Page Loader
Australia: భారత సంతతి వ్యక్తిని దారుణంగా కొట్టిన ఆస్ట్రేలియా పోలీసులు.. జార్జి ఫ్లాయిడ్‌ ఉదంతమంటూ ఆరోపణ
భారత సంతతి వ్యక్తిని దారుణంగా కొట్టిన ఆస్ట్రేలియా పోలీసులు.

Australia: భారత సంతతి వ్యక్తిని దారుణంగా కొట్టిన ఆస్ట్రేలియా పోలీసులు.. జార్జి ఫ్లాయిడ్‌ ఉదంతమంటూ ఆరోపణ

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 03, 2025
12:22 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆస్ట్రేలియాలోని అడిలైడ్ ప్రాంతంలో భారత సంతతికి చెందిన వ్యక్తి గౌరవ్ కుండిని పోలీసులు బలవంతంగా అరెస్టు చేశారనే ఆరోపణలు తీవ్ర స్థాయిలో వెలుగు చూసాయి. అంతర్జాతీయ మీడియా సమాచారం ప్రకారం, గౌరవ్‌ను అతని నివాసానికి వచ్చి అరెస్టు చేసినప్పుడు, పోలీసులు అతనిపై శారీరకంగా దాడి చేశారని అతని భార్య అమృత్‌పాల్ కౌర్ తెలిపారు. అరెస్టు సమయంలో అమానుషంగా ప్రవర్తించిన పోలీసులు గౌరవ్‌ను నేలపై బలవంతంగా పడేసి పోలీసులు హింసించారని.. తానే నేరం చేయలేదని అతడు ఎంత వేడుకున్నా కనికరించలేదని ఆమె తెలిపారు. పోలీసులలో ఒకరు అతని మెడపై మోకాలితో బలంగా నొక్కారని ఆమె వివరించారు. అదుపులోకి తీసుకువెళ్తుండగా,గౌరవ్ తల నేలకూ, పోలీస్ వాహనానికి బలంగా తాకి స్పృహ కోల్పోయాడని ఆమె చెప్పారు.

వివరాలు 

గౌరవ్ ఆరోగ్య పరిస్థితి విషమం 

ఆయనను ఆసుపత్రికి తరలించగా, వైద్యులు గౌరవ్ మెదడు, మెడ నరాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని నిర్ధారించారని వెల్లడించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని, ఈ ఘటన తనను తీవ్రంగా కలిచివేసిందని అమృత్‌పాల్ పేర్కొన్నారు. ఈ ఘటనకు న్యాయం జరగాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ఈ ఘటన 2020లో అమెరికాలో జరిగిన జార్జ్ ఫ్లాయిడ్ ఉదంతాన్ని గుర్తుకు తెస్తోందని ఆమె వ్యాఖ్యానించారు. అప్పట్లో పోలీసు అధికారి అమానుషంగా ప్రవర్తించడంతో ఫ్లాయిడ్ ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.

వివరాలు 

పోలీసుల వివరణ 

ఈ ఆరోపణలపై స్పందించిన స్థానిక పోలీసులు, గౌరవ్‌ను నిబంధనల ప్రకారమే అరెస్టు చేశామని పేర్కొన్నారు. అదుపులోకి తీసుకుంటున్న సమయంలో ఆయన అసహకారపూరితంగా ప్రవర్తించాడని, అందువల్లే బలవంతంగా చర్యలు తీసుకోవాల్సి వచ్చిందని వారు స్పష్టం చేశారు. ప్రస్తుతం ఈ కేసును సమగ్రంగా దర్యాప్తు చేసి, అవసరమైన చర్యలు తీసుకుంటామని పోలీసు ఉన్నతాధికారులు హామీ ఇచ్చారు.

వివరాలు 

జార్జ్ ఫ్లాయిడ్ ఘటన ఏమిటి? 

2020లో అమెరికాలో జార్జ్ ఫ్లాయిడ్ అనే 46 ఏళ్ల ఆఫ్రికన్ అమెరికన్ వ్యక్తిని ఓ పోలీసు అధికారి అరెస్టు చేస్తున్న సందర్భంలో అతని మెడపై మోకాలితో బలంగా నొక్కాడు. దీని వల్ల మెడపై తీవ్ర ఒత్తిడి ఏర్పడి, మెదడుకు రక్తప్రసరణ ఆగిపోయి గుండె ఆగి అతను మరణించాడని వైద్యులు తేల్చారు. ఈ ఘటన అమెరికాతో పాటు ప్రపంచవ్యాప్తంగా పెద్దఎత్తున నిరసనలకూ, ఉద్యమాలకూ దారి తీసింది. నల్లజాతీయులపై జరుగుతున్న హింస, జాతి వివక్షలకు వ్యతిరేకంగా వేలాది మంది ప్రజలు రోడ్డెక్కి నిరసన ప్రదర్శనలు చేశారు. ఈ ఉదంతం నేపథ్యంలో, అప్పటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బంకర్‌లో తలదాచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.