Israel-Hezbollah: బీరుట్‌లోని ఆసుపత్రి కిందహెజ్బొల్లా బంకర్.. లాకర్‌లో 500 మిలియన్ డాలర్లు నగదు, బంగారం..!
ఇజ్రాయెల్ సోమవారం కీలక ప్రకటన చేసింది. లెబనాన్ రాజధాని బీరుట్‌లోని ఓ ఆసుపత్రి కింద హెజ్బొల్లా ఆర్ధిక కేంద్రం ఉందని తమ నిఘా వర్గాలు గుర్తించాయని తెలిపింది. ఆ బంకర్‌లో సీక్రెట్ లాకర్‌లో భారీగా బంగారం, కోట్లాది రూపాయల నగదు ఉన్నట్లు వివరించింది. ఈ మొత్తాన్ని హెజ్బొల్లా తన కార్యకలాపాలకు ఉపయోగిస్తోందని ఇజ్రాయేల్ డిఫెన్స్ ఫోర్స్ (IDF) ఆరోపించింది. లెబనాన్‌లోని హెజ్బొల్లా మిలీషియాపై ఆదివారం రాత్రి నుంచి భీకర వైమానిక దాడులు జరుగుతుండగా, ఈ సీక్రెట్ లాకర్ గురించి సమాచారం బయటపడటం గమనార్హం.
ఇంటెలిజెన్స్ వర్గాలు గుర్తించాయని ఇజ్రాయేల్ ప్రకటన
IDF అధికార ప్రతినిధి రేర్ అడ్మిరల్ డానియల్ హగరీ సోమవారం మాట్లాడుతూ, హెజ్బొల్లా ఆర్ధిక వనరుల గురించి వివరాలు వెల్లడించారు. "ఈ రాత్రి మేము దాడి చేయని స్థలంలో నిఘా వర్గాలు సేకరించిన సమాచారం వెలుగులోకి వచ్చింది. హెజ్బొల్లా చీఫ్ హసన్ నస్రల్లా బంకర్‌లో మిలియన్ల డాలర్ల నగదు, బంగారం దాచిపెట్టాడు. ఈ బంకర్ బీరుట్ నడిబొడ్డున ఉన్న అల్-సహెల్ హాస్పిటల్ కింద ఉంది" అని తెలిపారు. ఆ ప్రాంతంపై ఇంకా దాడి చేయలేదని, అది హెజ్బొల్లాకు ప్రధాన ఆర్థిక వనరుల కేంద్రం అని ఆయన పేర్కొన్నారు.
ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ చేసిన ట్వీట్
హెజ్బొల్లా స్థావరాలపై వైమానిక దాడులు
అంతేకాక, బంకర్‌లో కనీసం 500 మిలియన్ డాలర్ల నగదు,బంగారం ఉందని అంచనా వేస్తున్నామని, ఇది లెబనాన్ పునర్నిర్మాణానికి ఉపయోగపడవచ్చని అన్నారు. ఆదివారం రాత్రి ఇజ్రాయెల్ కనీసం 30 హెజ్బొల్లా స్థావరాలపై వైమానిక దాడులు నిర్వహించింది. వీటిలో హెజ్బొల్లాకు ఆర్థిక సహకారం అందిస్తోన్న అల్ ఖర్డ్ అల్-హసన్(AQAH)ఆర్థిక సంస్థ కూడా ఉందని, ఇది వ్యాపారం ముసుగులో హెజ్బొల్లాకు ఆర్థిక వనరులను సమకూరుస్తోందని ఆరోపణలు వచ్చాయి. హగారి ప్రకారం,హెజ్బొల్లా నిధుల మూలాల్లో ఒకటైన పదిలక్షల డాలర్ల బంగారం,నగదుతో కూడిన లాకర్ హగారి మాట్లాడుతూ కీలక లక్ష్యంగా ఉంది అని తెలిపారు. ఈ లాకర్‌ను ధ్వంసం చేశారా అనే విషయాన్ని ఆయన మాత్రం స్పష్టం చేయలేదు,కానీ మరిన్ని దాడులు జరగవచ్చని,ముఖ్యంగా ఆర్థిక కేంద్రాలను లక్ష్యంగా చేసుకుంటామని అన్నారు.