Henley Index: హెన్లీ ఇండెక్స్‌లో పడిపోయిన భారత పాస్‌పోర్ట్ ర్యాంక్.. 56 దేశాలకు వీసా లేకుండానే ప్రయాణం
ఈ వార్తాకథనం ఏంటి
భారత పాస్‌పోర్ట్‌కు హెన్లీ పాస్ పోర్ట్ ఇండెక్స్‌లో మరోసారి ర్యాంక్ తగ్గింది. తాజా జాబితాలో ఇండియా 78వ స్థానానికి పడిపోయింది. ఫిబ్రవరి 2026లో 75వ స్థానంలో ఉన్న భారత పాస్‌పోర్ట్ ఇప్పుడు మూడు స్థానాలు దిగజారింది. అయితే ర్యాంక్ తగ్గినా.. భారతీయులు ఇంకా 56 దేశాలకు వీసా ఫ్రీ, వీసా ఆన్ అరైవల్, ఈటీఏ (Electronic Travel Authorisation) సౌకర్యాలతో ప్రయాణించే అవకాశం ఉంది. 2006లో భారత పాస్‌పోర్ట్ అత్యుత్తమంగా 71వ స్థానంలో నిలిచింది. తాజా ర్యాంకింగ్స్‌లో ఇండియా, బుర్కినా ఫాసో, క్యూబా, సెనెగల్ దేశాలతో సమాన స్థానంలో ఉంది.
వివరాలు
ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్ట్‌గా సింగపూర్
అంతర్జాతీయ విమాన రవాణా సంస్థ (IATA) డేటా ఆధారంగా హెన్లీ ఇండెక్స్ 199 దేశాలు, 277 గమ్యస్థానాలను పరిశీలించి ఈ జాబితాను విడుదల చేసింది. పశ్చిమ ఆసియా, ట్రాన్స్ అట్లాంటిక్ ప్రాంతాల్లో కొనసాగుతున్న సంక్షోభాల ప్రభావంతో భారత పాస్‌పోర్ట్ బలం తగ్గినట్లు నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం భారతీయులు థాయిలాండ్, మలేషియా, భూటాన్, నేపాల్, మారిషస్ వంటి 30 దేశాలకు వీసా లేకుండానే వెళ్లొచ్చు. అలాగే మాల్దీవులు, శ్రీలంక, ఇండోనేషియా, ఖతార్ వంటి దేశాల్లో వీసా ఆన్ అరైవల్ సౌకర్యం ఉంది. మరోవైపు సింగపూర్ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్ట్‌గా నిలిచి 192 దేశాలకు వీసా ఫ్రీ యాక్సెస్ కల్పిస్తోంది.