Hush money trial: 34 కేసుల్లో దోషిగా తేలిన డొనాల్డ్ ట్రంప్
ఎన్నికలకు ముందు అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పోర్న్ స్టార్ స్టార్మీ డేనియల్‌తో అక్రమ సంబంధం కేసులో ఆయనపై నమోదైన అన్ని ఆరోపణలు రుజువైనట్లు న్యూయార్క్ కోర్టు తేల్చింది. దాదాపు 34 కేసుల్లో అమెరికా కోర్టు ఆయనను దోషిగా తేల్చింది.ఇలా ఓ కేసులో దోషిగా తేలిన అమెరికా తొలి మాజీ అధ్యక్షుడు ట్రంపే కావడం గమనార్హం. ట్రంప్ రాబోయే ఎన్నికల్లో బైడెన్ తో తలపడనున్నారు. మరో ఐదు నెలల్లో ఎన్నికల జరగనున్న ఈ తరుణంలో ఈ తీర్పు వెలువడటం ప్రాధాన్యం సంతరించుకుంది.
మరో మూడు కేసుల్లోనూ అభియోగాలు
జులై 11న ట్రంప్ కి కోర్టు శిక్ష ఖరారు చేయనుంది. బిజినెస్ రికార్డులు తారుమారు చేయడమనేది న్యూయార్క్‌లో తక్కువ తీవ్రత ఉన్న నేరంగా పరిగణిస్తారు. దీనికి గరిష్ఠంగా నాలుగేళ్ల వరకు జైలు శిక్ష ఉంటుంది. దీనిపై పూర్తి విచక్షణాధికారం న్యాయమూర్తిదే. కచ్చితంగా జైలు శిక్ష విధిస్తారా.. లేక జరిమానా విధిస్తారా తెలియాల్సివుంది. ఆయన ఇంతకంటే తీవ్రమైన మరో మూడు కేసుల్లోనూ అభియోగాలు ఎదుర్కొంటున్నాడు. అవేవీ ఎన్నికల ముందు విచారణకు వచ్చే అవకాశం లేదని ఆయన న్యాయవాదుల బృందం ధీమాగా ఉంది.
దేశం కోసం, న్యాయం కోసం పోరాడతా..
ఈ తీర్పును ట్రంప్ కొట్టిపారేశారు. ఇది అవినీతిపరుడైన న్యాయమూర్తి జరిపిన విచారణ అని ఆరోపించారు. నిజమైన తీర్పు నవంబర్ 5 నాటి అధ్యక్ష ఎన్నికల్లో ప్రజలిస్తారని వ్యాఖ్యానించారు. తాను అమాయకుడిననే విషయం ప్రతి ఒక్కరికీ తెలుసన్నారు. దేశం కోసం, న్యాయం కోసం పోరాడుతూనే ఉంటానని చెప్పారు.