
Indian-origin truck driver: భారతీయ డ్రైవర్ యూ-టర్న్.. ట్రంప్-కాలిఫోర్నియా గవర్నర్ మధ్య వివాదం
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికాలోని ఫ్లోరిడా టర్న్‌పైక్ రహదారిపై జరిగిన ఘోర ప్రమాదం ఇప్పుడు దేశ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. భారీ సెమీ-ట్రక్ నడుపుతున్న భారతీయుడు హర్జిందర్ సింగ్ అక్రమంగా యూ-టర్న్ తీసుకోవడం వల్ల ఎదురుగా వచ్చిన కారుతో ఢీకొనడంతో, ఆ కారులో ఉన్న ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనకు సంబంధించి వీడియోలు,వివరాలు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అయ్యాయి. సాధారణ రోడ్డు ప్రమాదంగా కాకుండా,చట్టవిరుద్ధ డ్రైవింగ్ కారణంగా ఇతరుల మృతికి కారణమయ్యాడని భావించి ఫ్లోరిడా హైవే పెట్రోల్ అధికారులు హోమిసైడ్ కేసుగా నమోదు చేశారు. దీంతో హర్జిందర్ సింగ్‌పై హత్యా నేరం కేసు నమోదు కాగా,అతను అక్రమ వలసదారుడిగా అమెరికాలో ఉన్నందున ఇమిగ్రేషన్ చట్టాల ఉల్లంఘన కేసుకూడా ఎదుర్కోవాల్సి వస్తోంది.
వివరాలు
కాలిఫోర్నియా గవర్నర్ గవిన్ న్యూసమ్‌పై నేరుగా ఆరోపణలు
ప్రస్తుతం ఆయన పోలీసు కస్టడీలో ఉన్నారని అధికారులు ధృవీకరించారు. అయితే ఈ కేసులో మరో కోణం బయటపడింది. 2018లో అమెరికాలో అక్రమంగా ప్రవేశించినప్పటికీ, కాలిఫోర్నియా రాష్ట్ర డిపార్ట్‌మెంట్ ఆఫ్ మోటార్ వెహికల్స్ (డీఎంవీ) హర్జిందర్ సింగ్‌కు కమర్షియల్ డ్రైవింగ్ లైసెన్స్ ఎలా జారీ చేసిందనే అంశం వివాదాస్పదమైంది. దీనిపై అమెరికా హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ డిపార్ట్‌మెంట్ (డీహెచ్‌ఎస్) కఠిన వ్యాఖ్యలు చేస్తూ, కాలిఫోర్నియా గవర్నర్ గవిన్ న్యూసమ్‌పై నేరుగా ఆరోపణలు చేసింది. అక్రమ వలసదారులు ప్రజల ప్రాణాలతో ఆడుకునే స్థితి రావడం ఆయన విధానాల ఫలితమేనని, తాము ఇలాంటి నేరస్తులను అమెరికా నుండి పంపించేందుకు నిరంతరం చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేసింది.
వివరాలు
2019 జనవరిలో "నోటీసు టు అప్పీర్"
అయితే దీనికి ప్రతిస్పందనగా గవర్నర్ న్యూసమ్ ప్రెస్ ఆఫీస్ వేరే వాస్తవాలను వెల్లడించింది. హర్జిందర్ సింగ్ 2018 సెప్టెంబర్‌లో అక్రమంగా కాలిఫోర్నియా సరిహద్దు దాటి వచ్చినప్పుడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అని గుర్తు చేసింది. సరిహద్దు దాటిన వెంటనే ఆయనను బోర్డర్ పెట్రోల్ అరెస్టు చేసిందని, ఫాస్ట్-ట్రాక్ డిపోర్టేషన్ ప్రక్రియ కూడా ప్రారంభించిందని తెలిపింది. తర్వాత 2019 జనవరిలో "నోటీసు టు అప్పీర్" ఇచ్చి, ఐదు వేల డాలర్ల ఇమిగ్రేషన్ బాండ్‌పై విడుదల చేశారని వివరించింది.
వివరాలు
ట్రంప్-న్యూసమ్ మధ్య మాటల యుద్ధం
న్యూసమ్ ఆఫీస్ ఇంకా స్పష్టం చేస్తూ, కాలిఫోర్నియా రాష్ట్రంలో కమర్షియల్ డ్రైవింగ్ లైసెన్స్ దేశంలో చట్టబద్ధంగా ఉన్నవారికే జారీ అవుతుందని తెలిపింది. హర్జిందర్ సింగ్ అప్పటి నుండి ఇమిగ్రేషన్ విచారణల ప్రక్రియలోనే ఉన్నాడని వివరించింది. ఈ ప్రమాదం కారణంగా ఒకవైపు ముగ్గురు నిరపరాధులు ప్రాణాలు కోల్పోగా, మరోవైపు ట్రంప్-న్యూసమ్ మధ్య మాటల యుద్ధానికి కారణమైంది. వలస విధానాలు, డ్రైవింగ్ లైసెన్స్ మంజూరు విధానాలపై ఇప్పుడు అమెరికాలో తీవ్ర రాజకీయ తలంపులు మొదలయ్యాయి.