LOADING...
PM Modi: భారత్,చైనా ఆర్థిక వ్యవస్థకు స్థిరత్వాన్ని తీసుకురాగలవు.. టోక్యో పర్యటనలో ప్రధాని మోదీ వెల్లడి 
టోక్యో పర్యటనలో ప్రధాని మోదీ వెల్లడి

PM Modi: భారత్,చైనా ఆర్థిక వ్యవస్థకు స్థిరత్వాన్ని తీసుకురాగలవు.. టోక్యో పర్యటనలో ప్రధాని మోదీ వెల్లడి 

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 30, 2025
08:17 am

ఈ వార్తాకథనం ఏంటి

ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో స్థిరత్వం తీసుకురావడంలో భారత్‌-చైనా దేశాలు కలిసి ముందుకు సాగాల్సిన అవసరం ఉందని భారత ప్రధాని నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. పరస్పర గౌరవం, రెండు దేశాల ప్రయోజనాలు, సున్నిత అంశాలను దృష్టిలో ఉంచుకుని ద్వైపాక్షిక సంబంధాలను వ్యూహాత్మకంగా, దీర్ఘకాలిక దృష్టితో బలోపేతం చేసేందుకు భారత్‌ సిద్ధంగా ఉందని ఆయన తెలిపారు. జపాన్‌ పర్యటనలో భాగంగా శుక్రవారం టోక్యో చేరుకున్న మోదీ, అక్కడి ప్రముఖ పత్రిక యొమియురి షింబున్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఈ విషయాలు వెల్లడించారు.

వివరాలు 

తియాంజిన్‌లో జరిగే శిఖరాగ్ర సదస్సుకు మోదీ 

"భారత్‌-చైనా మధ్య ఊహించదగిన, స్థిరమైన, సామరస్యపూర్వక సంబంధాలు కొనసాగాలి. ఇవి రెండు అతిపెద్ద పొరుగుదేశాలు. ఇరుదేశాల అనుబంధం బలంగా ఉంటే దాని సానుకూల ప్రభావం ప్రాంతీయంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా శాంతి, అభివృద్ధిపై పడుతుంది. అభివృద్ధి సవాళ్లను ఎదుర్కొనడంలో, బహుళధ్రువ ప్రపంచంలో ఇది అత్యంత అవసరం. గత సంవత్సరం చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో జరిగిన సమావేశం తరువాత ఇరుదేశాల సంబంధాల్లో గణనీయ పురోగతి కనిపిస్తోంది. ఆయన ఆహ్వానం మేరకే తియాంజిన్‌లో జరిగే శిఖరాగ్ర సదస్సులో పాల్గొంటున్నాను'' అని మోదీ వివరించారు.

వివరాలు 

ఇండో-పసిఫిక్‌లో శాంతి పరిరక్షణకు కట్టుబాటు 

ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో శాంతి, స్థిరత్వం కాపాడేందుకు భారత్-జపాన్‌ రెండు దేశాలూ కట్టుబడి ఉన్నాయని మోదీ చెప్పారు. ఆయా దేశాల భౌగోళిక సమగ్రతకు గౌరవం ఇచ్చే విధంగానే ఈ సహకారం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఉక్రెయిన్‌ యుద్ధంపై భారత్‌ తీసుకున్న వైఖరిని రష్యా, ఉక్రెయిన్‌ రెండు దేశాలూ మెచ్చుకున్నాయని గుర్తు చేశారు. తమ సత్సంబంధాలను ఉపయోగించి ఉక్రెయిన్‌లో త్వరిత శాంతి పునరుద్ధరణకు కృషి చేస్తామని వివరించారు. దక్షిణార్ధగోళ దేశాలకు ప్రపంచం మరింత ప్రాధాన్యం ఇవ్వాలని, అంతర్జాతీయ వేదికల్లో కూడా దీనికి తమవంతు పోరాటం కొనసాగిస్తామని చెప్పారు. జపాన్‌ సాయంతో ముంబయి-అహ్మదాబాద్‌ మధ్య బుల్లెట్‌ రైలు సేవలు త్వరలో ప్రారంభమవుతాయని తెలిపారు.

వివరాలు 

చంద్రయాన్‌-5లో జాక్సా భాగస్వామ్యం

సాంకేతికతలో జపాన్‌ అనుభవం, నవకల్పనలో భారత్‌ బలం కలిసొచ్చి రెండు దేశాలకు లాభం చేకూరుస్తుందని పేర్కొన్నారు. రాజకీయ విశ్వాసం, పరస్పర సహకారంతో తదుపరి తరం రక్షణ వ్యవస్థలను ప్రపంచానికి అందించగల సామర్థ్యం ఇరుదేశాలకుందని అన్నారు. భారత అంతరిక్ష ప్రాజెక్ట్‌ చంద్రయాన్‌-5లో జపాన్‌ అంతరిక్ష సంస్థ జాక్సా భాగస్వామ్యం వహించనుందని వెల్లడించారు. ఇది ఇస్రో-జాక్సా సంయుక్తంగా నిర్వహించే ప్రతిష్ఠాత్మక కార్యక్రమమై, అంతర్జాతీయ అంతరిక్ష సహకారానికి నిదర్శనం అవుతుందని మోదీ తెలిపారు.

వివరాలు 

'మేక్‌ ఇన్‌ ఇండియా'కి పిలుపు 

'మేక్‌ ఇన్‌ ఇండియా' కార్యక్రమంలో భాగంగా ప్రపంచ వ్యాపారవేత్తలు భారత్‌లో ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేసి, ప్రపంచ మార్కెట్‌ కోసం తయారీ చేపట్టాలని మోదీ పిలుపునిచ్చారు. భారత్-జపాన్‌ ఆర్థిక వేదిక సదస్సులో మాట్లాడుతూ, జపాన్‌ భారత్‌కు అత్యంత కీలక భాగస్వామి అని గుర్తుచేశారు. సెమీకండక్టర్ల నుంచి స్టార్టప్‌ల వరకు జపాన్‌ మద్దతు కీలకమని తెలిపారు. ఇప్పటివరకు జపాన్‌ సంస్థలు భారత్‌లో 4,000 కోట్ల డాలర్లకుపైగా పెట్టుబడులు పెట్టాయని, 80 శాతం కంపెనీలు విస్తరణకు ఆసక్తి చూపుతున్నాయని, 75 శాతం సంస్థలు ఇప్పటికే లాభాల్లో ఉన్నాయని వివరించారు. ప్రపంచ దృష్టి భారత్‌పైనే ఉందని మోదీ అన్నారు. వ్యాపార దిగ్గజాలు పాల్గొన్న ఆ సదస్సులో జపాన్‌ ప్రతినిధులు గాయత్రీ మంత్రంతో మోదీని స్వాగతించారు.

వివరాలు 

10 లక్షల కోట్ల యెన్‌ పెట్టుబడులు 

రాబోయే దశాబ్దంలో భారత్‌లో 10 లక్షల కోట్ల యెన్‌ (దాదాపు రూ. 6 లక్షల కోట్లు) పెట్టుబడులు పెట్టేందుకు జపాన్‌ కంపెనీలు అంగీకరించాయని మోదీ వెల్లడించారు. అరుదైన ఖనిజాలు, రక్షణ, సాంకేతిక రంగాల్లో సహకారం పెంపొందించేందుకు రెండు దేశాలు ప్రత్యేక మార్గసూచీ రూపొందించుకున్నాయి. జపాన్‌ ప్రధాని షిగెరు ఇషిబాతో సమావేశం అనంతరం మోదీ ఈ వివరాలు వెల్లడించారు. వ్యూహాత్మక సముద్ర ప్రాంతాల్లో చైనా సైనిక ఆధిపత్యం పెరుగుతున్నందున ఇరువురూ ఆందోళన వ్యక్తం చేశారు. పహల్గాం ఉగ్రదాడుల వెనుక కుట్రదారులను చట్టం ముందుకు తేవాలని, అల్‌ఖైదా, లష్కరే తయ్యిబా, జైషే మొహమ్మద్‌ వంటి ఉగ్రవాద సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు.

వివరాలు 

13 ఒప్పందాలు ఖరారు 

సెమీకండక్టర్లు, స్వచ్ఛ ఇంధనం, టెలికాం, ఔషధ రంగాలకు సంబంధించిన 13 కీలక ఒప్పందాలు ఇరుదేశాల మధ్య కుదిరాయి. వీటిలో భాగంగా 50,000 మంది నైపుణ్యం కలిగిన మరియు అర్థనైపుణ్య కార్మికులను ఐదేళ్లలో భారత్‌ నుంచి జపాన్‌కు పంపాలని నిర్ణయించారు. అలాగే, జపాన్‌ 'షింకన్‌సేన్‌ ఇ 10 సిరీస్‌' రైళ్లను 2030 నాటికి భారత్‌కు అందించేందుకు సిద్ధమైంది. మోదీతో జపాన్‌ మాజీ ప్రధానులు యోషిహిదె సుగ, ఫుమియో కిషిద భేటీ అయ్యి సాంకేతికత, కృత్రిమ మేధస్సు, వాణిజ్యం, పెట్టుబడుల రంగాల్లో సహకారం పెంపొందించుకోవాలని చర్చించారు. శనివారం టోక్యో నుంచి నేరుగా చైనా వెళ్లనున్నట్లు మోదీ వెల్లడించారు.