట్టవీ పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లోని మురిడ్కేలో పాకిస్థాన్ ప్రభుత్వ కస్టడీలో ఉండగానే మరణించారని UN తన అధికారిక వెబ్‌సైట్‌లో ప్రెస్ నోట్‌లో పేర్కొంది.
హఫీజ్ సయీద్ కు 78 ఏళ్ల జైలు శిక్ష
ఐక్యరాజ్యసమితి భద్రతామండలి కూడా 2002 మధ్యలో, పాకిస్తాన్‌లోని లాహోర్‌లో LeT సంస్థాగత స్థావరాన్ని స్థాపించడానికి భుట్టవీ ఇన్‌ఛార్జ్‌గా ఉన్నారని పేర్కొంది. భుట్టవీ 29 మే 2023న పంజాబ్ ప్రావిన్స్‌లోని మురిడ్కేలో పాకిస్తాన్ ప్రభుత్వ నిర్బంధంలో ఉన్నప్పుడు గుండెపోటుతో మరణించాడు" అని UNSC ఒక ప్రకటన లో తెలిపింది. ముంబై ఉగ్రదాడుల తర్వాత కొన్ని రోజుల తర్వాత హఫీజ్ సయీద్‌ను నిర్బంధించిన కాలంలో భుట్టవీ గ్రూప్ రోజువారీ కార్యక్రమాల బాధ్యతలను తీసుకున్నారని పేర్కొంది. జూన్ 2009లో హఫీజ్ సయీద్ పాకిస్తాన్ అధికారుల నిర్బంధం నుండి విడుదలయ్యాడు. ప్రస్తుతం, ముంబై ఉగ్రదాడి సూత్రధారి,జమాత్-ఉద్-దవా చీఫ్ హఫీజ్ సయీద్ పాకిస్తాన్‌లో 78 ఏళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్నాడు.