
America: అమెరికా తూర్పు తీరాన్ని ముంచెత్తిన కుండపోత వర్షాలు..రోడ్లన్నీ జలమయం,విమాన సర్వీసులు నిలిపివేత
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా తూర్పు తీర ప్రాంతాల్లో గురువారం కురిసిన కుండపోత వర్షాలు బీభత్సాన్ని సృష్టించాయి. ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం వల్ల అనేక ప్రాంతాలు వరదల్లో మునిగిపోయాయి. ఫిలడెల్ఫియా నుంచి న్యూయార్క్ వరకు రహదారులన్నీ వరద నీటితో నిండిపోవడంతో వాహనదారులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. వర్షాల తీవ్రత కారణంగా ఆ ప్రాంతాల్లో విమానాల రాకపోకలు నిలిచిపోయాయి. లోతట్టు ప్రాంతాల్లో నీటిలో చిక్కుకున్న వాహనదారులను రక్షించేందుకు సహాయక బృందాలు రంగంలోకి దిగాయి.
వివరాలు
న్యూయార్క్‌లో పరిస్థితి అత్యంత విషమంగా మారింది
న్యూయార్క్ నగరంలో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ప్రధాన రహదారులను కొంతసేపు మూసివేయాల్సి వచ్చింది. సాయంత్రం రద్దీ సమయంలో రైల్వే స్టేషన్లు వరద నీటితో నిండిపోయాయి. మాన్‌హట్టన్‌లోని గ్రాండ్ సెంట్రల్ టెర్మినల్ ప్లాట్‌ఫారమ్ వద్ద నిలిపిన రైల్లోకి వర్షపు నీరు ప్రవహిస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. బ్రూక్లిన్ వీధుల్లో ఒక బస్సు వరదలో నడుస్తుండగా నీరు లోపలికి ప్రవేశించిన దృశ్యాలు జనాలను ఆశ్చర్యానికి గురిచేశాయి. లాంగ్ ఐలాండ్‌కు వెళ్తున్న రైల్లో నీరు అధికంగా చేరడంతో ప్రయాణికులను ఫైర్ డిపార్ట్‌మెంట్ సిబ్బంది సురక్షితంగా బయటకు తరలించారు. లాంగ్ ఐలాండ్, న్యూజెర్సీలోని పలు రైలు మార్గాల్లో రాకపోకలు నిలిచిపోయాయి లేదా ఆలస్యమయ్యాయి.
వివరాలు
ఫిలడెల్ఫియా - విల్మింగ్టన్ మధ్య రైళ్లు నిలిపివేత
ఫిలడెల్ఫియా, విల్మింగ్టన్ మధ్య నడిచే అమ్‌ట్రాక్ రైళ్లను తాత్కాలికంగా నిలిపివేసినట్టు అధికారులు ప్రకటించారు. ట్రాక్‌లపై వరద నీరు ప్రవహిస్తున్నందున ఇది అనివార్యమైంది. పరిస్థితి చక్కబడిన తర్వాతే రైలు సేవలు పునఃప్రారంభమవుతాయని, అప్పటివరకు ప్రయాణికులు ఓర్పుతో ఉండాలంటూ రైల్వే అధికారులు X (మునుపటి ట్విట్టర్)లో పేర్కొన్నారు.
వివరాలు
క్వీన్స్ ప్రాంతంలో వరద నీటిలో మునిగిన కార్లు
న్యూయార్క్ నగరంలోని క్వీన్స్ ప్రాంతంలో కొన్ని వాహనాలు పూర్తిగా వరద నీటిలో మునిగిపోయాయి. వాటి పైకప్పులపై ప్రజలు నిలబడి ఉండటాన్ని ట్రాఫిక్ కెమెరాలు,సామాజిక మాధ్యమాల్లో స్పష్టంగా చూపించాయి. ఒక చోట ట్రాక్టర్ ట్రైలర్ కూడా నీటిలో నిమగ్నమైందని ప్రత్యక్షదర్సులు తెలిపారు. పోలీసుల సహాయంతో అందులో చిక్కుకున్న ఇద్దరు వ్యక్తులను సురక్షితంగా బయటకు తీసి వచ్చారు. పరిస్థితి మెరుగుపడిన తర్వాత ట్రాఫిక్‌ను మళ్లీ పునరుద్ధరించారు. వర్షాలు శుక్రవారం మధ్యాహ్నం వరకూ కొనసాగవచ్చని అంచనా ఈ వర్షాలు శుక్రవారం మధ్యాహ్నం వరకు కొనసాగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అందువల్ల ప్రజలు బయటకు రావద్దని మేయర్ ఎరిక్ ఆడమ్స్ విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా బేస్‌మెంట్ అపార్ట్‌మెంట్‌లలో నివసించే వారు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని హెచ్చరించారు.
వివరాలు
పెన్సిల్వేనియాలో 7.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు
పెన్సిల్వేనియాలో గంటకు సుమారు 7.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని నేషనల్ వెదర్ సర్వీస్ తెలిపింది. ఫిలడెల్ఫియా నుంచి 96 కిలోమీటర్ల దూరంలోని రీడింగ్ ప్రాంతంలో భారీ వరదలు వచ్చాయి. రోడ్లపై నిలిచిన వాహనాలు నీటిలో మునిగిపోయిన దృశ్యాలు, ఇరుకైన వీధుల్లోకి వరద నీరు ప్రవహిస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అక్కడ కొన్ని వీధులు, అండర్‌పాస్‌లు పూర్తిగా మూసివేశారు.
వివరాలు
బాల్టిమోర్ లో అత్యవసర ఆశ్రయ కేంద్రాలు
మెరిలాండ్‌లోని బాల్టిమోర్‌కు ఈశాన్యంగా ఉన్న ప్రాంతాల్లో వరదలలో చిక్కుకున్న అనేక మందిని అత్యవసర బృందాలు రక్షించాయి. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు మరింత పడే అవకాశం ఉన్న నేపథ్యంలో అక్కడి అధికారులు ముందుజాగ్రత్త చర్యలుగా కొన్నిచోట్ల రహదారులను, పాఠశాలలు, లైబ్రరీలను మూసివేశారు. ప్రజల కోసం అత్యవసర ఆశ్రయ కేంద్రాలు ఏర్పాటు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా వరద హెచ్చరికలు జారీ చేశారు.
వివరాలు
విమాన సర్వీసులు నిలిపివేత
న్యూయార్క్, న్యూజెర్సీ, ఫిలడెల్ఫియా విమానాశ్రయాల్లో గురువారం సాయంత్రం అనేక విమానాలు ఆలస్యమయ్యాయి. కొన్నింటిని రద్దు చేశారు. న్యూజెర్సీలో టోర్నడో హెచ్చరికలు జారీ అయినప్పటికీ అవి సాక్షాత్కారంగా జరగలేదు. అయితే గురువారం సాయంత్రం నాటికి 14,000 మందికి పైగా విద్యుత్ వినియోగదారులకు కరెంట్ సరఫరా నిలిచిపోయింది.
వివరాలు
అత్యవసర పరిస్థితి ప్రకటించిన న్యూయార్క్, న్యూజెర్సీ
న్యూయార్క్ నగరం, న్యూజెర్సీలో అధికారులు అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. అయితే న్యూయార్క్‌లో గురువారం రాత్రికి ఫ్లాష్ ఫ్లడ్ హెచ్చరికలు ఉపసంహరించారు. తూర్పు తీరంలోని కొన్ని ప్రాంతాల్లో శుక్రవారం ఉదయం వరకు భారీ వర్షాలు, వరదల హెచ్చరికలు కొనసాగుతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. 10 నుంచి 15 సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. చిన్న వాగులు, వంకలు, రోడ్లు, అండర్‌పాస్‌లు, డ్రైనేజీ సౌకర్యం లేని ప్రాంతాల్లో వరదలు వచ్చే అవకాశం ఉందని హెచ్చరించింది. అలాగే ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడే సూచనలు ఉన్నాయని పేర్కొంది.