Page Loader
Iran: ట్రంప్  సన్నిహితుల ఈమెయిల్స్‌ను లీక్ చేస్తాం..ఇరాన్‌ హ్యాకర్ల బెదిరింపులు 
ట్రంప్ సన్నిహితుల ఈమెయిల్స్‌ను లీక్ చేస్తాం..ఇరాన్‌ హ్యాకర్ల బెదిరింపులు

Iran: ట్రంప్  సన్నిహితుల ఈమెయిల్స్‌ను లీక్ చేస్తాం..ఇరాన్‌ హ్యాకర్ల బెదిరింపులు 

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 01, 2025
10:32 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు సన్నిహితుల మెయిల్స్‌ను హ్యాక్ చేసిన ఇరాన్‌కు చెందిన హ్యాకర్లు,వాటిని బయటపెడతామంటూ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ' రాబర్ట్‌' అనే మారు పేరు తో మీడియా సంస్థతో వారు చాట్ చేసిన సమయంలో ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయని పలు అంతర్జాతీయ మీడియా సంస్థలు నివేదిస్తున్నాయి. వైట్ హౌస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ సూసీ వైల్స్,ట్రంప్ న్యాయవాది లిండ్సే హాలిగన్,ట్రంప్ సలహాదారు రోజర్ స్టోన్ తదితర ప్రముఖుల ఈమెయిల్స్‌ను వారు హ్యాక్ చేశామని ప్రకటించారు. తమ వద్ద దాదాపు 100 గిగాబైట్ల డేటా ఉందని వెల్లడించారు. ఆ సమాచారాన్ని అమ్మేందుకు,లేకపోతే బహిర్గతం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని 'రాబర్ట్' అనే హ్యాకర్ హెచ్చరించాడు.

వివరాలు 

 బెదిరింపుల నేపథ్యంలో స్పందించిన కాశ్ పటేల్

అయితే, ఈ మేరకు వారు స్పష్టమైన ప్రణాళికలు వెల్లడించలేదు. అలాగే, మెయిల్స్‌లో ఏ సమాచారం ఉందనే దానిపై కూడా వివరాలు ఇవ్వలేదు. ఈ బెదిరింపుల నేపథ్యంలో వైట్ హౌస్,ఎఫ్‌బీఐ డైరెక్టర్ కాశ్ పటేల్ స్పందించారు. జాతీయ భద్రతను ప్రమాదంలో పడేసే ఎవరైనా ఉంటే,వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మరోవైపు, అమెరికా సైబర్ డిఫెన్స్ ఏజెన్సీ(CISA)మాత్రం దీనిపై ఎటువంటి ప్రకటన ఇవ్వలేదు. ఇదే సమయంలో ఐక్యరాజ్య సమితిలోని ఇరాన్ ప్రతినిధి కూడా దీనిపై స్పందించలేదు. ఇక 2024 అధ్యక్ష ఎన్నికల ప్రచారం చివరి దశలో 'రాబర్ట్‌' అనే హ్యాకింగ్ గ్రూపు పేరు వెలుగులోకి వచ్చింది. అప్పటికే ట్రంప్‌కు అత్యంత సన్నిహితుల మెయిల్స్‌ను వారు హ్యాక్ చేసి, వాటిలో కొన్నింటిని బహిర్గతం చేశారు.

వివరాలు 

ఇరాన్,ఇజ్రాయెల్ మధ్య 12రోజుల యుద్ధం

ఈహ్యాకింగ్ ఆపరేషన్‌ను ఇరాన్‌కు చెందిన రివల్యూషనరీ గార్డ్స్ నిర్వహిస్తున్నారని అమెరికా న్యాయశాఖ అప్పట్లో ఆరోపించింది. అయితే, ట్రంప్ మళ్లీ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత తాము ఇకపై ఎలాంటి సమాచారం లీక్ చేయబోమని ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాబర్ట్ తెలిపారు. కాగా,ఇటీవల ఇరాన్,ఇజ్రాయెల్ మధ్య 12రోజుల యుద్ధం జరిగిన విషయం తెలిసిందే. ఆ యుద్ధ సమయంలో టెహ్రాన్‌కు చెందిన మూడు అణుశక్తి కేంద్రాలపై అమెరికా ప్రత్యక్షంగా దాడులు జరిపినట్టు తెలిసింది. ఈ పరిణామాల మధ్య 'రాబర్ట్‌'హ్యాకింగ్ ఆపరేషన్ మళ్లీ ప్రారంభమైందని అంచనాలు వెలువడుతున్నాయి. తాజాగా, వారు హ్యాక్ చేసిన మెయిల్స్‌ను అమ్మకానికి పెట్టినట్టు ఒక అంతర్జాతీయ వార్తా సంస్థకు తెలియజేశారు. వాటిని త్వరలో బహిర్గతం చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు కూడా పేర్కొన్నారు.