Loading...
Bangladesh: '1971లో బెంగాలీలకు భారత్ సాయం చేయలేదు': బంగ్లాదేశ్ స్పీకర్ సంచలన వ్యాఖ్యలు
'1971లో బెంగాలీలకు భారత్ సాయం చేయలేదు': బంగ్లాదేశ్ స్పీకర్ సంచలన వ్యాఖ్యలు

Bangladesh: '1971లో బెంగాలీలకు భారత్ సాయం చేయలేదు': బంగ్లాదేశ్ స్పీకర్ సంచలన వ్యాఖ్యలు

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 27, 2026
09:42 am

ఈ వార్తాకథనం ఏంటి

ఒకప్పుడు భారత్, బంగ్లాదేశ్ మధ్య సన్నిహిత సంబంధాలు కొనసాగేవి. అయితే షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోయిన తర్వాత ఇరు దేశాల మధ్య పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. బంగ్లాదేశ్‌లో అధికారంలోకి వచ్చిన నాయకత్వం భారత్ పట్ల వ్యతిరేక ధోరణిని ప్రదర్శిస్తూ పాకిస్థాన్‌తో సంబంధాలను మెరుగుపరుచుకునే ప్రయత్నం చేస్తోంది. 1971లో తమ దేశానికి స్వాతంత్య్రం రావడానికి కారణమైన పాకిస్థాన్ సైన్యంతో పోరాడిన బంగ్లాదేశ్.. ఇప్పుడు అదే దేశంతో స్నేహాన్ని పెంచుకోవడానికి ఆసక్తి చూపుతోంది. మరోవైపు స్వాతంత్య్ర పోరాటంలో కీలకంగా నిలిచిన భారత్ పాత్రను తక్కువ చేసి మాట్లాడుతున్న తీరు చర్చనీయాంశంగా మారింది. తాజాగా బంగ్లాదేశ్ పార్లమెంట్ స్పీకర్ హఫీజ్ ఉద్దీన్ అహ్మద్ పాకిస్థాన్ పర్యటనలో చేసిన వ్యాఖ్యలు ఈ పరిణామాలకు మరింత బలం చేకూర్చాయి.

వివరాలు 

పార్లమెంట్ హౌస్ సందర్శన.. భారత్‌పై విమర్శలు

పాకిస్థాన్‌లో పర్యటిస్తున్న హఫీజ్ ఉద్దీన్ అహ్మద్ ఇస్లామాబాద్‌లో మాట్లాడుతూ.. 1971లో భారత్ బెంగాలీలకు సహాయం చేయలేదని, పాకిస్థాన్‌ను బలహీనపర్చడమే లక్ష్యంగా పనిచేసిందని ఆరోపించారు.

ఈ వ్యాఖ్యలు భారత్‌పై విమర్శలు చేయడంతో పాటు ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను పెంచేలా ఉన్నాయని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

బుధవారం ఇస్లామాబాద్‌లోని పార్లమెంట్ హౌస్‌ను సందర్శించిన హఫీజ్ ఉద్దీన్ అహ్మద్.. అక్కడ మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.

ఈ సందర్భంగా 1971 యుద్ధం, అప్పట్లో ఢాకాలో చోటుచేసుకున్న పరిణామాలను ప్రస్తావించారు.

ఆ సమయంలో భారత్ బెంగాలీలకు అండగా నిలవలేదని, పాకిస్థాన్‌ను బలహీనపరిచే ప్రయత్నమే చేసిందని వ్యాఖ్యానించారు. ఈ విషయాన్ని బీబీసీ ఉర్దూ తన కథనంలో వెల్లడించింది.

వివరాలు 

పార్లమెంట్ హౌస్ సందర్శన.. భారత్‌పై విమర్శలు

షేక్ హసీనా 15 ఏళ్ల పాలనలో బంగ్లాదేశ్ భారత్‌పై ఆధారపడిన వలస రాజ్యంలా మారిపోయిందని హఫీజ్ ఆరోపించారు.

ఈ పరిణామాల కారణంగా దేశ ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని పేర్కొన్నారు.

గతంలో పాకిస్థాన్ సైన్యంలో కెప్టెన్‌గా పనిచేసిన హఫీజ్.. 1971 యుద్ధంలో ప్రత్యక్షంగా పాల్గొన్నారు.

ఆ పోరాటంలో ధైర్యసాహసాలు ప్రదర్శించినందుకు బంగ్లాదేశ్‌లో ఆయనకు ప్రత్యేక గౌరవం ఉంది.

అయితే స్వాతంత్య్ర పోరాటంలో భారత్ పోషించిన పాత్రను తక్కువ చేసి మాట్లాడటం ఇప్పుడు ప్రాధాన్యం సంతరించుకుంది.

1971లో అప్పటి తూర్పు పాకిస్థాన్‌లోని బెంగాలీ ప్రజలు తమకు ప్రజాస్వామ్య హక్కులు కల్పించాలని కోరారని, కానీ వారి డిమాండ్లను అంగీకరించలేదని హఫీజ్ గుర్తుచేశారు.

ADVERTISEMENT

వివరాలు 

బంగ్లాదేశ్ ఎన్నికలు స్వేచ్ఛగా జరిగాయన్న స్పీకర్

పాకిస్థాన్, బంగ్లాదేశ్ పార్లమెంటరీ వ్యవస్థల మధ్య పోలికను ప్రస్తావించిన హఫీజ్.. 1975లో బంగ్లాదేశ్‌లో ఏకపార్టీ విధానాన్ని అమలు చేశారని తెలిపారు.

దీంతో అప్పటి నుంచి తమ దేశ ప్రజలకు నిజమైన ప్రజాస్వామ్యాన్ని అనుభవించే అవకాశం లేకుండా పోయిందని అభిప్రాయపడ్డారు.

అయితే 2026 ఫిబ్రవరిలో జరిగిన సాధారణ ఎన్నికలు మాత్రం స్వేచ్ఛగా,నిష్పక్షపాతంగా నిర్వహించామని ఆయన పేర్కొన్నారు.

మాజీ ప్రధాని షేక్ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ పార్టీని ఉగ్రవాద సంస్థగా హఫీజ్ అభివర్ణించారు.

2024లో బంగ్లాదేశ్‌లో జరిగిన రాజకీయ తిరుగుబాటు కారణంగా హసీనా అధికారాన్ని కోల్పోయారు.

అనంతరం ఆమె భారత్‌కు చేరుకుని అక్కడ ఆశ్రయం పొందుతున్నారు.

ఆ తర్వాత 2026 ఫిబ్రవరిలో జరిగిన సాధారణ ఎన్నికల్లో అవామీ లీగ్ పోటీ చేయకుండా నిషేధం విధించారు.

ADVERTISEMENT

వివరాలు 

బంగ్లాదేశ్ ఎన్నికలు స్వేచ్ఛగా జరిగాయన్న స్పీకర్

బంగ్లాదేశ్ ప్రజలు నియంతృత్వ పాలనను అంగీకరించకుండా ప్రజాస్వామ్యాన్ని కోరుకున్నారని హఫీజ్ వ్యాఖ్యానించారు.

2024లో చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలను నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ప్రజలు సాగించిన పోరాటంగా ఆయన పేర్కొన్నారు.

ఇక కశ్మీర్ సమస్యపైనా హఫీజ్ తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఐక్యరాజ్య సమితి తీర్మానాలకు అనుగుణంగా ఈ వివాదానికి పరిష్కారం కనుగొనాలని సూచించారు.

ఈ వ్యాఖ్యల ద్వారా కశ్మీర్ విషయంలో పాకిస్థాన్ వైఖరికి ఆయన మద్దతు తెలిపినట్లయింది.

అదే సమయంలో పాకిస్థాన్, బంగ్లాదేశ్ మధ్య సంబంధాలు రాబోయే రోజుల్లో మరింత బలపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

వివరాలు 

భారత్‌కు దూరంగా.. పాకిస్థాన్‌కు దగ్గరవుతున్న బంగ్లాదేశ్

2024లో బంగ్లాదేశ్‌లో జరిగిన రాజకీయ తిరుగుబాటు తర్వాత అప్పటి ప్రధాని షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేసి ఢాకాను విడిచిపెట్టారు.

అనంతరం భారత్‌లో ఆశ్రయం పొందుతున్నారు. హసీనా అధికారంలో ఉన్నంతకాలం భారత్‌తో సన్నిహిత సంబంధాలు కొనసాగించిన బంగ్లాదేశ్.. ఆమె ప్రభుత్వం కూలిపోయిన తర్వాత విదేశాంగ విధానంలో మార్పులు చేసుకుంది.

పాకిస్థాన్‌తో దౌత్య, వాణిజ్య, సైనిక సంబంధాలను పునరుద్ధరించేందుకు చర్యలు చేపట్టింది.

ఈ మార్పులకు 2024 సెప్టెంబర్‌లోనే పునాది పడింది. ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశాల సందర్భంగా బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత మొహమ్మద్ యూనస్, పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ సమావేశమయ్యారు.

ఈ భేటీలో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను తిరిగి బలోపేతం చేసుకోవడంపై చర్చించారు.

వివరాలు 

భారత్‌కు దూరంగా.. పాకిస్థాన్‌కు దగ్గరవుతున్న బంగ్లాదేశ్

ఆ తర్వాత 2025 జనవరిలో బంగ్లాదేశ్ సైనికాధికారి ఎస్ఎం కమ్రూల్ హసన్ పాకిస్థాన్‌లో పర్యటించారు.

దీనికి కొనసాగింపుగా పాకిస్థాన్ జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీ ఛైర్మన్‌తో పాటు ఐఎస్ఐ అధికారులు బంగ్లాదేశ్ రాజధాని ఢాకాకు వెళ్లారు.

ఈ పర్యటనలు ఇరు దేశాల మధ్య సైనిక సంబంధాలు కూడా మెరుగుపడుతున్నాయనే సంకేతాలిచ్చాయి.

2025 ఫిబ్రవరిలో కరాచీ తీరంలో నిర్వహించిన నౌకాదళ విన్యాసాల్లో బంగ్లాదేశ్ నౌకాదళం పాల్గొనడం మరో కీలక పరిణామం.

భారత్‌తో కలిసి నిర్వహించే సంప్రీతి సైనిక విన్యాసాలకు దూరంగా ఉంటున్న బంగ్లాదేశ్.. పాకిస్థాన్ నిర్వహించిన నౌకాదళ విన్యాసాల్లో పాల్గొనడం ప్రాధాన్యం సంతరించుకుంది.

అంతేకాకుండా పాకిస్థాన్ నుంచి ఆయుధాలు కొనుగోలు చేసేందుకు కూడా బంగ్లాదేశ్ ఆసక్తి చూపించింది.

వివరాలు 

1971 తర్వాత తొలిసారిగా ప్రత్యక్ష వాణిజ్యం

పాకిస్థాన్, బంగ్లాదేశ్ మధ్య సంబంధాల్లో మరో ముఖ్యమైన మార్పు వాణిజ్య రంగంలో కనిపించింది.

1971 తర్వాత తొలిసారిగా 2025 ఫిబ్రవరి నుంచి ఇరు దేశాల మధ్య ప్రభుత్వ స్థాయిలో నేరుగా వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి.

ఇందులో భాగంగా పాకిస్థాన్ నుంచి బంగ్లాదేశ్‌కు 50 వేల టన్నుల బియ్యం దిగుమతి చేసుకున్నారు. వాణిజ్యంతో పాటు రవాణా సంబంధాలు కూడా విస్తరించాయి.

ఇరు దేశాల మధ్య నేరుగా విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి. అలాగే పాకిస్థాన్‌లోని కరాచీ, బంగ్లాదేశ్‌లోని చిట్టగాంగ్ ఓడరేవుల మధ్య నేరుగా నౌకా రవాణా అందుబాటులోకి వచ్చింది.

వివరాలు 

1971 తర్వాత తొలిసారిగా ప్రత్యక్ష వాణిజ్యం

ఈ సంబంధాల బలోపేతంలో భాగంగా 2025 సెప్టెంబర్‌లో పాకిస్థాన్ ఉప ప్రధాని, విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ బంగ్లాదేశ్‌లో పర్యటించారు.

ఈ సందర్భంగా రెండు దేశాల మధ్య ఆరు అవగాహన ఒప్పందాలు (ఎంఓయూలు) కుదిరాయి.

మొత్తంగా చూస్తే, షేక్ హసీనా ప్రభుత్వం పతనమైన తర్వాత బంగ్లాదేశ్ విదేశాంగ విధానంలో గణనీయమైన మార్పులు చోటుచేసుకున్నాయి.

ఒకవైపు భారత్‌తో సంబంధాలు దెబ్బతింటుండగా.. మరోవైపు దశాబ్దాల పాటు ప్రత్యర్థిగా ఉన్న పాకిస్థాన్‌తో స్నేహ సంబంధాలు వేగంగా విస్తరిస్తున్నాయి.

తాజాగా బంగ్లాదేశ్ పార్లమెంట్ స్పీకర్ చేసిన వ్యాఖ్యలు ఈ మారుతున్న దౌత్య వైఖరిని మరోసారి వెలుగులోకి తెచ్చాయి.

ADVERTISEMENT