Page Loader
Netanyahu:'హెజ్‌బొల్లానే లక్ష్యం.. లెబనాన్ ప్రజలు కాదు'.. నెతన్యాహు స్పష్టం
'హెజ్‌బొల్లానే లక్ష్యం.. లెబనాన్ ప్రజలు కాదు'.. నెతన్యాహు స్పష్టం

Netanyahu:'హెజ్‌బొల్లానే లక్ష్యం.. లెబనాన్ ప్రజలు కాదు'.. నెతన్యాహు స్పష్టం

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 15, 2024
09:33 am

ఈ వార్తాకథనం ఏంటి

ఇజ్రాయెల్‌-లెబనాన్‌ సరిహద్దులో ఉద్రిక్తతలు తీవ్రతరమవుతున్నాయి. మరోవైపు ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షణ సిబ్బంది లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. లెబనాన్‌ సరిహద్దుల్లో తీవ్ర అస్థిరతల కారణంగా, ఐక్యరాజ్యసమితి శాంతి సిబ్బంది తమ విధులు తాత్కాలికంగా నిలిపివేసేలా ఇజ్రాయెల్‌ సైన్యం ఇప్పటికే విజ్ఞప్తి చేసిందన్నారు. ప్రస్తుతం హెజ్‌బొల్లా తీవ్రవాద సంస్థపై దాడులు జరగుతున్న సందర్భంలో, ఐక్యరాజ్యసమితి సిబ్బందికి ఎటువంటి హాని జరగకుండా ఉండేందుకు ఇజ్రాయెల్‌ సైన్యం అన్ని జాగ్రత్తలు తీసుకుంటోందని నెతన్యాహు వివరించారు. తమ పోరాటం హెజ్‌బొల్లా తీవ్రవాదులతోనే అని చెప్పారు. ఐక్యరాజ్యసమితి శాంతి సిబ్బందితో గానీ, లెబనాన్‌ ప్రజలతో గానీ కాదని ఆయన స్పష్టం చేశారు.

Details

హెజ్‌బొల్లా తీవ్రవాదాన్ని నిర్మూలించాలి

లెబనాన్‌ సరిహద్దు వద్ద ఉద్రిక్తతల సమయంలో, ఆ ప్రాంతాన్ని తాత్కాలికంగా విడిచి పెట్టాలని యూఎన్‌ఎఫ్‌ఐఎల్‌ సిబ్బందిని పదేపదే కోరినట్లు నెతన్యాహు తెలిపారు. హమాస్‌ దాడుల అనంతరం తమ సైన్యం హెజ్‌బొల్లా గ్రూప్‌ను లక్ష్యంగా చేసుకుని దాడులు ప్రారంభించిందన్నారు. లెబనాన్‌ భూభాగం నుంచి ఇరాన్ అనుబంధ సంస్థలు ఇజ్రాయెల్‌పై దాడులు చేసేందుకు ప్రయత్నిస్తున్నాయని నెతన్యాహు పేర్కొన్నారు. అయితే ఈ దాడులు ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షణ సభ్యులు లేదా లెబనాన్‌ సాధారణ ప్రజలను లక్ష్యం చేయడం కాదన్నారు. తమకు సంబంధించి ప్రధాన లక్ష్యం హెజ్‌బొల్లా తీవ్రవాదాన్ని నిర్మూలించడం మాత్రమేనని నెతన్యాహు స్పష్టం చేశారు.