Israel - Hezbollah: ఇజ్రాయెల్పై రాకెట్లతో దాడి చేసిన హెజ్బొల్లా..
ఇజ్రాయెల్ మధ్య ప్రాంతంపై హెజ్‌బొల్లా మంగళవారం రాకెట్ దాడులకు దిగింది. అయితే, ఈ దాడులను ఇజ్రాయెల్ సైన్యం సమర్థవంతంగా అడ్డగించింది. దాడిలో ఒక రాకెట్ నిర్మానుష్య ప్రాంతంలో పడగా, ఒక రిజర్విస్టు సైనికుడు మరణించాడని సమాచారం. ఈ పరిణామాలతో, సుమారు 10 లక్షల మంది ఇజ్రాయెల్ ప్రజలు సురక్షిత బంకర్లలోకి వెళ్ళిపోవాల్సి వచ్చింది. అలాగే, విమాన ప్రయాణాలపై కూడా తాత్కాలికంగా ప్రభావం పడింది. దీని తోడుగా, సోమవారం రాత్రి ఇజ్రాయెల్ దాడిలో 13 మంది లెబనాన్ పౌరులు మరణించారని అక్కడి అధికారులు తెలిపారు. ఇజ్రాయెల్‌లో పర్యటిస్తున్న అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్, కాల్పుల విరమణకు అవకాశం తక్కువగా ఉందని వ్యాఖ్యానించారు.
అంతర్జాతీయ విమానాశ్రయంలో రాకపోకలకు అంతరాయం
ఇజ్రాయెల్ సైన్యం ప్రకారం, హెజ్‌బొల్లా మొత్తం 5 రాకెట్లను ప్రయోగించగా, క్షిపణి రక్షణ వ్యవస్థ వాటిలో నాలుగిటిని అడ్డుకుంది. ఒక రాకెట్ నిర్మానుష్య ప్రాంతంలో పడింది, అయితే ఈ సంఘటన వల్ల బెన్ గురియన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో రాకపోకలకు కొంతసమయం అంతరాయం కలిగింది. ఇక, బీరుట్‌లోని ఆసుపత్రి ప్రాంతంపై ఇజ్రాయెల్ దాడులు జరిపినట్లు, ఈ దాడుల్లో 13 మంది మరణించారని లెబనాన్ ఆరోగ్యశాఖ వెల్లడించింది. 57 మంది వరకు గాయపడ్డారని పేర్కొంది.