
Hamas-Israel: ఐడీఎఫ్ దాడిలో హమాస్ చీఫ్ మొహమ్మద్ సిన్వర్ హతం! ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ప్రకటన
ఈ వార్తాకథనం ఏంటి
ఇజ్రాయెల్ దళాల దాడుల్లో హమాస్ చీఫ్ మొహమ్మద్ సిన్వర్ మరణించి ఉండవచ్చని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు పేర్కొన్నారు.
గత అయిదు నెలల తర్వాత బుధవారం తొలిసారిగా మీడియాతో మాట్లాడిన నెతన్యాహు, సిన్వర్ మరణించిన అవకాశముందని వెల్లడించారు.
మే నెల ప్రారంభంలో దక్షిణ గాజాలోని ఓ ఆస్పత్రిపై ఇజ్రాయెల్ రక్షణ దళాలు (ఐడీఎఫ్) దాడి చేసిన సంగతి తెలిసిందే.
ఆ దాడిలో మొహమ్మద్ సిన్వార్ హతమైనట్లు సమాచారం.అయితే ఇప్పటివరకు హమాస్ ఆయన మృతిని అధికారికంగా నిర్ధారించలేదు.
గతంలో,2024 అక్టోబర్‌లో యాహ్యా సిన్వార్ హతమయ్యాడు.దాంతో,అతని సోదరుడు మొహమ్మద్ సిన్వార్ గాజాలో హమాస్ నేతగా బాధ్యతలు స్వీకరించాడు.
ప్రస్తుతం అతడూ మృతిచెందినట్లు నెతన్యాహు తెలిపారు. అయితే దీనిపై పూర్తి స్పష్టత రావాల్సి ఉంది.
వివరాలు
10,000మంది ఉగ్రవాదుల నిర్వీర్యం
జెరూసలేం నగరంలో మీడియాతో మాట్లాడిన నెతన్యాహు,ఇప్పటి వరకు దాదాపు 10,000మంది ఉగ్రవాదులను నిర్వీర్యం చేశామని చెప్పారు.
హమాస్ ప్రధాన నేతలైన ఇస్మాయిల్ హనియే,యాహ్యా సిన్వార్ వంటి హంతకులను మట్టుబెట్టినట్లు వెల్లడించారు.
తాజాగా మొహమ్మద్ సిన్వార్ కూడా హతమయ్యాడని తెలిపారు.గాజాపై నియంత్రణ సాధించే వరకు సైనిక చర్యలు కొనసాగుతాయని ఆయన స్పష్టం చేశారు.
సహాయక బృందాలు పంపినప్పటికీ,అందులోని సరుకులు సాధారణ పౌరులకు అందడం లేదన్నారు.
11వారాల తర్వాత గాజాలోకి 100సహాయ ట్రక్కులను అనుమతించినట్లు నెతన్యాహు చెప్పారు.
అమెరికాతో విభేదాలున్నాయన్న వార్తలను ఆయన ఖండించారు.
అలాగే బందీలను తిరిగి రప్పించేందుకు తాత్కాలిక కాల్పుల విరమణకు ఇజ్రాయెల్ సిద్ధంగా ఉందని చెప్పారు.
లేకపోతే,గాజాపై పూర్తి నియంత్రణ కోసం సైనిక చర్యను మరింత ముందుకు తీసుకెళ్తామని నెతన్యాహు హెచ్చరించారు.