Page Loader
Israeli strike: మరోసారి బీరుట్‌ శివారు ప్రాంతాలపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు..
మరోసారి బీరుట్‌ శివారు ప్రాంతాలపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు..

Israeli strike: మరోసారి బీరుట్‌ శివారు ప్రాంతాలపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు..

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 08, 2024
08:34 am

ఈ వార్తాకథనం ఏంటి

ఇజ్రాయెల్‌ లెబనాన్‌ రాజధాని బీరుట్‌ శివారు ప్రాంతాలపై భారీ వైమానిక దాడులు నిర్వహించింది. లెబనాన్‌లోని ఏకైక అంతర్జాతీయ ఎయిర్‌పోర్టు సమీపంలో కూడా దాడులు చేసింది. హిజ్బుల్లా ముష్కరులు ఆ ప్రాంతాల్లో దాగి ఉన్నారని సమాచారం అందిందని ఇజ్రాయెల్‌ సైన్యం వెల్లడించింది. దాడులకు ముందు ఆ ప్రాంత ప్రజలను ఖాళీ చేయాలని హెచ్చరికలు జారీ చేశామని ఇజ్రాయెల్‌ తెలిపింది, అయితే ఈ దాడుల్లో ఎంత నష్టం కలిగిందో ఇంకా వెల్లడించలేదు.

వివరాలు 

బీట్‌ లహియాలో భూతల దాడులు

ఇక మరోవైపు, ఇజ్రాయెల్‌ తన దూకుడును తగ్గిస్తే కాల్పుల విరమణపై చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామని హెజ్‌బొల్లా నాయకుడు నయీం ఖాసిం పేర్కొన్నారు. గాజాలో తమ సైనిక చర్యలను మరింత విస్తరించే యోచనలో ఉన్నామని ఇజ్రాయెల్‌ డిఫెన్స్ ఫోర్స్ ప్రకటించింది. ఇందులో భాగంగా వాయవ్య గాజా పట్టణమైన బీట్‌ లహియాలో భూతల దాడులు చేస్తున్నారు. మొదట్లో బాంబు దాడుల ద్వారా ఈ ప్రాంతాన్ని ఇజ్రాయెల్‌ తీవ్రంగా ప్రభావితం చేసింది. తాజాగా హమాస్‌ ముష్కరులు మళ్లీ అక్కడ తలదాచుకుంటున్నారని సమాచారం అందిందని పేర్కొన్నారు.

వివరాలు 

పాలస్తీనా కుటుంబాలను బహిష్కరించే చట్టం

దీంతో పాటు, అమెరికా బోయింగ్‌ సంస్థ నుంచి 25 ఎఫ్‌-15 యుద్ధ విమానాలను కొనుగోలుకు ఒప్పందం చేసుకున్నట్లు ఇజ్రాయెల్‌ తెలిపింది. అలాగే, దాడులు నిర్వహించే పాలస్తీనా కుటుంబాలను తమ దేశం నుంచి బహిష్కరించే చట్టాన్ని గురువారం ఇజ్రాయెల్‌ తీసుకొచ్చింది. ఈ చట్టం ఇజ్రాయెల్‌తో పాటు తూర్పు జెరూసలెంలో ఉన్న పాలస్తీనా పౌరులకూ వర్తించనుంది.