India : నిజ్జర్ కేసులో భారత్ కీలక వ్యాఖ్యలు..ఆధారాలుంటే చూపించాలన్న జైశంకర్
ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో భారతీయ ఏజెంట్ల ప్రమేయం ఉందని కెనడా గతంలో తీవ్ర ఆరోపణలు గుప్పించింది. ఈ మేరకు ఆయా ఆరోపణలపై భారత్ మరోసారి స్పందంచింది. భారత నిఘా అధికారుల పాత్ర ఉందంటున్న కెనడా, ఆ మేరకు ఆధారాలను చూపించాలని కోరింది. ఈ క్రమంలోనే నిజ్జర్ హత్య కేసుకు సంబంధించిన ఆధారాలు అందించాలని కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్. జైశంకర్ కోరారు. ఈ నేపథ్యంలోనే విచారణకు భారత్ సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. జూన్ 18న బ్రిటిష్ కొలంబియాలో ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్‌ను హత్యలో భారత ఏజెంట్ల ప్రమేయం ఉందంటూ వచ్చిన ఆరోపణలకు, ఆధారాలు అందించాలని కెనడాను కోరినట్లు ఎస్.జైశంకర్ బుధవారం తెలిపారు.
దర్యాప్తును భారత్ తోసిపుచ్చడం లేదు : విదేశీ వ్యవహారాల శాఖ
అయితే ఈ కేసులో దర్యాప్తును భారత్ తోసిపుచ్చడం లేదని జైశంకర్ తేల్చి చెప్పారు. ఓ కార్యక్రమంలో జర్నలిస్టు అడిగిన ప్రశ్నలకు విదేశాంగ మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. కెనడాలో హింసాత్మక ఘటనల నేపథ్యంలో భారతదేశం నుంచి వేర్పాటువాదాన్ని సమర్థించే హింస, తీవ్రమైన రాజకీయ అభిప్రాయాలకు కెనడియన్ రాజకీయాలు చోటు కల్పించాయని తాము భావిస్తున్నట్లు జైశంకర్ స్పష్టం చేశారు. ఆయా ఉగ్రవాద వ్యక్తులు కెనడియన్ రాజకీయాల్లో భాగం పొందారని, ఈ మేరకు వారి అభిప్రాయాలను వ్యక్తీకరించే స్వేచ్ఛ ఉందన్నారు. హైకమిషనర్‌తో సహా భారత్ దౌత్యవేత్తలపై దాడి చేయడం, హైకమిషన్, కాన్సులేట్ జనరల్‌పై పొగ బాంబులు విసిరిన దుస్థితి వచ్చిందన్నారు. కెనడా తన ఆరోపణలపై భారత్‌తో ఎలాంటి సాక్ష్యాలను పంచుకోలేదని జైశంకర్ నొక్కిచెప్పారు.