Page Loader
Iran X Israel: ఇరాన్‌ X ఇజ్రాయెల్‌.. ఇరు దేశాల సైనిక బలాబలాలివీ..
ఇరాన్‌ X ఇజ్రాయెల్‌.. ఇరు దేశాల సైనిక బలాబలాలివీ..

Iran X Israel: ఇరాన్‌ X ఇజ్రాయెల్‌.. ఇరు దేశాల సైనిక బలాబలాలివీ..

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 14, 2025
11:33 am

ఈ వార్తాకథనం ఏంటి

ఇరాన్‌పై 'ఆపరేషన్‌ రైజింగ్‌ లయన్‌' పేరుతో ఇజ్రాయెల్‌ చేసిన దాడితో మధ్యప్రాచ్యంలో మరోసారి ఉద్రిక్తతలు భగ్గుమన్నాయి. ఈ పరిణామాలు ఎంతకాలం కొనసాగుతాయన్నది ఉత్కంఠను కలిగిస్తోంది.ఈ నేపథ్యంలో ఇరాన్‌, ఇజ్రాయెల్‌ శక్తివంతతను వివిధ కోణాల్లో పరిశీలిస్తే... సైనిక సామర్థ్యం -ఇరాన్‌ ఇరాన్‌, ఇజ్రాయెల్‌ రెండూ సైనికంగా బలమైన దేశాలుగా గుర్తించబడుతున్నప్పటికీ,1979 నుంచి ఈ దేశంపై విదేశీ ఆంక్షలు అమలులో ఉండటంతో,అక్కడ ఉపయోగిస్తున్న సంప్రదాయ ఆయుధాలు చాలావరకు పాతవే. 1979లో జరిగిన ఇస్లామిక్‌ విప్లవానికి ముందు అమెరికా,సోవియట్‌ యూనియన్‌ అందించిన ఆయుధాలు ఇంకా వాడుకుంటున్నారు.అలాగే ఇటీవల రష్యా నుంచి పొందిన ఆయుధాలు కూడా ఉపయోగిస్తున్నారు.ఇరాన్‌ వైమానిక దళంలో దాదాపు 350 పాత తరహా యుద్ధవిమానాలున్నాయి.మరోవైపు,సాయుధ డ్రోన్ల తయారీ రంగంలో ఇరాన్‌ ప్రముఖ దేశంగా ఎదిగింది.

వివరాలు 

సైనిక సామర్థ్యం -ఇజ్రాయెల్‌ 

ఇజ్రాయెల్‌ అత్యాధునిక ఆయుధ సాంకేతికతను కలిగిన దేశం. 2024 అక్టోబర్‌లో ఇరాన్‌ చేపట్టిన పెద్దమొత్తంలో క్షిపణి దాడికి... ఇజ్రాయెల్‌ చాలా తక్కువ స్థాయిలో మాత్రమే నష్టం చవిచూసింది. ఇందుకు కారణం... అమెరికా సహకారంతో రూపొందించిన బహుళ-అంచెల క్షిపణి నిరోధక వ్యవస్థ. ఈ సాంకేతికత ప్రజావాసాలు లేదా కీలక మిలిటరీ స్థావరాలపై దాడికి వచ్చే క్షిపణులను ముందుగానే గుర్తించి, గాల్లోనే పేల్చగలుగుతుంది. ఇది 100 శాతం రక్షణను కల్పించకపోయినా, తీవ్రమైన నష్టాలను తప్పించిందని ఇజ్రాయెల్‌ చెబుతోంది.

వివరాలు 

సైనిక బలగాల పరంగా ఇరాన్‌ 

ఇరాన్‌కు సుమారు 8.8 కోట్ల జనాభా, 1.6 మిలియన్‌ చ.కి.మీ. విస్తీర్ణం ఉన్న భూభాగం ఉంది. ఇలాంటి పెద్ద దేశానికి తగినట్లుగానే భారీ సైనిక బలగాలు ఉన్నాయి. అయితే ఇటీవల అమెరికా, ఇజ్రాయెల్‌ చర్యల కారణంగా, ఇరాన్‌కు అనుబంధంగా ఉన్న సైనిక సంస్థలు బలహీనపడ్డాయని తెలుస్తోంది. ఇరాన్‌ సైన్యం ప్రధానంగా రెండు విభాగాలుగా ఉంటుంది: సాధారణ సైన్యం: దేశ సరిహద్దుల సంరక్షణ కోసం పనిచేస్తూ, యుద్ధ సమయంలోనే యాక్టివ్‌గా రంగంలోకి దిగుతుంది. సుమారు 6 లక్షల మంది ఇందులో ఉంటారు. రివల్యూషనరీ గార్డ్స్‌: ప్రత్యేక వ్యూహాలకు అనుగుణంగా పనిచేసే ఈ విభాగంలో దాదాపు 2 లక్షల మంది ఉంటారు.

వివరాలు 

సైనిక బలగాల పరంగా ఇజ్రాయెల్‌ 

ఇజ్రాయెల్‌కు ఉన్న జనాభా (90 లక్షల వరకు), భూభాగ పరిమితి (22,000 చ.కి.మీ.) కొద్దిగా చిన్నదైనా, సైనికంగా దేశం బలంగా ఉంది. దేశీయంగా తయారైన ఆధునిక ఆయుధాలు, అలాగే అమెరికా, ఐరోపా దేశాల నుంచి అందిన సాంకేతిక మద్దతు కారణంగా ఇది పటిష్టమైన సైనిక శక్తిగా నిలుస్తోంది. ఇజ్రాయెల్‌ వద్ద సుమారు 1.7 లక్షల యాక్టివ్‌ సైనికులు, మరో 4 లక్షల మంది రిజర్వ్‌ బలగాలు ఉన్నాయి.

వివరాలు 

అణ్వాయుధాల విషయంలో ఇరాన్‌ 

ఇరాన్‌ గత కొన్నేళ్లుగా అణ్వాయుధాల తయారీ లక్ష్యంగా కార్యకలాపాలు సాగిస్తోంది. నిపుణుల అంచనాల ప్రకారం, ఒకటి కాదు, పలు అణ్వాయుధాలు తయారు చేయగలిగే స్థాయిలో యురేనియాన్ని ఇప్పటికే సంపాదించినట్టు తెలుస్తోంది. అయితే పూర్తిస్థాయిలో ఆయుధాలు రూపొందించడానికి ఇంకా కొంత సమయం పట్టే అవకాశం ఉంది. ఈ గ్యాప్‌లోనే ఇరాన్‌ను అణచివేయాలని అమెరికా భావిస్తోంది. అందుకే, ఇరాన్‌పై ఒత్తిడి తెచ్చే క్రమంలో అణ్వాయుధ కార్యక్రమాలపై ఒప్పందానికి రావాలని అప్పటి అధ్యక్షుడు ట్రంప్‌ ప్రయత్నించారు.

వివరాలు 

అణ్వాయుధాల విషయంలో ఇజ్రాయెల్‌

ఇజ్రాయెల్‌కు అణ్వాయుధాలు ఉండొచ్చనే అనుమానాలు చాలాకాలంగా వినిపిస్తున్నాయి. మధ్యప్రాచ్యంలో అస్త్రశక్తిని కలిగిన ఏకైక దేశంగా ఈ దేశం ఉండవచ్చని విశ్లేషకుల అభిప్రాయం. అయితే ఇజ్రాయెల్‌ అధికారికంగా ఎప్పుడూ తన వద్ద అణ్వస్త్రాలు ఉన్నాయని వెల్లడించలేదు.