Israel Hamas War: ఇజ్రాయెల్ -హమాస్ దాడులు ప్రారంభమై నేటికీ ఏడాది.. ఇంకా కొనసాగుతున్న దాడులు
2023 అక్టోబర్ 7న హమాస్ ఇజ్రాయెల్‌పై ఆకస్మిక దాడులు ప్రారంభించి ఈ రోజుకి ఏడాది పూర్తయింది. హమాస్, ఇజ్రాయెల్ ఆక్రమించిన సెటిల్‌మెంట్ ప్రాంతాలపై భారీ రాకెట్ దాడులు జరపడంతో , దాదాపు 1200 మంది ఇజ్రాయెలీలు, ముఖ్యంగా మహిళలు, చిన్నారులు మరణించారు. ఈ దాడులకు ప్రతిస్పందనగా, ఇజ్రాయెల్ ప్రతీకార చర్యలకు దిగింది. ఈ ఏడాదిలో, పాలస్తీనా భూభాగంలో ఘోర హింసాకాండ జరిగింది, అందులో 41,000 మంది పాలస్తీనీయులు ప్రాణాలు కోల్పోయారు, వారిలో సగానికి పైగా మహిళలు, పిల్లలు ఉన్నారు.
నవంబర్ 15న గాజాలోని అల్-షిఫా ఆసుపత్రిపై దాడి
2023 అక్టోబర్ 7న హమాస్‌పై ప్రతీకారం తీర్చుకుంటానని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రతిజ్ఞ చేశారు. అక్టోబర్ 13, 2023న మొదటి వైమానిక దాడులు ప్రారంభించి, నవంబర్ 15న గాజాలోని అల్-షిఫా ఆసుపత్రిపై దాడి చేశారు. ఫిబ్రవరి 29, 2024న ఇజ్రాయెల్ బలగాలు ఆహారం అందించేందుకు వస్తున్న కాన్వాయ్‌పై కాల్పులు జరిపి 120 మంది పాలస్తీనీయులను హతమార్చాయి. మే 7, 2024న రఫాపై భూదాడి చేశారు. జూలై 2024 నాటికి ఇజ్రాయెల్ సైన్యం హమాస్‌పై ఆధిపత్యం సాధించింది. ఈ సమయంలో హమాస్ సాయుధ విభాగం చీఫ్ మహమ్మద్ దీఫ్, హమాస్ నాయకుడు ఇస్మాయిల్ హనియే, హిజ్బుల్లా కమాండర్ ఫువాద్ షుక్ర్ హతమయ్యారు.
హిజ్బుల్లా లీడర్ హసన్ నస్రల్లా మృతి
సెప్టెంబరు 2024లో ఇజ్రాయెల్-లెబనాన్ మధ్య ఉద్రిక్తతలు ప్రారంభమయ్యాయి. హిజ్బుల్లా సంస్థ పాలస్తీనాకు మద్దతుగా నిలిచింది. సెప్టెంబరు 17, 18న లెబనాన్‌లో వాకీ-టాకీల పేలుళ్లలో 39 మంది మరణించగా, 3,000 మంది గాయపడ్డారు. సెప్టెంబరు చివరి వారంలో ఇజ్రాయెల్, హిజ్బుల్లా చీఫ్ కమాండర్లపై దాడులు జరిపింది. సెప్టెంబరు 27న హిజ్బుల్లా లీడర్ హసన్ నస్రల్లా మరణించడంతో, ఇరాన్ ప్రత్యక్షంగా రంగంలోకి దిగింది. నస్రల్లా మరణానికి ప్రతీకారం తప్పదని ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ హెచ్చరించారు. ఇరాన్ అక్టోబర్ 1న క్షిపణులతో ఇజ్రాయెల్‌పై దాడి చేసి, పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి.