Page Loader
Ferry Fire: ప్రయాణీకుల పడవలో ఘోర ప్రమాదం.. మంటల్లో ఫెర్రీ.. 5మంది మృతి 
ప్రయాణీకుల పడవలో ఘోర ప్రమాదం.. మంటల్లో ఫెర్రీ.. 5మంది మృతి

Ferry Fire: ప్రయాణీకుల పడవలో ఘోర ప్రమాదం.. మంటల్లో ఫెర్రీ.. 5మంది మృతి 

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 21, 2025
08:01 am

ఈ వార్తాకథనం ఏంటి

ఇండోనేషియా తీరంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. 280 మంది ప్రయాణికులతో వెళ్తున్న పడవ (ఫెర్రీ)లో ఆకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనతో అందరు ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ప్రాణాలు కాపాడుకోవడానికి పలువురు సముద్రంలోకి దూకి ప్రాణాలను రక్షించుకున్నారు. ఈ ప్రమాదంలో ఐదుగురు మరణించారు. మృతుల్లో గర్భిణి మహిళ కూడా ఉన్నట్లు గుర్తించారు. 'ద బార్సిలోనా 5' (KM) ఫెర్రీ.. ఇండోనేషియాలోని తలౌడ్ ప్రాంతం నుంచి మనాడో నగరానికి ప్రయాణిస్తున్న సమయంలో ఈ ప్రమాదం సంభవించింది. ఈ ప్రయాణదారుల పడవలో ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. అగ్నికీలలు వ్యాపించడంతో ప్రయాణికులంతా భయంతో కేకలు వేస్తూ పరుగులు తీశారు.

వివరాలు 

130 మంది కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి 

కొందరు తమ చిన్న పిల్లలతో సహా సముద్రంలోకి దూకారు. ఈ దృశ్యాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. లైఫ్ జాకెట్లు ధరించడంతో చాలామంది సురక్షితంగా బయటపడగలిగారు. ప్రమాద సమాచారాన్ని అందుకున్న వెంటనే రక్షణ బృందాలు రంగంలోకి దిగాయి. మత్స్యకారుల సాయంతో సహాయక చర్యలు ప్రారంభించాయి. ఇప్పటివరకు ప్రయాణికులు, సిబ్బంది సహా 150 మందిని రక్షించినట్లు అధికారులు తెలిపారు. ఇంకా 130 మంది కనిపించకుండా పోయారని, వారికోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని వెల్లడించారు. ఫెర్రీలో మంటలు ఎలా అంటుకున్నాయనేది ఇప్పటికీ స్పష్టత రాలేదని అధికారులు వెల్లడించారు.

వివరాలు 

ఫెర్రీ దిగువ భాగాల నుంచి ముందుగా దట్టమైన నల్లటి పొగ

ఫెర్రీ అంతా మంటల్లో కూరుకుపోయింది. దట్టమైన నల్లటి పొగ ఆ ప్రాంతాన్ని కమ్మేసింది. అటు ప్రయాణికులు హాహాకారాలు చేస్తున్నారు. ఈ దృశ్యాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారి ప్రమాద తీవ్రతకు అద్దం పడుతున్నాయి. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. ఫెర్రీ దిగువ భాగాల నుంచి ముందుగా దట్టమైన నల్లటి పొగ వస్తూ కనిపించిందని, ఆ వెంటనే మంటలు వ్యాపించాయని తెలిపారు. దీనిని గమనించిన ప్రయాణికులు వెంటనే భయంతో సముద్రంలోకి దూకడం ప్రారంభించారని చెప్పారు. 'కాపాడండి.. కాపాడండి' అంటూ ప్రయాణికులు ఆర్తనాదాలు చేశారు. పడవ అంతా ప్రయాణికులతో నిండి ఉండటంతో సిబ్బంది వెంటనే వారికి లైఫ్ జాకెట్లు అందించారు. వాటి సహాయంతో కొందరు సముద్రంలోకి దూకి ప్రాణాలను కాపాడుకున్నారు.

వివరాలు 

ప్రమాద దృశ్యాలను ప్రత్యక్షంగా ప్రసారం చేసిన  ప్రయాణికుడు 

ఈ ప్రమాద దృశ్యాలను అబ్దుల్ రహమద్ అగు అనే ప్రయాణికుడు ప్రత్యక్షంగా ప్రసారం చేశాడు. నీటిలో ఉండగా అతని చేతిలో ఏడుస్తున్న చిన్నారి ఉన్న వీడియోను ఆయన చిత్రించారు. "మా పడవలో మంటలు అంటుకున్నాయి.. మేమంతా సముద్రంలో ఇరుక్కుపోయాం.. మాకు సహాయం చేయండి.. ఫెర్రీలో ఇంకా చాలా మంది ఉన్నారు. మేము కాలిపోతున్నాం.. వెంటనే సహాయం చేయండి" అంటూ ఆ వీడియోలో వేడుకున్నాడు. ఈ సమాచారం అందుకున్న వెంటనే ఇండోనేషియా నావికాదళం మూడు నౌకలను సహాయక చర్యలకు పంపింది. స్థానిక మత్స్యకారులు కూడా సహాయ చర్యల్లో పాల్గొన్నారు.

వివరాలు 

మూడవ డెక్‌లో మంటలు మొదలై వేగంగా పడవ అంతటా వ్యాపించింది 

తాజా సమాచారం ప్రకారం దాదాపు 150 మందిని రక్షించారు. అయితే ఇంకా 130 మంది జాడ తెలియలేదని అధికారులు తెలిపారు. మంటలకు కారణం ఇంకా గుర్తించలేకపోయారని వెల్లడించారు. మూడవ డెక్‌లో మంటలు మొదలై వేగంగా పడవ అంతటా వ్యాపించాయని భావిస్తున్నారు. ఈ ఘోర ప్రమాదం ఇండోనేషియాలోని ఫెర్రీలలో ప్రయాణికుల భద్రతపై మరింత శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరాన్ని సూచిస్తోంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ప్రమాదాన్ని ప్రత్యక్ష ప్రసారం చేసిన అబ్దుల్ రహమద్ అగు