Flydubai flight : పైలట్ల మధ్య గొడవ.. ఇజ్రాయెల్ వెళ్లాల్సిన విమానం సౌదీకి మళ్లింపు
ఈ వార్తాకథనం ఏంటి
విమానంలో పైలట్, కోపైలట్ మధ్య గొడవ జరగడంతో దుబాయ్ నుంచి టెల్ అవీవ్‌కు వెళ్తున్న ఓ విమానాన్ని అనూహ్యంగా దారి మళ్లించారు. స్థానిక మీడియాకు ఇజ్రాయెల్ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఫ్లైదుబాయ్‌కు చెందిన ఈ విమానం బుధవారం తెల్లవారుజామున యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయలుదేరింది. ప్రయాణం మొదలైన సుమారు రెండు గంటల తర్వాత విమానం నుంచి అత్యవసర సంకేతం వెలువడినట్లు విమానాల కదలికలను ట్రాక్ చేసే ఫ్లైట్‌రాడార్24 వెబ్‌సైట్ తెలిపింది. కొన్ని నిమిషాల తర్వాత హైజాక్‌ను సూచించే సంకేతాన్ని పంపినట్లు పేర్కొంది. అయితే కొద్దిసేపటికే మళ్లీ సాధారణ అత్యవసర సంకేతానికి మారినట్లు వెల్లడించింది.
వివరాలు
విమానాన్ని ఎవరూ హైజాక్ చేయలేదు: ఇజ్రాయెల్ ప్రధానమంత్రి కార్యాలయం
అయితే విమానాన్ని ఎవరూ హైజాక్ చేయలేదని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి కార్యాలయం స్పష్టం చేసింది.
విమానంలోని పైలట్, కోపైలట్ మధ్య జరిగిన ఘర్షణ కారణంగానే ఈ అత్యవసర సంకేతం పంపినట్లు ఇజ్రాయెల్ రక్షణ శాఖ వర్గాలను ఉటంకిస్తూ స్థానిక మీడియా తెలిపింది.
ఈ విమానంలో సుమారు 150 మంది ప్రయాణికులు ఉన్నారు. వారిలో ఎక్కువ మంది ఇజ్రాయెల్ పౌరులేనని సమాచారం.
టెల్ అవీవ్‌లోని బెన్ గురియన్ విమానాశ్రయంలో దిగాల్సిన విమానం.. పరిస్థితుల కారణంగా ఇజ్రాయెల్‌కు చేరకుండా ఈశాన్య సౌదీ అరేబియాలోని టబుక్ విమానాశ్రయంలో ల్యాండ్ అయింది.
వివరాలు
రంగంలోకి యుద్ధ విమానాలు
విమానంలో చోటుచేసుకున్న పరిణామాలపై స్పందించిన ఇజ్రాయెల్ వైమానిక దళం వెంటనే యుద్ధ విమానాలను రంగంలోకి దించింది.
ఈ ఘటనపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అత్యవసరంగా అధికారులతో సంప్రదింపులు జరిపారు.
హైజాక్ సంకేతం వెలువడటంతో తొలుత తీవ్ర ఆందోళన నెలకొన్నప్పటికీ.. ఆ తర్వాత అది హైజాకింగ్ ఘటన కాదని అధికారులు స్పష్టం చేశారు.
విమానాన్ని దారి మళ్లించడానికి దారితీసిన పైలట్ల మధ్య ఘర్షణపై మరిన్ని వివరాలు ఇంకా వెలుగులోకి రావాల్సి ఉంది.