
Harvard: హార్వర్డ్‌కి ఫెడరల్ నిధుల కోత.. ట్రంప్ పరిపాలన కఠిన నిర్ణయం
ఈ వార్తాకథనం ఏంటి
హార్వర్డ్ యూనివర్సిటీపై ట్రంప్ పరిపాలన కఠినంగా వ్యవహరించింది.
ఈ ప్రముఖ విద్యాసంస్థకు అమెరికా ప్రభుత్వం అందించే ఫెడరల్ నిధులను నిలిపివేస్తున్నట్టు అమెరికా విద్యాశాఖ మంత్రి లిండా మెక్‌మాన్ ప్రకటించారు.
హార్వర్డ్ యూనివర్సిటీకి కొన్ని విధాన పరమైన మార్పులు చేయాలని సూచించినప్పటికీ, యూనివర్సిటీ వాటిని తిరస్కరించడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
ఫలితంగా బడ్జెట్,పన్ను మినహాయింపుల్లో కుదింపులు జరగనున్నాయని వెల్లడించారు.
అమెరికా ప్రభుత్వం విధించిన షరతులను యూనివర్సిటీ నెరవేర్చే వరకు ఎటువంటి కొత్త ఫెడరల్ గ్రాంట్లను మంజూరు చేయబోమని స్పష్టం చేశారు.
వివరాలు
హార్వర్డ్ యూనివర్సిటీ ఫెడరల్ ప్రభుత్వంతో చర్చలు
ఈ నిషేధం ప్రధానంగా ఫెడరల్ రీసెర్చ్ గ్రాంట్లపైనే వర్తిస్తుందని, విద్యార్థులు ట్యూషన్ ఫీజు చెల్లించేందుకు ఉపయోగించే ఆర్థిక సహాయం మాత్రం కొనసాగుతుందని విద్యాశాఖ స్పష్టం చేసింది.
కొత్త గ్రాంట్లకు అర్హత సాధించాలంటే, హార్వర్డ్ యూనివర్సిటీ ఫెడరల్ ప్రభుత్వంతో చర్చలు జరపాల్సి ఉంటుందని మంత్రి మెక్‌మాన్ వివరించారు.
అంతేకాకుండా, అమెరికా పాలనను వ్యతిరేకిస్తూ ఆందోళనలు చేస్తున్న విదేశీ విద్యార్థులకు ప్రవేశం కల్పించడంతో హార్వర్డ్ దేశ విద్యావ్యవస్థను నిర్లక్ష్యంగా తీసుకుంటోందని ఆరోపణలు వచ్చాయని తెలిపారు.
పైగా, యూనివర్సిటీపై జాతి వివక్షకు సంబంధించిన ఫిర్యాదులపై విచారణ కొనసాగుతోందని వెల్లడించారు.
వివరాలు
చట్ట విరుద్ధ డిమాండ్లను ఎదుర్కొంటాం: హార్వర్డ్
ఫెడరల్ నిధుల నిలిపివేతపై హార్వర్డ్ యూనివర్సిటీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.
అమెరికా ప్రభుత్వం చట్టబద్ధంగా అమలుచేయాల్సిన విధానాలకు విరుద్ధంగా కొన్ని డిమాండ్లు చేస్తుండటాన్ని హార్వర్డ్ తిరస్కరించింది.
ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం తమపై ఒత్తిడి తేవడానికి నిధుల ఆపివేతను ఒక ఆయుధంగా వాడుతోందని, అయినా తమకు న్యాయపరమైన హక్కులు, స్వేచ్ఛల కోసం తాము పోరాటం చేస్తామని యూనివర్సిటీ అధ్యక్షుడు అలాన్ గార్బర్ ప్రకటించారు.
వివరాలు
ప్రభుత్వ ఒత్తిడులకు తాము తలొగ్గం
గతవారం వైట్‌హౌజ్ హార్వర్డ్ యూనివర్సిటీకి స్పష్టం చేసిన ప్రకారం.. అక్రమ, హింసాత్మక కార్యకలాపాల్లో పాల్గొన్న విదేశీ విద్యార్థుల వివరాలను అందించకుండా పోతే, కొత్తగా విదేశీయులను చేర్చుకునే అర్హతను రద్దు చేస్తామని హెచ్చరించింది.
ఈ నేపథ్యంలో హార్వర్డ్ మాట్లాడుతూ, ప్రభుత్వ ఒత్తిడులకు తాము తలొగ్గబోమని స్పష్టంగా వెల్లడించింది.
తమ రాజ్యాంగ హక్కులను పరిరక్షించుకునేందుకు తాము చట్టబద్ధమైన మార్గాన్ని అనుసరిస్తామని పేర్కొంది.
ప్రభుత్వం కూడా న్యాయవ్యవస్థకు అనుగుణంగా వ్యవహరించాలని విజ్ఞప్తి చేసింది. దీనికి ప్రతిఫలంగా ట్రంప్ యంత్రాంగం యూనివర్సిటీకి ఇచ్చే నిధులపై కోత విధించినట్టు తెలుస్తోంది.