LOADING...
US Tariffs: నేటి నుంచి 50% సుంకాల భారం.. 48 బిలియన్‌ డాలర్ల వాణిజ్యంపై ప్రభావం
నేటి నుంచి 50% సుంకాల భారం.. 48 బిలియన్‌ డాలర్ల వాణిజ్యంపై ప్రభావం

US Tariffs: నేటి నుంచి 50% సుంకాల భారం.. 48 బిలియన్‌ డాలర్ల వాణిజ్యంపై ప్రభావం

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 27, 2025
08:05 am

ఈ వార్తాకథనం ఏంటి

రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు చేస్తున్న భారత్‌పై ఒత్తిడి తీసుకురావడానికి అమెరికా అదనపు సుంకాలు విధించింది. ఈ సుంకాలు అమెరికా కాలమానం ప్రకారం మంగళవారం అర్ధరాత్రి 12.01 గంటలకు (భారత కాలమానం ప్రకారం బుధవారం ఉదయం 9.30 గంటలకు) నుంచి అమలులోకి రానున్నాయి. గతంలో అమలులో ఉన్న 25 శాతం సుంకానికి అదనంగా మరో 25 శాతం కలిపి మొత్తం 50 శాతం వరకు భారత్‌ ఎగుమతులపై భారం పడనుంది. దీంతో మన దేశం నుంచి ఎగుమతయ్యే 48 బిలియన్‌ డాలర్ల విలువైన వాణిజ్యం నష్టపోయే అవకాశం ఉంది. ఈ మేరకు అమెరికా హోంలాండ్‌ భద్రతా విభాగం సోమవారం ముసాయిదా ఉత్తర్వులు జారీ చేసింది.

వివరాలు 

ఏ వస్తువులపై సుంకాలు? 

కొత్త సుంకాలు ప్రధానంగా జౌళి వస్తువులు, దుస్తులు, రత్నాలు, ఆభరణాలు, రొయ్యలు, తోలు వస్తువులు, పాదరక్షలు, జంతు ఉత్పత్తులు, రసాయనాలు, విద్యుత్‌-మెకానికల్‌ యంత్రాలపై అమలుకానున్నాయి. సుంకాలు వర్తించనివి ఔషధాలు, ఇంధన ఉత్పత్తులు, ఎలక్ట్రానిక్‌ వస్తువులు ఈ అదనపు సుంకాల పరిధిలోకి రానివి. ముసాయిదా ఉత్తర్వుల్లోని నిబంధనలు బుధవారం తెల్లవారుజామున 12.01 గంటలలోగా ఓడల్లో లోడ్‌ చేసిన ఉత్పత్తులు, ఇప్పటికే రవాణాలో ఉన్న సరుకులకు ఈ అదనపు సుంకాలు వర్తించవు. అవి సెప్టెంబరు 17వ తేదీ అదే సమయానికి వినియోగంలో ఉన్నట్లుగా, లేదా గోదాముల నుంచి బయటకు వచ్చినట్లుగా పరిగణిస్తారు. వీటికి ప్రత్యేక కోడ్‌ను కేటాయిస్తారు.

వివరాలు 

భారత్‌పై ప్రధాన భారం 

అమెరికా ఈ 50 శాతం అదనపు సుంకాలను అత్యధికంగా భారత్, బ్రెజిల్‌లపైనే విధిస్తోంది. వాణిజ్యశాఖ లెక్కల ప్రకారం 48.2 బిలియన్‌ డాలర్ల ఎగుమతులు ప్రభావితమయ్యే అవకాశం ఉంది. భారత్‌పై ఈ అదనపు భారంవల్ల అమెరికాకు ఎగుమతుల్లో మనతో పోటీ పడే ఇతర దేశాలకు లాభం కలగనుంది. రొయ్యల పరిశ్రమకు తీవ్ర దెబ్బ 2021-22 నుంచి అమెరికా భారత్‌కు అతి పెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో రెండు దేశాల మధ్య 131.8 బిలియన్‌ డాలర్ల వ్యాపారం జరిగింది. ఇందులో భారత్‌ నుంచి 86.5 బిలియన్‌ డాలర్ల ఎగుమతులు, 45.3 బిలియన్‌ డాలర్ల దిగుమతులు చోటుచేసుకున్నాయి.

వివరాలు 

ఈ పరిశ్రమలకు పెద్ద దెబ్బ

ఇక 50 శాతం సుంకాల భారం వల్ల జౌళి, రత్నాలు, ఆభరణాలు, రొయ్యల పరిశ్రమలకు పెద్ద దెబ్బ తగలనుంది. ఈ రంగాల్లో కార్మికుల ఉపాధి కూడా సంక్షోభంలో పడే ప్రమాదం ఉంది. జీటీఆర్‌ఐ అంచనాల ప్రకారం, అమెరికాకు భారత్‌ నుంచి జరిగే మొత్తం ఎగుమతుల్లో 66 శాతం (సుమారు 60.2 బిలియన్‌ డాలర్లు) కీలక కార్మిక రంగాలైన దుస్తులు, ఆభరణాలు, రొయ్యలు, కార్పెట్లు, ఫర్నిచర్‌లతోనే ఉంది. అదనంగా, ఆటోమొబైల్‌ ఎగుమతులపై (3.8 శాతం, విలువ 3.4 బిలియన్‌ డాలర్లు) 25 శాతం సుంకం విధించనున్నారు. ప్రస్తుతానికి భారత్‌ నుంచి జరిగే 30.2% ఎగుమతులపై ఎటువంటి సుంకాలు లేవు.

వివరాలు 

రొయ్యల పరిశ్రమకు కష్టకాలం 

రొయ్యల ఎగుమతులు : 2.4 బిలియన్‌ డాలర్ల విలువైన రొయ్యలు అమెరికాకు ఎగుమతి అవుతున్నాయి. దీని ప్రభావం విశాఖపట్టణం కేంద్రంగా ఉన్న వ్యాపారంపై ఎక్కువగా పడనుంది. వజ్రాలు, ఆభరణాలు : సుమారు 10 బిలియన్‌ డాలర్ల విలువైన రత్నాలు, ఆభరణాల ఎగుమతులు దెబ్బతిననున్నాయి. దీని కారణంగా సూరత్‌, ముంబయి పరిశ్రమలు ఒత్తిడిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. జౌళి, దుస్తులు : 10.8 బిలియన్‌ డాలర్ల విలువైన జౌళి, దుస్తుల ఎగుమతులు తగ్గే అవకాశముంది. ఇవి ప్రధానంగా తిరుపూర్‌ (తమిళనాడు), ఢిల్లీ-ఎన్‌సీఆర్‌, బెంగళూరులలో కేంద్రీకృతమై ఉండటంతో, ఈ ప్రాంతాల్లోని కార్మికులు ఉపాధి కోల్పోయే పరిస్థితి ఎదురవుతుంది.

వివరాలు 

 మనపై సుంకాల భారం వల్ల  లాభపడే  దేశాలు ఇవే..

కార్పెట్లు : 1.2 బిలియన్‌ డాలర్ల కార్పెట్‌ వ్యాపారం జరుగుతోంది. మనపై సుంకాల భారం వల్ల తుర్కియే, వియత్నాం వంటి దేశాలు లాభపడే అవకాశముంది. వ్యవసాయ ఉత్పత్తులు : 6 బిలియన్‌ డాలర్ల విలువైన వ్యవసాయ ఉత్పత్తులు (బాస్మతి బియ్యం, మసాలా దినుసులు, టీ పొడి) అమెరికాకు వెళ్తాయి. ఇక్కడ భారత్‌పై ఒత్తిడి పెరిగినప్పుడు పాకిస్థాన్‌, థాయ్‌లాండ్‌ లాంటి దేశాలకు ప్రయోజనం కలగనుంది.