Page Loader
Iran: 'వాట్సాప్‌ తొలగించండి'.. ఇరాన్‌ ప్రజలకు కీలక హెచ్చరిక 
'వాట్సాప్‌ తొలగించండి'.. ఇరాన్‌ ప్రజలకు కీలక హెచ్చరిక

Iran: 'వాట్సాప్‌ తొలగించండి'.. ఇరాన్‌ ప్రజలకు కీలక హెచ్చరిక 

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 18, 2025
03:21 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇరాన్‌ ప్రజలు తమ ఫోన్లలో ఉన్న వాట్సాప్‌ యాప్‌ను తక్షణమే తొలగించాల్సిందిగా ఆ దేశ ప్రభుత్వం ప్రజలకు సూచించింది. ఈ మేరకు ఇరాన్‌ అధికార ప్రభుత్వ మీడియా సంస్థ ఓ అధికారిక ప్రకటన విడుదల చేసింది. వాట్సాప్‌ యాప్‌ వినియోగదారుల వ్యక్తిగత సమాచారాన్ని సేకరించి, దానిని ఇజ్రాయెల్‌కు పంపిస్తోంది అని తీవ్ర ఆరోపణలు చేసింది. అయితే, ఈ ఆరోపణలకు అనుబంధంగా ఎలాంటి ధృవీకరణ లేదా ఆధారాలను మాత్రం ప్రభుత్వం బయటపెట్టలేదు.

వివరాలు 

వాట్సాప్‌ స్పందన: తప్పుడు ఆరోపణలపై ఖండన 

ఇరాన్‌ ఆరోపణలపై వాట్సాప్‌ స్పందించింది. ''భవిష్యత్తులో మా సేవలను ఆదేశంలో నిలిపివేయడానికి ఇది ఒక సాకు మాత్రమే. మా యాప్‌ వినియోగదారుల స్థాన సమాచారం (లొకేషన్‌)ను మేము ట్రాక్‌ చేయము.అలాగే వారి కార్యకలాపాలకు సంబంధించిన లాగ్‌ డేటాను కూడా నిల్వ చేయము. వ్యక్తిగత సందేశాల గోప్యతను కాపాడడంలో మేము కట్టుబడి ఉన్నాము.అలాగే మేము ఏ దేశ ప్రభుత్వంతోనూ పెద్దఎత్తున సమాచారాన్ని పంచుకునే పని జరగదు'' అంటూ వాట్సాప్‌ ప్రకటించింది. వాట్సాప్‌ను మెటా సంస్థ నిర్వహిస్తోంది. ఇదే సంస్థ ఇన్‌స్టాగ్రామ్‌,ఫేస్‌బుక్‌ యాప్స్‌ యజమాని కూడా. ఇరాన్‌ గతంలోనూ పలు సోషల్‌ మీడియా ప్లాట్‌ఫారాలపై నిషేధం విధించింది. 2022లో ఇరాన్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు ముదిరిన సమయంలో గూగుల్‌ ప్లే,వాట్సాప్‌ వంటి ప్లాట్‌ఫారాలను కూడా నిరోధించింది.

వివరాలు 

ఇజ్రాయెల్‌ ట్రాకింగ్‌ వల్ల కీలక వ్యక్తుల హత్యలు 

అయితే,వాస్తవంగా ప్రజలెందరో వీపీఎన్‌ల ద్వారా ఈ సేవలను వినియోగిస్తూ వచ్చారు. ఏడాదిక్రితమే ఈ నిషేధాలను ఎత్తివేసింది. ప్రస్తుతం ఇరాన్‌లో వాట్సాప్‌తో పాటు ఇన్‌స్టాగ్రామ్‌, టెలిగ్రామ్‌ వంటి యాప్స్‌ ప్రజల మధ్య విస్తృతంగా ఉపయోగంలో ఉన్నాయి. ఇజ్రాయెల్‌ తన లక్ష్యంగా పెట్టుకున్న ఇరానీయ సైనికాధికారులు,అణు శాస్త్రవేత్తలపై దాడులు చేయడానికి వారి మొబైల్‌ ఫోన్లను ట్రాక్‌ చేస్తోందని 'ఇరాన్‌ ఇంటర్నేషనల్‌' అనే మీడియా సంస్థ తెలిపింది. టెహ్రాన్‌లో ఇస్మాయిలీ హనియే అనే వ్యక్తిని కూడా ఇలాగే చంపినట్లు గతంలోనూ ఆరోపణలు వచ్చాయి. కొన్ని ప్రాంతాల్లో మొబైల్‌ ఫోన్లు స్విచ్‌ఆఫ్‌ చేసినా కూడా వాటి లొకేషన్‌లు బయటపడుతున్నాయని వెల్లడించింది. ఈ నేపథ్యంలో, ఇజ్రాయెల్‌ నిఘాను తప్పించుకునేందుకు యూజర్లు యాంటీ-ట్రాకింగ్‌ ఫోన్లను వాడాలని హెచ్చరికలు జారీ అయ్యాయి .

వివరాలు 

ఇజ్రాయెల్‌ దాడుల్లో ఖమేనీ సలహాదారు మృతి 

ఇరాన్‌ రాజధాని టెహ్రాన్‌పై ఇజ్రాయెల్‌ ఇటీవల జరిపిన దాడుల్లో, అత్యంత సీనియర్‌ సైనికాధికారి అయిన అలీ షాద్మానీ మరణించినట్లు ఇజ్రాయెల్‌ దళాలు ప్రకటించాయి. అతను ఇరాన్‌ సుప్రీం లీడర్‌ అయతొల్లా అలీ ఖమేనీకి అత్యంత సమీప సలహాదారు. గతంలో ఇజ్రాయెల్‌ దాడిలో మరణించిన మరో సీనియర్‌ అధికారి అలీ రషీద్‌ స్థానంలో షాద్మానీకి కీలక బాధ్యతలు అప్పగించారు. యుద్ధ సమయంలో అతను సైనిక దళాలకు నాయకత్వం వహిస్తూ ఉండగా, అతని రహస్య స్థావరాన్ని గుర్తించి ఇజ్రాయెల్‌ దాడి చేసినట్లు వెల్లడించబడింది.