Page Loader
Myanmar: భూకంపంతో దెబ్బతిన్న మయన్మార్‌..సహాయక చర్యల్లోభారత రోబోటిక్స్‌ మ్యూల్స్‌, నానో డ్రోన్‌లు(video)

Myanmar: భూకంపంతో దెబ్బతిన్న మయన్మార్‌..సహాయక చర్యల్లోభారత రోబోటిక్స్‌ మ్యూల్స్‌, నానో డ్రోన్‌లు(video)

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 11, 2025
12:29 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇటీవల మయన్మార్‌లో సంభవించిన భారీ భూకంపం ఆ దేశాన్ని తీవ్రంగా ప్రభావితం చేసింది. ముఖ్యంగా మాండలే,నేపిడా ప్రాంతాల్లో పరిస్థితి ఎంతో విషమంగా మారింది. ఈ సంక్షోభ సమయంలో మానవతా దృక్పథంతో భారత్‌ స్పందించి సహాయ చర్యలు ప్రారంభించింది. ఇందులో భాగంగా 'ఆపరేషన్‌ బ్రహ్మ' పేరిట పెద్దఎత్తున సహాయం కొనసాగుతోంది. శిథిలాల కింద చిక్కుకున్న వారిని వెలికితీయడానికి భారతదేశం రూపొందించిన రోబోటిక్‌ మ్యూల్స్‌ ఉపయోగిస్తున్నారు. ఇవి సిబ్బంది వెళ్లలేని శిథిలాల లోతుల్లోకి వెళ్లి ప్రాణాలతో ఉన్నవారిని గుర్తించి రక్షించే పనిలో నిమగ్నమై ఉన్నాయి.

వివరాలు 

'ఆపరేషన్‌ బ్రహ్మ' 

మార్చి 28న మయన్మార్‌ను వణికించిన భూకంపం కారణంగా ఇప్పటివరకు 3 వేలకు పైగా ప్రాణనష్టం సంభవించింది. ఇంకా అనేక మంది శిథిలాల్లో చిక్కుకున్నారని భావిస్తున్నారు. వారిని కాపాడేందుకు భారత భద్రతా బృందాలు నిరంతరం శ్రమిస్తున్నాయి. 'ఆపరేషన్‌ బ్రహ్మ' అంతర్గతంగా భారత్‌ సీ-17 గ్లోబ్‌మాస్టర్‌ విమానం ద్వారా 31 టన్నుల పైగా అత్యవసర సహాయక సామగ్రిని మయన్మార్‌కు పంపింది. మాండలేలో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన భారత సైనిక ఆసుపత్రికి అవసరమైన సామగ్రిని కూడా సరఫరా చేసింది. ఈ ఫీల్డ్‌ ఆసుపత్రి ద్వారా భూకంప బాధితులకు వైద్య సహాయం అందిస్తూ సేవలందిస్తోంది.

వివరాలు 

ఈ సహాయక చర్యల్లో..  118 మంది సిబ్బంది  

భారత నౌకాదళానికి చెందిన 'ఐఎన్‌ఎస్‌ ఘరియాల్‌' నౌక శనివారం నాడు తిలావా ఓడరేవుకు చేరుకుని వందల టన్నుల ఆహార పదార్థాలను మయన్మార్‌ ప్రజలకు అందజేసింది. అంతేగాక, క్వాడ్‌ దేశాలు అయిన భారత్‌, ఆస్ట్రేలియా, అమెరికా, జపాన్‌ కలిసి మయన్మార్‌కు మానవతా దృక్పథంతో 20 మిలియన్‌ డాలర్ల సహాయాన్ని ప్రకటించాయి. ప్రస్తుతం మొత్తం 118 మంది సిబ్బంది ఈ సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. నేషనల్‌ డిజాస్టర్‌ రీస్పాన్స్‌ ఫోర్స్‌ (ఎన్డీఆర్ఎఫ్‌) బృందాలు కూడా రంగంలోకి దిగి సహాయ చర్యల్లో చురుకుగా పాల్గొంటున్నాయి.

వివరాలు 

మృతుల సంఖ్య 3 వేలు

గత నెల 28వ తేదీన సంభవించిన భూకంపం మయన్మార్‌ను పాతాళానికి తోసేసింది. ఈ విపత్తు అనంతరం మృతుల సంఖ్య 3 వేలు దాటి వెళ్లింది. ఈ నేపథ్యంలో మయన్మార్‌కు సహాయం అందించేందుకు అనేక దేశాలు ముందుకు వచ్చాయి. ఇటీవల థాయిలాండ్‌లో నిర్వహించిన బిమ్‌స్టెక్‌ సదస్సులో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీ, మయన్మార్‌ ప్రజలకు భారత్‌ పూర్తిస్థాయిలో సహాయ సహకారాలు అందిస్తుందని అక్కడి సైనిక పాలకుడు జనరల్‌ మిన్‌ అంగ్‌ హ్లైంగ్‌కు హామీ ఇచ్చారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

భూకంప సహాయక చర్యలు.. మయన్మార్‌లో రోబో-మ్యూల్స్, నానో డ్రోన్‌లు