Sheikh Hasina: అరెస్టు చేసినా వెనక్కి తగ్గను.. ఢాకాకు తిరిగొస్తా: షేక్ హసీనా
ఈ వార్తాకథనం ఏంటి
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా కీలక వ్యాఖ్యలు చేశారు. అరెస్టు, జైలు శిక్ష, చివరికి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉన్నా.. తాను తిరిగి ఢాకాకు వస్తానని స్పష్టం చేశారు. ఈ ప్రమాదాల గురించి తనకు పూర్తిగా తెలుసని, అయితే తాను నమ్మిన విషయాల కోసం ముందడుగు వేయడానికి భయం ఎప్పుడూ అడ్డుకాలేదని చెప్పారు. ఐఏఎన్ఎస్ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. "నేను బంగ్లాదేశ్‌లో అడుగుపెట్టిన వెంటనే అరెస్టు చేయవచ్చు. జైలుకు పంపవచ్చు. చివరికి చంపేందుకు కూడా ప్రయత్నించవచ్చు" అని హసీనా పేర్కొన్నారు.
వివరాలు
భయం నన్నెప్పుడూ ఆపలేదు: హసీనా
1981లో సైనిక పాలన కొనసాగుతున్న సమయంలోనే హసీనా బంగ్లాదేశ్‌కు తిరిగి వచ్చారు.
ఆ తర్వాత 2007లో సైన్యం మద్దతుతో ఏర్పడిన ప్రభుత్వం ఉన్న సమయంలోనూ స్వదేశానికి చేరుకున్నారు.
గతంలో జైలు శిక్షలు, హత్యాయత్నాలను ఎదుర్కొన్నానని ఆమె గుర్తుచేశారు.
"నేను నమ్మిన విషయాల కోసం పోరాడటానికి భయం ఎప్పుడూ నన్ను ఆపలేదు" అని స్పష్టం చేశారు.
ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో నెలకొన్న పరిస్థితులపై ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.
అవామీ లీగ్ నేతలను లక్ష్యంగా చేసుకుని వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. సామాన్య ప్రజలు కూడా ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.
వివరాలు
రాజకీయాలను బట్టి న్యాయం మారుతుందా?: హసీనా
2024లో జరిగిన ఉద్యమం సందర్భంగా హత్యలకు ఆదేశాలు ఇచ్చారన్న ఆరోపణలను హసీనా ఖండించారు.
ఆ మరణాలపై న్యాయ విచారణను మాజీ తాత్కాలిక ప్రభుత్వ అధినేత మహమ్మద్ యూనస్ నిలిపివేశారని ఆరోపించారు.
రాజకీయ పార్టీని బట్టి న్యాయ విచారణలో వేర్వేరు ప్రమాణాలు ఎందుకు పాటిస్తున్నారని ప్రశ్నించారు.
"నిజాలు బయటకు రావాలనే ఉద్దేశం వారికుంటే.. నేను ఇప్పటికే ప్రారంభించిన న్యాయ విచారణను ఎందుకు నిలిపివేశారు?" అని హసీనా ప్రశ్నించారు.
వివరాలు
ట్రైబ్యునల్ తీర్పును అంగీకరించని షేక్ హసీనా
బంగ్లాదేశ్ అంతర్జాతీయ నేరాల ట్రైబ్యునల్ (ఐసీటీ) నిర్వహించిన విచారణతో పాటు తనకు వ్యతిరేకంగా వెలువడిన తీర్పును కూడా హసీనా తిరస్కరించారు.
తన వాదనలను వినిపించుకునేందుకు సరైన అవకాశం ఇవ్వలేదని ఆరోపించారు.
"ఆ తీర్పును సవాలు చేసేందుకు చట్టపరంగా అందుబాటులో ఉన్న అన్ని మార్గాలను పరిశీలిస్తా" అని తెలిపారు.
ఎన్ని సవాళ్లు ఎదురైనా బంగ్లాదేశ్‌కు తిరిగి రావాలన్న నిర్ణయంలో మార్పు లేదని స్పష్టం చేశారు. తన ప్రజలకు అండగా నిలవడమే తన లక్ష్యమని చెప్పారు. "నాకు ఏం జరిగినా.. బంగ్లాదేశ్ ప్రజల పక్కనే ఉండాలని కోరుకుంటున్నా" అని హసీనా పేర్కొన్నారు.