BRICS: 'బ్రిక్స్' కూటమిలో మరో 40దేశాలు ఎందుకు చేరాలనుకుంటున్నాయి?
బ్రిక్స్ కూటమి.. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికాలతో కూడిన అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల సమాహారం. బ్రిక్స్ కూటమి ప్రారంభించి దాదాపు 22 సంవత్సరాలు అవుతోంది. ఈ కూటమిలో చేరేందుకు పలు దేశాలు ఆసక్తిని కనబరుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ కూటమిని విస్తరించాలని సభ్య దేశాలు నిర్ణయించుకున్నాయి. అర్జెంటీనా, ఇరాన్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)తో సహా దాదాపు 40 దేశాలు బ్రిక్స్ సభ్య దేశాలతో సంబంధాలను బలోపేతం చేయడానికి ఆసక్తిని వ్యక్తం చేస్తున్నాయి. బ్రిక్స్ దేశాల కూటమి ప్రపంచ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో దాదాపు 31.5%వాటాను కలిగి ఉంది. దీంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ఈ కూటమి ఆదిపత్యం ఏంటనేది ఇది స్పష్టం చేస్తుంది.
బ్రిక్స్‌లో చేరాలనుకోవడానికి కారణాలు ఇవే..
బ్రిక్స్ అనేది ప్రపంచవ్యాప్తంగా ప్రభావవంతమైన కూటమి. దాని సభ్య దేశాలు గ్రూప్ ఆఫ్ సెవెన్ (జీ7) కంటే మెరుగైన పనితీరును కనబరుస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న ఐదు బ్రిక్స్ దేశాలు ప్రపంచ జీడీపీలో దాదాపు 31.5% వాటాను కలిగి ఉన్నాయి. జీ7 దేశాల జీడీపీ కేవలం 30.7శాతం మాత్రమే. 3.14 బిలియన్ల జనాభాతో, బ్రిక్స్ దేశాలు ప్రపంచ జనాభాలో 41% వాటాను కలిగి ఉన్నాయి. ఈ అంకెలు దేశాల శక్తి, ప్రాముఖ్యతను వివరిస్తున్నాయి. 2014లో బ్రిక్స్ స్థాపించిన న్యూ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఈ కూటమిలో ఇతర దేశాలు చేరేందుకు మరో కారణమని చెప్పాలి. బ్యాంక్ స్థాపించినప్పటి నుంచి మౌలిక సదుపాయాల రంగాల్లో 34బిలియన్ డాలర్ల విలువైన దాదాపు 100 ప్రాజెక్ట్‌లకు ఆర్థిక సహాయం చేసింది.
బ్రిక్స్ కూటమి -2023 లక్ష్యాలు ఇవే..
బ్రిక్స్ సమ్మిట్ సభ్య దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడులు, స్థిరమైన అభివృద్ధితో సహా వివిధ రంగాలలో సహకారాన్ని పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకుంది. గురువారం నుంచి శుక్రవారం వరకు జరిగే ఈ కార్యక్రమంలో గ్రూప్ విస్తరణ ప్రణాళికలపై కూడా చర్చించనున్నారు. అలాగే రష్యా-ఉక్రయిన్ సంక్షోభంతో పాటు డి-డాలరైజేషన్ అంశంపై కూడా ప్రధానంగా చర్చించనున్నారు. బ్రిక్స్‌లో చేరడానికి అనేక దేశాలు ఆసక్తి చూపినప్పటికీ, ప్రస్తుత సభ్యుల మధ్య భిన్నాభిప్రాయాల కారణంగా విస్తరణపై అనిశ్చితి నెలకొంది. దీంతో ఈ సమావేశంలో అనిశ్చితిని తొలగించుకునే అంశం దిశగా సభ్యదేశాలు ముందడుగు వేసే అవకాశాలు ఉన్నాయి.
కూటమి విస్తరణపై భారత్, బ్రెజిల్ అభ్యంతరం
చైనా, రష్యా ప్రపంచ వ్యాప్తంగా తమ ప్రభావాన్ని పెంచుకోవడానికి బ్రిక్స్ కూటమిని విస్తరించేందుకు ఉత్సాహం చూపుతున్నాయి. అయితే భారత్, బ్రెజిల్ విస్తరణపై ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దీని వల్ల తమ ప్రభావం తగ్గుందని ఇరు దేశాలు అభిప్రాయపడుతున్నాయి. అంతేకాకుండా ఈ కూటమి చైనా ఆధిపత్యం చెలరేగుతుందని భారత్ భయపడుతోంది. కాగా, కొత్త సభ్యులను పారదర్శకంగా, ఇప్పటికే ఉన్న సభ్యుల మధ్య ఏకాభిప్రాయం ఆధారంగా చేర్చుకోవాలని బ్రెజిల్ వాదిస్తోంది. భారత్, బ్రెజిల్ భయాందోళన మధ్య కూటమి విస్తరణకు మార్గం సుగమం అవుతుందా? లేదో వేచి చూడాల్సిందే.