LOADING...
Panama Canal: హార్మూజ్‌ మూసివేత ప్రభావం.. ఆ చిన్న దేశానికి భారీ ఆదాయం
హార్మూజ్‌ మూసివేత ప్రభావం.. ఆ చిన్న దేశానికి భారీ ఆదాయం

Panama Canal: హార్మూజ్‌ మూసివేత ప్రభావం.. ఆ చిన్న దేశానికి భారీ ఆదాయం

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 25, 2026
11:42 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా-ఇరాన్‌ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు ప్రపంచ వాణిజ్య వ్యవస్థపై గణనీయమైన ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా హర్ముజ్ జలసంధి ప్రాంతంలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో చమురు, గ్యాస్‌ రవాణాకు అంతరాయం కలుగుతోంది. ప్రపంచ చమురు సరఫరాలో కీలక పాత్ర పోషించే ఈ మార్గం ప్రభావితమవడంతో అంతర్జాతీయ మార్కెట్లలో ముడి చమురు ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. మొత్తం ప్రపంచ చమురు వినియోగంలో సుమారు 20 శాతం ఈ జలసంధి గుండా రవాణా అవుతుందని అంచనా. అయితే భద్రతా ఆందోళనలు, అమెరికా-ఇరాన్‌ ఘర్షణల నేపథ్యంలో అనేక నౌకాయాన సంస్థలు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నాయి. ఈ పరిణామంతో పనామా కాలువ ప్రాధాన్యం ఒక్కసారిగా పెరిగింది.

వివరాలు

పనామా కాలువపై భారీ రద్దీ

హార్మూజ్‌ మార్గం సవాళ్లను ఎదుర్కొంటుండటంతో చమురు ట్యాంకర్లు, వాణిజ్య నౌకలు పనామా కాలువ వైపు మళ్లుతున్నాయి. దీంతో అక్కడ భారీ రద్దీ నెలకొంది. కాలువ గుండా ప్రయాణానికి స్లాట్‌లు పొందేందుకు కంపెనీలు తీవ్రంగా పోటీ పడుతున్నాయి. పరిస్థితి అంతగా పెరిగి, అత్యవసర ప్రవేశాల కోసం వేలంపాటలు నిర్వహించే స్థాయికి చేరింది. ఈ వేలంలో ఒక్కో ట్యాంకర్‌ సుమారు 4 మిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.37 కోట్లు) చెల్లించేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. సాధారణంగా ఈ మార్గంలో ప్రయాణ ఖర్చు 3 నుంచి 4 లక్షల డాలర్ల వరకు మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు ప్రాధాన్య ప్రవేశం కోసం అదనపు భారీ రుసుములు చెల్లించాల్సి వస్తోంది.

వివరాలు

పనామాకు ఊహించని లాభాలు

ఈ పరిస్థితి పనామా దేశానికి భారీ ఆదాయాన్ని తెచ్చిపెడుతోంది. కాలువ వినియోగంపై డిమాండ్‌ పెరగడంతో టోల్‌ ఫీజులు, ప్రత్యేక ప్రవేశ రుసుముల ద్వారా ప్రభుత్వం గణనీయమైన ఆదాయం పొందుతోంది. ప్రపంచ సరఫరా గొలుసుల్లో వచ్చిన మార్పులతో పనామా కాలువ మరోసారి అంతర్జాతీయ వాణిజ్యంలో కీలక కేంద్రంగా మారింది.

Advertisement

వివరాలు

ప్రపంచ సరఫరా గొలుసులపై ప్రభావం

విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, యుద్ధ పరిస్థితులు, క్షిపణి దాడులు, డ్రోన్‌ ముప్పుల నేపథ్యంలో కంపెనీలు సురక్షిత మార్గాల కోసం అధిక ఖర్చు చేయడానికైనా వెనుకాడడం లేదు. అయితే ఈ మార్పుల వల్ల సరఫరా సమయాలు పెరగడమే కాకుండా, చమురు ధరలు, రవాణా వ్యయాలు, చివరకు వస్తువుల ధరలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. మొత్తానికి హార్మూజ్‌ సంక్షోభం ప్రపంచానికి తలనొప్పిగా మారగా, మరోవైపు పనామా కాలువకు మాత్రం అది ఒక అవకాశంగా మారిందని చెప్పవచ్చు.

Advertisement