LOADING...
China: చైనాలోని షావోలిన్ ఆలయ'పీఠాధిపతి' అక్రమ సంబంధాలు వెలుగులోకి! 
చైనాలోని షావోలిన్ ఆలయ'పీఠాధిపతి' అక్రమ సంబంధాలు వెలుగులోకి!

China: చైనాలోని షావోలిన్ ఆలయ'పీఠాధిపతి' అక్రమ సంబంధాలు వెలుగులోకి! 

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 28, 2025
08:31 am

ఈ వార్తాకథనం ఏంటి

ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి పొందిన చైనాలోని ఓ ప్రముఖ బౌద్ధ ఆలయం ఇటీవల తీవ్రమైన వివాదంలో చిక్కుకుంది. మార్షల్‌ ఆర్ట్స్‌కు పేరు గాంచిన ఈఆలయ అధిపతి పై నేర ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆయన ఆలయ నిధులను దుర్వినియోగం చేయడమే కాకుండా,అనేక మహిళలతో అసభ్య సంబంధాలు పెట్టుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఇవి బౌద్ధధర్మశాస్త్రాలకు విరుద్ధమని ఆలయవర్గాలు స్పష్టం చేశాయి.దీనిపై దర్యాప్తు ప్రారంభించామని కూడా వెల్లడించాయి. ఈ ఆలయం చైనా హెనాన్‌ ప్రావిన్సులోని షావోలిన్‌ ఆలయం.కుంగ్‌ ఫూ శిక్షణకు ఇది విశ్వవ్యాప్తంగా ప్రసిద్ధి పొందింది. షి యోంగ్సిన్‌ అనే బౌద్ధ సన్యాసి ఈ ఆలయానికి ప్రధానిగా ఉన్నారు. అయితే ఆయనపై ఆలయ ఆర్థిక వనరులను తప్పుగా వినియోగించారని,అదేసమయంలో పలు మహిళలతో లైంగిక సంబంధాలు కొనసాగించారనే ఆరోపణలు వచ్చాయి.

వివరాలు 

కుంగ్‌ ఫూ,మార్షల్‌ ఆర్ట్స్‌ కు  ఈ ఆలయం ప్రసిద్ధి 

అంతేకాకుండా, ఆయన ఓ చిన్నారికి అక్రమంగా తండ్రిగా ఉన్నట్లు కూడా గుర్తించినట్లు సమాచారం. ఇవన్నీ బౌద్ధ నియమావళిని ఖండించేవేనని ఆలయ అధికారులు వ్యాఖ్యానించారు. ప్రస్తుతం వివిధ విభాగాలకు చెందిన అధికారులు ఈ ఘటనపై విచారణ చేపట్టారని, దీనికి సంబంధించిన వివరాలను సకాలంలో వెల్లడిస్తామని తెలిపారు. ఈ క్షేత్రం సాంగ్‌ పర్వతాల కింద 495 క్రీస్తుశకంలో నిర్మించారు. సుమారు 1500 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ ఆలయం మతపరంగా, చారిత్రకంగా అత్యంత ప్రాముఖ్యత కలిగి ఉండటంతో పాటు, కుంగ్‌ ఫూ వంటి మార్షల్‌ ఆర్ట్స్‌ కోసమూ ప్రసిద్ధి చెందింది. ప్రపంచం నలుమూలల నుండి విద్యార్థులు ఇక్కడికి వచ్చి శిక్షణ పొందుతుంటారు. పర్యాటక దృష్టికోణంలోనూ ఈ ఆలయం విశేష ఆదరణ పొందింది.

వివరాలు 

 1999లో షావోలిన్‌ ఆలయ ప్రధానిగా షి యోంగ్సిన్‌

చైనాలో పేరుపొందిన బౌద్ధ సన్యాసుల్లో షి యోంగ్సిన్‌ ఒకరు. ఆయనపై గతంలోనూ వివాదాస్పద ఆరోపణలు వచ్చాయి. ఎంబీఏ చదివిన ఆయనను 1999లో షావోలిన్‌ ఆలయ ప్రధానిగా నియమించారు. ఆర్థికంగా ఈ ఆలయాన్ని అభివృద్ధి చేస్తూ, 'సీఈవో మాంక్‌' అనే ముద్రను తనపై ముద్రించుకున్నారు. 2006లో స్థానిక ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ఓ విలాసవంతమైన కారును ఆయన బహుమతిగా పొందినట్లు వార్తలొచ్చి విమర్శలకు తావిచ్చాయి. 2015లో ఆస్ట్రేలియాలో కోట్ల రూపాయలతో ఓ ఆలయాన్ని, హోటల్‌ను, కుంగ్‌ ఫూ శిక్షణ కేంద్రాన్ని, గోల్ఫ్‌ కోర్సును నిర్మించాలన్న ప్రణాళిక ఆయన రూపొందించగా, అది తీవ్ర స్థాయిలో వివాదానికి దారి తీసింది.