LOADING...
California: కాలిఫోర్నియాలో అమెరికా పోలీసుల కాల్పుల్లో భారతీయ టెక్కీ మృతి
కాలిఫోర్నియాలో అమెరికా పోలీసుల కాల్పుల్లో భారతీయ టెక్కీ మృతి

California: కాలిఫోర్నియాలో అమెరికా పోలీసుల కాల్పుల్లో భారతీయ టెక్కీ మృతి

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 19, 2025
09:49 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికాలో జరిగిన పోలీసుల కాల్పుల్లో మహబూబ్‌నగర్‌కు చెందిన యువకుడు దుర్మరణం పాలయ్యాడు. ఈ ఘటన రెండు వారాల క్రితం చోటు చేసుకున్నప్పటికీ, తాజాగా వెలుగులోకి వచ్చింది. మహబూబ్‌నగర్ పట్టణంలోని బీకే రెడ్డి కాలనీలో నివసించే ఉపాధ్యాయులు హసానుద్దీన్, ఫర్జానా బేగం దంపతుల కుమారుడు మహ్మద్ నిజాముద్దీన్ (29) సెప్టెంబర్ 3న అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం శాంటా క్లారా ప్రాంతంలో జరిగిన వివాదంలో బలయ్యాడు. అతడు ఒక రూమ్మేట్‌తో కలిసి అద్దె గదిలో ఉండేవాడు. ఆ రోజు ఏసీ వాడకంపై ఇద్దరి మధ్య వాగ్వాదం తలెత్తింది. ఆగ్రహంతో నిజాముద్దీన్ కూరగాయలు కోసే కత్తితో రూమ్మేట్‌పై దాడి చేశాడు. వారి గది నుంచి శబ్దాలు రావటాన్ని గమనించిన చుట్టుపక్కల వాళ్లు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

వివరాలు 

నిజాముద్దీన్‌ తండ్రి హసానుద్దీన్‌కు ఫోన్‌

పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని లొంగిపోవాలని హెచ్చరించారు. కానీ నిజాముద్దీన్ వారి మాట వినకపోవడంతో పోలీసులు నాలుగు రౌండ్ల కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో అతడు అక్కడికక్కడే మృతిచెందాడు. గాయపడ్డ రూమ్మేట్‌ను స్థానిక ఆస్పత్రికి తరలించారు. గురువారం ఉదయం కర్ణాటకకు చెందిన ఒక విద్యార్థి నిజాముద్దీన్‌ తండ్రి హసానుద్దీన్‌కు ఫోన్‌ చేసి చెప్పడంతో విషయం వెలుగులోకి వచ్చింది. నిజాముద్దీన్ 2016లో ఎంఎస్ చదవడానికి అమెరికాకు వెళ్లి, అప్పటి నుండి అక్కడే ఉంటున్నాడు. ఇటీవల తల్లిదండ్రులతో మాట్లాడినప్పుడు త్వరలో ఇండియాకు వస్తానని తెలిపాడు. అతడి మరణ వార్తతో తల్లిదండ్రులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

వివరాలు 

తండ్రి ఆవేదన 

"నా కొడుకు 2016లో అమెరికాకు వెళ్ళాడు. మొదట రెండు సంవత్సరాలు ఫ్లోరిడాలో చదువుకున్నాడు. తరువాత ఏడాది పాటు ఉద్యోగం కోసం వెతికాడు.ఆపై నాలుగేళ్లు పనిచేశాడు.2023లో ప్రమోషన్‌తో కాలిఫోర్నియాకు వెళ్లాడు. కానీ,వీసా గడువు ముగియడంతో పొడిగింపు ఇస్తామని కంపెనీ చెప్పి చివరకు ఇవ్వలేదు. ప్రభుత్వ అనుమతితో ఆరు నెలలుగా అక్కడే ఉన్నాడు.మా బాబు రూమ్మేట్ తరచుగా ఏసీ ఆపేస్తుండటంతో గొడవ జరిగిందని చెబుతున్నారు.ఈ విషయం గురువారం ఉదయం రాయచూర్‌కు చెందిన అతని స్నేహితుడు సయ్యద్ మొయినుద్దీన్ ఫోన్ చేసి మాకు తెలిపాడు. అంతవరకు మాకు సమాచారం లేదు. నిజంగా ఏం జరిగిందో బయటకు రావాలి. మాకు న్యాయం జరగాలి. ఇందుకోసం మేము విదేశాంగ మంత్రికి ఫిర్యాదు చేయబోతున్నాం" అని హసానుద్దీన్ కన్నీరుమున్నీరయ్యారు.