LOADING...
French Aircraft Carrier: స్ట్రావా యాప్‌తో నౌక లొకేషన్ లీక్.. యుద్ధ సమయంలో ఫ్రాన్స్‌కు షాక్
స్ట్రావా యాప్‌తో నౌక లొకేషన్ లీక్.. యుద్ధ సమయంలో ఫ్రాన్స్‌కు షాక్

French Aircraft Carrier: స్ట్రావా యాప్‌తో నౌక లొకేషన్ లీక్.. యుద్ధ సమయంలో ఫ్రాన్స్‌కు షాక్

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 20, 2026
02:37 pm

ఈ వార్తాకథనం ఏంటి

మధ్యప్రాచ్యంలో అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సమయంలో ఫ్రాన్స్‌కు చెందిన అణు శక్తి విమాన వాహక నౌక లొకేషన్ లీక్ కలకలం రేపుతోంది. ఒక ఫ్రెంచ్ నావికుడు తన ఉదయం వ్యాయామం సమయంలో చేసిన చిన్న తప్పిదం ఈ భద్రతా లోపానికి కారణమైంది. మార్చి 13 ఉదయం, ఆర్థర్ (పేరు మార్పు) అనే నావికుడు 'చార్ల్స్ డి గాల్' విమాన వాహక నౌక డెక్కుపై తన మార్నింగ్ రన్ ప్రారంభించాడు. ఆ సమయంలో ఆ నౌక తూర్పు మెడిటరేనియన్ సముద్రం వైపు ప్రయాణిస్తోంది. అతను తన స్మార్ట్‌వాచ్‌తో సుమారు 35 నిమిషాల్లో 7 కిలోమీటర్లకు పైగా పరుగెత్తిన వివరాలను రికార్డు చేశాడు.

వివరాలు 

నౌక ఖచ్చితమైన స్థానం బయటపడింది

అయితే ఈ డేటా రియల్ టైమ్‌లోనే ఇంటర్నెట్‌లోకి అప్లోడ్ అయింది. అతను ఉపయోగించిన ఫిట్‌నెస్ యాప్ 'స్ట్రావా'లో అతని ప్రొఫైల్ పబ్లిక్‌గా ఉండటం వల్ల ఈ సమాచారం అందరికీ కనిపించింది. ఈ కారణంగా ఆ నావికుడు తెలియకుండానే విమాన వాహక నౌకతో పాటు దాని ఎస్కార్ట్ నౌకల ఖచ్చితమైన లొకేషన్‌ను బయటపెట్టినట్టైంది. సైప్రస్‌కు వాయువ్య దిశలో, టర్కీ తీరానికి సమీపంలో ఆ నౌక ప్రయాణిస్తున్నట్లు సమాచారం బయటపడింది.

వివరాలు 

చార్ల్స్ డి గాల్ ప్రాముఖ్యత

ఫ్రాన్స్ నౌకాదళానికి ఫ్లాగ్‌షిప్ అయిన 'చార్ల్స్ డి గాల్' అమెరికా తర్వాత అణు శక్తితో పనిచేసే ఏకైక విమాన వాహక నౌకగా గుర్తింపు పొందింది. ఈ నౌకతో పాటు కనీసం మూడు ఫ్రిగేట్లు,ఒక సరఫరా నౌక కూడా ప్రాంతంలో ఉన్నాయి. మార్చి 3న ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయెల్ మాక్రాన్ ఈ నౌకను మధ్యప్రాచ్య ప్రాంతానికి పంపినట్లు ప్రకటించారు. ఇరాన్ నుంచి వచ్చే దాడుల నుంచి సముద్ర మార్గాలను రక్షించడమే ఈ చర్య లక్ష్యంగా పేర్కొన్నారు. ఆ నౌక ఆ ప్రాంతంలో ఉందని అందరికీ ముందే తెలుసు. కానీ అది సముద్రంలో ఎక్కడ ఖచ్చితంగా ఉందో మాత్రం రహస్యంగా ఉంచాలి.

Advertisement

వివరాలు 

'స్ట్రావా' యాప్‌పై మళ్లీ భద్రతా ఆందోళనలు

అయితే ఈ నావికుడి చర్య వల్ల ఆ సమాచారం దాదాపు లైవ్‌గా బయటపడటం భద్రతా పరంగా పెద్ద ప్రమాదంగా మారింది. ఫిట్‌నెస్ యాప్ 'స్ట్రావా' వల్ల భద్రతా సమస్యలు రావడం ఇదే మొదటిసారి కాదు. గతంలో ఈ యాప్‌లోని పబ్లిక్ డేటా ఆధారంగా అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్, జో బైడెన్, అలాగే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు సంబంధించిన భద్రతా సిబ్బంది కదలికలను గుర్తించినట్లు నివేదికలు వెల్లడించాయి. అంతేకాకుండా ఫ్రాన్స్ అణు సబ్‌మరైన్ల పర్యటన షెడ్యూల్స్ కూడా బయటపడ్డాయని సమాచారం.

Advertisement