Page Loader
Israel-Hezbollah:హెజ్‌బొల్లాల కీలకనేతపై గురి.. డమాస్కస్‌లోని ఇరాన్‌ రాయబార కార్యాలయ సమీపంలో ఇజ్రాయెల్‌ వైమానిక దాడులు 
హెజ్‌బొల్లాల కీలకనేతపై గురి.. డమాస్కస్‌లోని ఇరాన్‌ రాయబార కార్యాలయ సమీపంలో ఇజ్రాయెల్‌ వైమానిక దాడులు

Israel-Hezbollah:హెజ్‌బొల్లాల కీలకనేతపై గురి.. డమాస్కస్‌లోని ఇరాన్‌ రాయబార కార్యాలయ సమీపంలో ఇజ్రాయెల్‌ వైమానిక దాడులు 

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 09, 2024
10:15 am

ఈ వార్తాకథనం ఏంటి

పశ్చిమాసియా ప్రస్తుతం ఇజ్రాయెల్‌-హెజ్‌బొల్లా మధ్య యుద్ధంతో అట్టుడుకుతోంది. హిజ్బుల్లాకు చెందిన ఓ అధికారి లక్ష్యంగా జరిపిన వైమానిక దాడుల్లో ఏడుగురు మరణించారని సమాచారం. ఆయుధాల అక్రమ రవాణాలో ఆఅధికారి కీలకపాత్ర పోషించినట్లు ఇజ్రాయెల్‌ అధికారులు తెలియజేశారు. డమాస్కస్‌లోని మజ్జే ప్రాంతంలో నివాస,వాణిజ్య భవనాలపై ఇజ్రాయెల్‌ మూడు క్షిపణులు ప్రయోగించిందని సిరియా ప్రభుత్వ వార్తా సంస్థ తెలిపింది. ఈ దాడుల్లో ఏడుగురు పౌరులు మరణించారని పేర్కొంది.అయితే ఆ అధికారి మరణించాడో లేదో స్పష్టత లేదు. ఇరాన్‌ పౌరులు ఇజ్రాయెల్‌ దాడుల్లో మృతిచెందలేదని ఇరాన్‌ రాయబార కార్యాలయం ప్రకటించింది. హెజ్‌బొల్లా కూడా ప్రతిదాడిగా ఇజ్రాయెల్‌ పైకి సుమారు 180 క్షిపణులు ప్రయోగించిందని ఇజ్రాయెల్‌ సైనిక దళాలు తెలిపాయి.అయితే ఈ దాడులను సమర్థంగా ఎదుర్కొన్నామని వారు పేర్కొన్నారు.

వివరాలు 

హెజ్‌బొల్లా సొరంగ మార్గాలు ధ్వంసం.. 

హెజ్‌బొల్లా సొరంగ మార్గాలను ఇజ్రాయెల్‌ బలగాలు ధ్వంసం చేశాయి. దక్షిణ లెబనాన్‌లో హెజ్‌బొల్లాకు చెందిన సుమారు 25 మీటర్ల సొరంగాన్ని గుర్తించి, దాన్ని ధ్వంసం చేశామని ఇజ్రాయెల్‌ అధికారులు వెల్లడించారు. ఈ సొరంగం లెబనాన్‌లోని మార్వహిన్‌ ప్రాంతం నుంచి ఇజ్రాయెల్‌ భూభాగంలోని జరిత్‌ కమ్యూనిటీ సమీపంలోకి రావడం జరిగింది. సొరంగంలో ఆయుధాలు, పేలుడు పదార్థాలు, యాంటీ ట్యాంక్‌ క్షిపణులు ఉన్నాయని ఇజ్రాయెల్‌ సైనిక ప్రతినిధి డేనియల్‌ హగారి తెలిపారు. ఇంకా, సరిహద్దు వెంబడి మరిన్ని సొరంగాల కోసం ఇజ్రాయెల్‌ దళాలు వెతుకుతున్నాయని ఆయన వివరించారు.

వివరాలు 

దక్షిణ లెబనాన్‌లో సొరంగాల నిర్మాణం చేసిన హెజ్‌బొల్లా  

హెజ్‌బొల్లా గత కొన్ని సంవత్సరాలుగా దక్షిణ లెబనాన్‌లో సొరంగాలు, కమాండ్‌ సెంటర్‌లను విస్తృతంగా నిర్మించిందని ఇజ్రాయెల్‌ తెలిపింది. యుద్ధంలో ఐడీఎఫ్‌ దళాలపై దాడులు చేయడం, ఉత్తర ఇజ్రాయెల్‌లోని ప్రాంతాలను లక్ష్యంగా చేసుకొని ప్రణాళికలను అమలుచేయడం కోసం ఈ సొరంగాలను ఉపయోగిస్తున్నట్లు వెల్లడించింది.