మోదీతో జిన్‌పింగ్.. ఇండో చైనా సంబంధాలు బలపడితే ఇరు దేశాలకూ లాభమే
భారత్-చైనా సంబంధాలపై డ్రాగన్ దేశ అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు మెరుగుపడితే ఉమ్మడి ప్రయోజనాలకు మేలు కలుగుతుందని ప్రధాని మోదీతో అన్నారు. ఈనెల 22 నుంచి 24 వరకు దక్షిణాఫ్రికాలోని జొహన్నెస్‌బర్గ్‌లో బ్రిక్స్ సదస్సు నిర్వహించారు. ఇందులో భాగంగానే ఈ ఇద్దరు నేతలు లోతుగా చర్చించినట్లు చైనా విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రకటన విడుదల చేసింది. భారత్ చైనా రిలేషన్స్ బలపడితే ప్రపంచ శాంతికే కాకుండా ఇరు దేశాల అభివృద్ధి, శాంతి, సుస్థిరతలకు ఊతమిస్తుందని జిన్‌పింగ్ చెప్పారని వెల్లడించింది. ద్వైపాక్షిక చర్చల్లో భాగంగా భారత్-చైనా సంబంధాలపై మోదీ, జిన్‌పింగ్ తమ అభిప్రాయాలను పంచుకున్నట్లు చైనా విదేశాంగ శాఖ ప్రస్తావించింది.
వెస్టర్న్ సెక్టర్‌లో గల సమస్యలపై జిన్‌పింగ్ వద్ద ప్రస్తావించిన మోదీ
ఇండో - చైనా సరిహద్దులో అపరిష్కృతంగా ఉన్న సమస్యలను శాంతి, సామరస్యాలతో ఉమ్మడిగా పరిష్కరించుకోవాలని భావిస్తున్నట్లు చైనా విదేశాంగ మంత్రిత్వశాఖ పేర్కొంది. ఈ మేరకు ద్వైపాక్షిక సంబంధాలను దృష్టిలో ఉంచుకోవాలని సూచించింది. గురువారం బ్రిక్స్ సదస్సులో మోదీ, జిన్‌పింగ్ ఒకే వేదికపై కూర్చున్నారు. వేదికపైకి వెళ్లే క్రమంలోనూ ఇరుదేశాధినేతలు పక్క పక్కనే వెళ్తూ చర్చించుకుంటున్నట్లు కనిపించింది. భారత్-చైనా సరిహద్దులోని వాస్తవాధీన రేఖ వెంబడి వెస్టర్న్ సెక్టర్‌లో గల సమస్యల పరిష్కారంపై జిన్‌పింగ్ తో మోదీ ప్రస్తావించారు. ఈ మేరకు భారత విదేశాంగ శాఖ కార్యదర్శి వినయ్ మోహన్ క్వాట్రా వెల్లడించారు.