ISRAEL: గాజాపై ఇజ్రాయెల్ దాడులను తక్షణం ఆపాలని మోదీని కోరిన ఇరాన్ అధ్యక్షుడు
ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ సోమవారం ప్రధాని నరేంద్ర మోదీతో ఫోన్లో మాట్లాడారు. ఈ మేరకు ఇజ్రాయెల్ దాడులకు ఫుల్ స్టాప్ పెట్టేందుకు శక్తిసామర్థ్యాలతో కృషి చేయాలని కోరారు. ఐడీఎఫ్ తక్షణ కాల్పుల విరమణ కోసం ప్రపంచ దేశాల ఉమ్మడి ప్రయత్నానికి రాజధాని టెహ్రాన్ మద్దతుగా ఉంటుందని ఇరాన్ అధ్యక్షుడు అన్నారు. గాజాలో ఇజ్రాయెల్ చర్యలను ముగించేందుకు భారతదేశం తన శక్తి సామర్థ్యాలను ఉపయోగించాలని ఆయన కోరారు. ఇరు దేశనేతల మధ్య ఈ మేరకు చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. పాశ్చాత్య వలసవాదానికి వ్యతిరేకంగా భారతదేశం గత పోరాటాలను,నాన్-అలైన్డ్ ఉద్యమ వ్యవస్థాపకుల్లో ఒకరిగా భారత్ ను ఆయన గుర్తు చేసుకున్నారు. గాజా ప్రజలపై హింసను ఆపేందుకు భారత్ కలిసివస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
పాలస్తీనా ప్రజలకు ేమద్ధతునివ్వాలి : ఇరాన్
ఇజ్రాయెల్ దేశం చేస్తున్న యుద్ధాన్ని తక్షణం ఆపడం, గాజాపై దిగ్బంధనాన్ని ఎత్తివేయడం, అణగారిన ప్రజలకు సహాయాన్ని అందించడం కోసం చేసే ప్రపంచ ఉమ్మడి ప్రయత్నానికి టెహ్రాన్ మద్దతుగా నిలుస్తుందని ఇరాన్ అధ్యక్షుడు పేర్కొన్నారు. పాలస్తీనా ప్రజలను చంపడం ప్రపంచంలోని అన్ని స్వేచ్ఛా దేశాలకు కోపం తెప్పించిందని ఇబ్రహీం రైసీ అన్నారు. అమాయక మహిళలు, పిల్లలను చంపడం, ఆస్పత్రులు, పాఠశాలలు, మసీదులు, చర్చిలతో పాటు నివాస ప్రాంతాలపై దాడులు ఏ మానవుడి దృక్కోణం నుంచైనా ఖండించదగినవేనన్నారు. హింస ఆమోదయోగ్యం కానివని అభిప్రాయం వ్యక్తం చేశారు. పాలస్తీనాను ఆక్రమించుకుంటున్న జియోనిస్ట్ పాలనను ఎదుర్కోనేందుకు బాధిత దేశానికి చట్టబద్ధమైన హక్కు ఉందన్నారు. అణచివేత నుంచి విముక్తి కోసం పాలస్తీనా పోరాటానికి అన్ని దేశాలు మద్దతివ్వాలని రైసీ కోరారు.