
Israel-Syria: సిరియా సైనిక ప్రధాన కార్యాలయంపై ఇజ్రాయెల్ దాడి.. సాయుధ ఘర్షణలో 250 మంది మృతి
ఈ వార్తాకథనం ఏంటి
సిరియాలోని స్వైదా ప్రావిన్స్‌లో రెండు తెగల మధ్య కొనసాగుతున్న సాయుధ ఘర్షణలతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ నేపథ్యంలో, సిరియా రాజధాని డమాస్కస్‌లోని సైనిక ప్రధాన కార్యాలయంపై బుధవారం రాత్రి ఇజ్రాయెల్ సైన్యం వైమానిక దాడిని నిర్వహించింది. ఈ దాడి సిరియా రక్షణ మంత్రిత్వ శాఖ సమీపంలోని సైనిక ప్రధాన కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకుని జరిగింది. దాడిలో సైనిక కార్యాలయానికి చెందిన ప్రధాన ద్వారం పూర్తిగా ధ్వంసమైంది.ఈ దాడిని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడీఎఫ్) ధృవీకరించింది. ద్రూజ్ పౌరులపై సిరియా ప్రభుత్వం చేపడుతున్న దురాగతాలకు ప్రతీకార చర్యగా ఈ దాడిని నిర్వహించినట్టు వెల్లడించింది. "రాజకీయ స్థాయి ఆదేశాల మేరకు చర్యలు కొనసాగుతున్నాయి. అవసరమైన అన్ని అవకాశాలను పరిశీలిస్తున్నాం" అని ఐడీఎఫ్ స్పష్టం చేసింది.
వివరాలు
స్వైదా ప్రావిన్స్‌లో ఉద్రిక్త పరిస్థితులు
స్వైదా ప్రావిన్స్‌లో సిరియా ప్రభుత్వ బలగాలు, స్థానిక ద్రూజ్ మిలీషియా మధ్య ఘర్షణలు ఉధృతంగా కొనసాగుతున్నాయి. తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం రద్దైన తర్వాత ఈ ఘర్షణలు మరింత హింసాత్మకంగా మారాయి. ముఖ్యంగా ద్రూజ్ వర్గంపై దాడులు పెరిగాయి. ఇప్పటి వరకు జరిగిన ఈ దాడుల్లో దాదాపు 250 మంది ప్రాణాలు కోల్పోగా, వందలాది మంది గాయపడ్డారు. ఈ నేపథ్యంలో ద్రూజ్ ప్రజలను రక్షించేందుకు చర్యలు చేపట్టుతున్నట్టు ఇజ్రాయెల్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఇదే సమయంలో సరిహద్దులకు దగ్గరగా ఇస్లామిక్ మిలీషియా గ్రూపుల కార్యకలాపాలు మళ్లీ చురుగ్గా సాగుతుండటంతో ఇజ్రాయెల్ మరింత అప్రమత్తమైంది.
వివరాలు
అంతర్యుద్ధం ముగిసిన తర్వాత పరిస్థితి
సిరియాలో గత రెండు దశాబ్దాలుగా కొనసాగిన అంతర్యుద్ధం 2024 డిసెంబర్‌లో ముగిసింది. అప్పటి అధ్యక్షుడు బషర్ అల్ అసద్ పదవి నుండి దిగిపోవడంతో అంతర్యుద్ధానికి తెరపడింది. ప్రస్తుతం సున్నీ మతాన్ని అనుసరించే ఆధిక్య ప్రభుత్వం సిరియాలో అధికారంలో ఉంది. అయినప్పటికీ మైనారిటీ వర్గాలు, బషర్ అనుచరులు కొత్త ప్రభుత్వానికి నిరంతర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ద్రూజ్ సమూహం తిరిగి తెరపైకి వచ్చింది.
వివరాలు
ఇజ్రాయెల్ హెచ్చరికలు
ఇటీవల ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ మాట్లాడుతూ.. సిరియా సైనిక బలగాలు వెనక్కు తగ్గే వరకు తమ వైమానిక దాడులు కొనసాగుతాయని స్పష్టం చేశారు. ఉత్తర సరిహద్దుల్లో పరిస్థితిని స్థిరీకరించాల్సిన అవసరం ఉందని, ద్రూజ్ వర్గాన్ని రక్షించేందుకు తమ దేశం కట్టుబడి ఉందని ప్రధాని బెంజమిన్ నెతన్యాహు పునరుద్ఘాటించారు. సిరియాలో బషర్ అసద్ పదవీ కాలంలో తిరుగుబాటుదారులపై అతడిచేసిన చిత్రహింసలు, దురాగతాలు ఆయన పదవి వీడి వెళ్లిన తర్వాత వెలుగులోకి వచ్చాయి. అసద్ తన పెంపుడు సింహానికి ఖైదీలను ఆహారంగా పెట్టిన దారుణ ఘటనలు బయటపడ్డాయి.
వివరాలు
ద్రూజ్ సమాజం ఎవరు?
సిరియా, లెబనాన్, ఇజ్రాయెల్ దేశాల్లో విస్తరించిన ప్రత్యేక మత సామాజిక వర్గమే ద్రూజ్. ప్రస్తుతం సిరియాలో ఈ సముదాయం రెండు వర్గాలుగా చీలిపోయింది. ఒక వర్గం కొత్త ప్రభుత్వం పాలనలో ఏకీకృతమయ్యేందుకు సిద్ధంగా ఉండగా, మరొక వర్గం స్వయంపాలన కోరుతోంది. స్వైదాలో సిరియా సైన్యం, స్థానిక మిలీషియా మధ్య కొనసాగుతున్న ఘర్షణలపై అంతర్జాతీయ సమాజం ఆందోళన వ్యక్తం చేసింది. యూకే కేంద్రంగా పనిచేస్తున్న సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్ సంస్థ ప్రకారం.. ఇప్పటి వరకు 250 మంది ప్రాణాలు కోల్పోయారని, అందులో 21 మందిని కాల్చిచంపినట్టు ఆరోపణలు వెలువడ్డాయి.