Page Loader
Nimisha Priya: యెమెన్‌లో భారత నర్సు నిమిషా ప్రియకు ఉరిశిక్ష.. ఈ నెల 16న అమలుకు ఆదేశాలు!
యెమెన్‌లో భారత నర్సు నిమిషా ప్రియకు ఉరిశిక్ష.. ఈ నెల 16న అమలుకు ఆదేశాలు!

Nimisha Priya: యెమెన్‌లో భారత నర్సు నిమిషా ప్రియకు ఉరిశిక్ష.. ఈ నెల 16న అమలుకు ఆదేశాలు!

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 09, 2025
10:23 am

ఈ వార్తాకథనం ఏంటి

యెమెన్ దేశం భారతీయ నర్సు నిమిష ప్రియాకు ఉరిశిక్ష విధించింది. అక్కడి అధ్యక్షుడు ఆమోదం ఇవ్వడంతో ఈ నెల 16న ఆమెకు శిక్ష అమలు చేయనుందని కథనాలు చెబుతున్నాయి. యెమెన్‌ జైలు అధికారులు ఆమె మరణశిక్ష అమలుపై కేరళలోని నిమిష కుటుంబానికి సమాచారం పంపినట్టు నివేదికలు వెల్లడించాయి. ఈ పరిణామాల నేపథ్యంలో భారత విదేశాంగ శాఖ స్పందించింది. నిమిష ప్రియాకు శిక్ష ఖరారైన నాటి నుంచి ఆమె కుటుంబంతో తాము నిరంతరం సంపర్కంలో ఉన్నామని తెలిపింది. ఆమెను ఉరిశిక్ష నుండి తప్పించేందుకు భారత ప్రభుత్వం అన్ని అవకాశాలను పరిశీలిస్తూ కృషి చేస్తోందని కూడా స్పష్టం చేసింది. అయితే, గతంలో నిమిష ప్రియా క్షమాభిక్ష కోరినా యెమెన్ అధ్యక్షుడు రషద్ అల్-అలిమి దాన్ని తిరస్కరించారు.

వివరాలు 

కేరళలో నర్సింగ్ కోర్సు పూర్తి

కేరళ రాష్ట్రంలోని పాలక్కాడ్ జిల్లాకు చెందిన నిమిష ప్రియా, అక్కడే నర్సింగ్ కోర్సు పూర్తి చేసింది. అప్పట్లో ఆమె కుటుంబం ఆర్థికంగా కష్టాల్లో ఉండడంతో, పరిస్థితి మెరుగుపరచాలనే లక్ష్యంతో ఉద్యోగం కోసం ప్రయత్నించింది. ఈ క్రమంలో 2008లో ఆమె యెమెన్ వెళ్లి అక్కడే ఉద్యోగంలో చేరింది. అక్కడ కొంతకాలం పని చేసిన ఆమె, భారత్‌కు తిరిగొచ్చి నిమిషా థామస్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. ఆ తర్వాత భర్తతో కలిసి తిరిగి యెమెన్ వెళ్లింది. 2012లో ఒక కుమార్తెకు జన్మించింది. అయితే చిన్నారిని యెమెన్‌లో పెంచడం కష్టమవుతుందని భావించి, భర్త థామస్ బిడ్డను తీసుకొని భారత్‌కి వెళ్లిపోయాడు. కానీ నిమిష మాత్రం అక్కడే ఉండి తన ఉద్యోగాన్ని కొనసాగించింది.

వివరాలు 

మెహదికి మత్తుమందు ఇచ్చి,చంపినట్టు ఆరోపణలు

రెండు సంవత్సరాల తర్వాత ఆమె స్వంతంగా ఒక క్లినిక్ ప్రారంభించాలని నిర్ణయించుకుంది. యెమెన్ చట్టాల ప్రకారం, ఆ దేశానికి చెందిన తలాల్ అదిబ్ మెహది అనే వ్యక్తిని భాగస్వామిగా తీసుకొని క్లినిక్‌ను ప్రారంభించింది. ప్రారంభంలో క్లినిక్ సాఫీగా నడిచింది. కానీ కొంతకాలానికే మెహది తన వాటాను దుర్వినియోగం చేస్తూ, నిమిషను వేధించాడని ఆమె ఆరోపించింది. 2016లో దీనిపై ఆమె స్థానిక పోలీసులను ఆశ్రయించినా వారు స్పందించలేదని చెబుతుంది. వేరే మార్గం లేక ఆమె మెహదికి మత్తుమందు ఇచ్చి, అతడిని చంపినట్టు ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటన వెలుగులోకి రావడంతో పోలీసులు నిమిషను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. అనంతరం ఆమెను జైలుకు తరలించారు.

వివరాలు 

క్షమాభిక్ష అభ్యర్థనను తిరస్కరించిన అధ్యక్షుడు

కేసును దర్యాప్తు చేసిన పోలీసులు, మహదీతో ఆమెకు పాస్‌పోర్ట్ తీసుకోవడంలో ఏర్పడిన ఘర్షణలో మత్తుమందు ఇచ్చి హత్య చేసినట్టు తెలిపారు. దీనికి సంబంధించి కోర్టులో ఆధారాలు సమర్పించడంతో, యెమెన్ న్యాయస్థానం నిమిష ప్రియాకు అక్కడి చట్టాల ప్రకారం ఉరిశిక్ష విధించింది. ఆమె తరఫున దాఖలైన క్షమాభిక్ష అభ్యర్థనను అధ్యక్షుడు తిరస్కరించారు. ఇటీవల ఆ మరణశిక్షకు అధ్యక్షుని ఆమోదం లభించడంతో ఈ నెల 16న ఉరిశిక్ష అమలు చేయనున్నట్టు అధికారులు స్పష్టం చేశారు.