
Harjit Kaur: అమెరికాలో 73 ఏళ్ల భారత సంతతి మహిళ అరెస్ట్.. స్థానికుల నిరసన
ఈ వార్తాకథనం ఏంటి
అక్రమ వలసలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కఠినంగా వ్యవహరిస్తున్నారు. సరైన పత్రాలు లేకుండా అమెరికాలో నివసిస్తున్న విదేశీయులను ఇమిగ్రేషన్ అధికారులు గుర్తించి, జైలులో పెట్టడం లేదా వారి స్వదేశానికి తిరిగి పంపించడం చేస్తున్నారు. ఈ క్రమంలో నార్తర్న్ కాలిఫోర్నియాలోని ఈస్ట్ బే ప్రాంతంలో నివసిస్తున్న 73ఏళ్ల హర్జిత్ కౌర్‌ను ఇమిగ్రేషన్ అధికారులు గత సోమవారం అదుపులోకి తీసుకున్నారు. ఆమెకు సరైన నివాస అనుమతిపత్రాలు లేవని ఆమెను జైలుకు పంపించారు. దీనిపై ఆమె కుటుంబ సభ్యులు, స్థానిక పంజాబీ సమాజం తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. సుమారు వంద మంది పంజాబీలు కలిసి ఇమిగ్రేషన్ కార్యాలయం ముందు ఆందోళన నిర్వహించి హర్జిత్ కౌర్‌ను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
వివరాలు
6 నెలలకు ఓసారి ఇమిగ్రేషన్ ఆఫీసులో హాజరవుతున్న కౌర్
హర్జిత్ కౌర్ పంజాబ్ రాష్ట్రానికి చెందినవారు. 1992లో ఇద్దరు పిల్లలతో కలిసి అమెరికాలో అడుగుపెట్టారు. ప్రవేశించి, అక్కడ రాజకీయ ఆశ్రయం పొందేందుకు ప్రభుత్వం దగ్గర దరఖాస్తు చేశారు. తాత్కాలిక అనుమతితో నార్తర్న్ కాలిఫోర్నియాలో నివాసం పొందుతున్నారు. అయితే, 2012లో ఆమె ఆశ్రయ దరఖాస్తును ప్రభుత్వం తిరస్కరించింది. ఆ తర్వాత భారత్‌కి తిప్పిపంపేందుకు కావలసిన కాగితాలు సిద్ధం చేస్తున్నప్పటికీ, ఇమిగ్రేషన్ అధికారులు ఆమె అక్కడే ఉండవచ్చని తెలిపారు. అప్పటినుంచి ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఇమిగ్రేషన్ ఆఫీసులో హాజరు అవుతూ తన వివరాలను అప్‌డేట్ చేసుకుంటున్నారు. గడిచిన 30 సంవత్సరాల వ్యవధిలో హర్జిత్ కౌర్ న్యాయపరంగా, బాధ్యతాయుతంగా తన జీవితాన్ని నడిపించారు. ఎప్పుడూ చట్ట వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొనకుండా శాంతియుత పౌరురాలిగా వ్యవహరించారు.
వివరాలు
వంద మందికి పైగా నిరసనలు
ఈ తరుణంలో సోమవారం ఈస్ట్ బేలో తనిఖీలు చేపట్టిన ఇమిగ్రేషన్ అధికారులు హర్జిత్ కౌర్ వద్ద అవసరమైన నివాస అనుమతిపత్రాలు లేవని గుర్తించి, ఆమెను ఇమిగ్రేషన్ ఆఫీసుకు తరలించారు. విచారణ అనంతరం జైలుకి పంపించారు. ఈ సంఘటన హర్జిత్ కౌర్ కుటుంబ సభ్యులకు, స్థానిక పంజాబీ సమాజానికి తీవ్ర ఆందోళన కలిగించింది. ఆమెను వెంటనే విడుదల చేయాలని కోరుతూ వంద మందికి పైగా నిరసనలు చేపట్టారు. వారు ప్లకార్డులు పట్టుకొని, శాంతియుతంగా ఆఫీసు ఎదురు నిరసన కార్యక్రమం నిర్వహించారు.