Strait of Hormuz: మళ్లీ హోర్ముజ్ జలసంధిని మూసేసిన ఇరాన్.. అమెరికాతో అణు చర్చలకు బ్రేక్!
ఈ వార్తాకథనం ఏంటి
మధ్యప్రాచ్యంలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అమెరికాతో అణు చర్చలు జరగాల్సిన వేళ, ఇరాన్ కీలక నిర్ణయం తీసుకుంది. హోర్ముజ్ జలసంధిని (Strait of Hormuz) మళ్లీ మూసివేస్తున్నట్లు శుక్రవారం ప్రకటించింది. స్విట్జర్లాండ్‌లో జరగాల్సిన అణు చర్చలకు హాజరయ్యే బదులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) సముద్ర రేడియో ఛానెళ్ల ద్వారా విడుదల చేసిన ప్రకటనలో, అమెరికా-ఇరాన్ మధ్య ఇటీవల కుదిరిన అవగాహన ఒప్పందం (MOU)ను అమెరికా ఉల్లంఘించిందని ఆరోపించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్ బుధవారం ఈ ఒప్పందంపై సంతకాలు చేసిన సంగతి తెలిసిందే.
వివరాలు
ఈ షరతులు నెరవేరే వరకు హోర్ముజ్ జలసంధి మూసే ఉంటుంది
ఈ ఒప్పందంలోని ప్రధాన షరతుల్లో ఇజ్రాయెల్ దళాలు లెబనాన్ నుంచి పూర్తిగా వైదొలగడం, ఇరాన్‌పై విధించిన సముద్ర దిగ్బంధాన్ని పూర్తిగా ఎత్తివేయడం, అలాగే అమెరికా సైనిక బలగాలు పర్షియన్ గల్ఫ్‌తో పాటు ప్రాంతం నుంచి వెనక్కి వెళ్లడం కూడా ఉన్నాయని IRGC పేర్కొంది. ఈ షరతులు నెరవేరే వరకు హోర్ముజ్ జలసంధి మూసే ఉంటుందని స్పష్టం చేసింది. అంతేకాకుండా, భద్రతా కారణాల దృష్ట్యా ఏ నౌక కూడా హోర్ముజ్ జలసంధి వైపు రావద్దని హెచ్చరించింది. ఈ ఆదేశాలను ఉల్లంఘించే నౌకలను లక్ష్యంగా చేసుకుంటామని గట్టి హెచ్చరిక జారీ చేసింది. ఇదిలా ఉండగా, ఇరాన్ నౌకాశ్రయాలపై రెండు నెలలుగా కొనసాగుతున్న దిగ్బంధాన్ని అధికారికంగా ఎత్తివేసినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ గురువారం ప్రకటించింది.
వివరాలు
అమెరికా-ఇరాన్ తొలి విడత అణు చర్చలు రద్దు
అయితే, అది పూర్తిస్థాయిలో అమలు కాలేదని ఇరాన్ వాదిస్తోంది. ఈ విషయంలో రెండు దేశాల మధ్య భిన్నాభిప్రాయాలు కొనసాగుతున్నాయి. ఇరాన్ ప్రకటన వెలువడటానికి కొద్ది గంటల ముందే అమెరికా-ఇరాన్ తొలి విడత అణు చర్చలు రద్దయ్యాయి. ఈ చర్చలు శుక్రవారం జరగాల్సి ఉండగా, వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. అయితే, ఇందుకు గల కారణాలను అమెరికా ఇప్పటివరకు వెల్లడించలేదు. మరోవైపు, ఇరాన్‌లోని కఠినవాద వర్గాలు ఇజ్రాయెల్ దళాలు దక్షిణ లెబనాన్ నుంచి పూర్తిగా వెళ్లిపోయే వరకు అమెరికాతో ఒప్పంద ప్రక్రియలో ముందుకు వెళ్లొద్దని ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. దీంతో మధ్యప్రాచ్య పరిణామాలు మరింత ఉత్కంఠగా మారాయి.