Page Loader
Bangladesh: బంగ్లాదేశ్ కొత్త కరెన్సీ నోట్లపై ముజిబ్ చిత్రం స్థానంలో హిందూ, బౌద్ధ దేవాలయాలు
బంగ్లాదేశ్ కొత్త కరెన్సీ నోట్లపై ముజిబ్ చిత్రం స్థానంలో హిందూ, బౌద్ధ దేవాలయాలు

Bangladesh: బంగ్లాదేశ్ కొత్త కరెన్సీ నోట్లపై ముజిబ్ చిత్రం స్థానంలో హిందూ, బౌద్ధ దేవాలయాలు

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 02, 2025
09:09 am

ఈ వార్తాకథనం ఏంటి

బంగ్లాదేశ్ ప్రభుత్వం తాజాగా కొత్త కరెన్సీ నోట్లను విడుదల చేసింది.ఇందులో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు ఆ దేశ నోట్లపై బంగ్లాదేశ్ వ్యవస్థాపకుడు,మాజీ ప్రధాని షేక్ ముజిబుర్ రెహమాన్ బొమ్మ తప్పనిసరిగా ఉండేది. కానీ, ఇప్పుడు విడుదల చేసిన కొత్త నోట్లపై ఆయన చిత్రాన్ని తీసివేశారు. ముజిబ్ బొమ్మ స్థానంలో ఇకపై హిందూ, బౌద్ధ ఆలయాల చిత్రాలు దర్శనమిస్తాయి. ఈ కొత్త కరెన్సీ నోట్లు జూన్ 1వ తేదీ,ఆదివారం నుండి అధికారికంగా విడుదలయ్యాయి. గతంలో, ప్రధాని హసీనా తండ్రి అయిన ముజిబుర్ రెహమాన్ బొమ్మ అన్ని డినామినేషన్ల కరెన్సీపై కనిపించేది. కానీ, ఇటీవల రాజకీయ పరిణామాల నేపథ్యంలో షేక్ హసీనా తన పదవిని కోల్పోయిన నేపథ్యంలో, కరెన్సీ రూపకల్పనలో ఈ మార్పులు చోటుచేసుకున్నాయి.

వివరాలు 

త్వరలోనే కొత్త నోట్ల జారీ 

ఈ నేపథ్యంలో కొత్త నోట్లను త్వరలోనే జారీ చేస్తామని బంగ్లాదేశ్ కేంద్ర బ్యాంక్ అధికారికంగా ప్రకటించింది. బంగ్లాదేశ్ బ్యాంక్ అధికార ప్రతినిధి ఆరిఫ్ హుస్సేన్ ఖాన్ ఈ విషయంపై స్పందిస్తూ, "కొత్త కరెన్సీ నోట్లపై వ్యక్తుల చిత్రాలను తొలగించి, బదులుగా బంగ్లాదేశ్ కు ప్రత్యేకత కలిగిన ప్రకృతి దృశ్యాలు, సాంస్కృతిక ప్రాతినిధ్యం ఉన్న మైలురాళ్లను ప్రతిబింబించేలా డిజైన్ చేశాం" అని పేర్కొన్నారు. ఆయన ప్రకారం, ఈ కొత్త సిరీస్‌లో ప్రజాప్రతినిధుల బొమ్మలు ఉండవు, పూర్వీకుల సంపదను చూపే శైలిలో మాత్రమే డిజైన్లు ఉంటాయని తెలిపారు.

వివరాలు 

మూడు డినామినేషన్లలో కొత్త నోట్లు 

ఒక నివేదిక ప్రకారం, ఈ కొత్త నోట్లపై హిందూ,బౌద్ధ దేవాలయాల చిత్రాలు, ప్రముఖ చిత్రకారుడు జైనుల్ అబేదిన్ కళాకృతులు, అలాగే 1971లో స్వాతంత్ర్య యుద్ధంలో వీరమరణం పొందిన అమరవీరులకు అంకితమైన జాతీయ స్మారక స్థలానికి సంబంధించిన చిత్రాలు ఉంటాయి. ఈ కొత్త నోట్లను మూడు డినామినేషన్లలో బంగ్లాదేశ్ బ్యాంక్ విడుదల చేసింది. ప్రస్తుతం ఈ నోట్లు సెంట్రల్ బ్యాంక్ ప్రధాన కార్యాలయం నుండి అందుబాటులోకి వచ్చాయి. అనంతరం దేశవ్యాప్తంగా ఉన్న ఇతర శాఖల ద్వారా ప్రజలకు వాటిని జారీ చేస్తారు. కొత్త డిజైన్లలోని నోట్లు దశలవారీగా విడుదల చేయనున్నట్లు ఖాన్ తెలిపారు.

వివరాలు 

అప్పటి నోట్లపై బంగ్లాదేశ్ దేశపు మ్యాప్

బంగ్లాదేశ్ తన కరెన్సీని మార్చడం ఇదే మొదటిసారి కాదు. 1972లో, పాకిస్థాన్ నుండి స్వాతంత్ర్యం పొందిన వెంటనే ఆ దేశం తన కరెన్సీని పునర్నిర్మించుకుంది. అప్పటి నోట్లపై కొత్తగా ఏర్పడిన బంగ్లాదేశ్ దేశపు మ్యాప్ ముద్రించబడింది. ఆ తరువాత కాలంలో విడుదలైన నోట్లలో అవామీ లీగ్ నాయకుడు షేక్ ముజిబుర్ రెహమాన్ చిత్రం వేసారు. అయితే, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (BNP) పాలనలో ముజిబ్ బొమ్మను తొలగించి, చారిత్రక ప్రాముఖ్యత ఉన్న పురావస్తు ప్రదేశాల చిత్రాలను కరెన్సీపై ముద్రించారు.