Abu-Bilal Al-Minooqi: ఐసిస్‌కు భారీ షాక్.. అగ్ర కమాండర్ అబు బిలాల్ హతం
ఈ వార్తాకథనం ఏంటి
ప్రపంచంలో అత్యంత క్రియాశీలక ఉగ్రవాదుల్లో ఒకరిగా గుర్తింపు పొందిన, ఇస్లామిక్ స్టేట్ ఉగ్రసంస్థలో రెండో అత్యున్నత కమాండర్‌గా భావిస్తున్న అబు బిలాల్ అల్ మినుకిని అమెరికా సైన్యం హతమార్చింది. నైజీరియాలో ఆ దేశ భద్రతా దళాలతో కలిసి అమెరికా సైన్యం నిర్వహించిన సంయుక్త ఆపరేషన్‌లో అతడిని అంతం చేసినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. ఈ విషయాన్ని డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియా పోస్టు ద్వారా ప్రకటిస్తూ.. తన ఆదేశాల మేరకు అమెరికా దళాలు అత్యంత పక్కా ప్రణాళికతో, వ్యూహాత్మకంగా ఈ క్లిష్టమైన ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తి చేశాయని తెలిపారు.
వివరాలు
ఆ ఉగ్రసంస్థకు కోలుకోలేని దెబ్బ
ఆఫ్రికాలో సురక్షితంగా దాక్కొని కార్యకలాపాలు కొనసాగించవచ్చని అబు బిలాల్ భావించాడని, అయితే అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాలు అతడి కదలికలను నిరంతరం గమనిస్తూ సమాచారాన్ని సేకరించాయని పేర్కొన్నారు. ఇకపై ఆఫ్రికా ప్రజల్లో భయాందోళనలు సృష్టించే అవకాశం అతడికి లేదని, అమెరికన్లను లక్ష్యంగా చేసుకునే ఉగ్రకార్యకలాపాలకు కూడా సహకారం అందించలేడని ట్రంప్ స్పష్టం చేశారు. ఐసిస్ గ్లోబల్ నెట్‌వర్క్‌లో కీలక నాయకుడిగా భావిస్తున్న అబు బిలాల్ మరణం ఆ ఉగ్రసంస్థకు కోలుకోలేని దెబ్బగా మారుతుందని అంతర్జాతీయ భద్రతా నిపుణులు అభిప్రాయపడుతున్నారు.