Israel-Hamas War: ఆరుగురు బందీలను 'తల వెనుక' నుండి హమాస్ కాల్చి చంపారు: బెంజమిన్ నెతన్యాహూ
హమాస్ గాజాలో బందీగా ఉన్న ఆరుగురు ఇజ్రాయిలీలను కాల్చి చంపడం యుద్ధంలో కీలక పరిణామంగా మారింది. రఫా ప్రాంతంలోని భూగర్భ సొరంగాల్లో వారి మృతదేహాలను ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడీఎఫ్) కనుగొన్నాయి. ఈ ఘటనకు సంబంధించిన ఆగ్రహంతో ఇజ్రాయిల్‌లో భారీ నిరసనలు చెలరేగాయి. ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహుకు వ్యతిరేకంగా వేలాదిమంది టెల్ అవీవ్‌లో ఆందోళనలు చేశారు. ప్రభుత్వం బందీల విడుదల ఒప్పందం సాధించడంలో విఫలమైందని ప్రజలు అసహనం వ్యక్తం చేశారు. ప్రధాని నెతన్యాహూ మాట్లాడుతూ, హమాస్ ఆ బందీలను అత్యంత సమీపం నుండి కాల్చి చంపిందని వెల్లడించారు.
ఇజ్రాయిల్‌పై నిర్వహించిన దాడిలో 1200 మంది మృతి
ఇజ్రాయిల్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ కూడా బందీలు దారుణంగా హత్య చేయబడ్డారని నిర్ధారించింది. దీనిపై నెతన్యాహూ ప్రజలకు క్షమాపణలు చెబుతూ ఐక్యత కోసం పిలుపునిచ్చారు. 2023 అక్టోబర్ 7న హమాస్ ఇజ్రాయిల్‌పై నిర్వహించిన దాడిలో 1200 మంది చనిపోగా, 240 మందికి పైగా బందీలుగా పట్టుకుని గాజాలోకి తీసుకెళ్లింది. కాల్పుల విరమణ ఒప్పందం తరువాత, హమాస్ 100 మందిని విడుదల చేయగా, ఇజ్రాయిల్ పలువురు పాలస్తీనియన్లను జైళ్ల నుంచి విడుదల చేసింది. ఇదిలా ఉంటే , హమాస్‌తో ఒప్పందం కుదుర్చుకోవడానికి ప్రయత్నిస్తున్న నెతన్యాహూ పై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. హమాస్ చంపిన ఆరుగురు బందీలలో ఒకరు అమెరికన్-ఇజ్రాయిలీ కావడంతో ఈ చర్చలు మరింత తీవ్రతరంగా మారాయి.