భర్తతో విడిపోతున్నట్లు ఇటలీ ప్రధాని మోలోనీ ప్రకటన.. కారణం మాత్రం మాములుగా లేదు
ఇటలీ ప్రధాని జార్జియా మెలోని వివాహబంధానికి స్వస్తి పలికారు. ఈ మేరకు తన భర్త ఆండ్రియా గియాంబ్రునోతో విడిపోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. పదేళ్ల తమ బంధం ముగిసిపోయిందని పేర్కొన్నారు. గత కొంత కాలంగా తాము ప్రయాణిస్తున్న దారులు మారాయని, ఫలితంగా సరైన నిర్ణయం తీసుకునే సమయం ఆసన్నమైందన్నారు. ఈ క్రమంలోనే మెలోని సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రధాని దంపతులకు ఒక పాప ఉంది. కొద్ది నెలల క్రితం మెలోని భర్త ఏమన్నారంటే.. ఇటీవలే ఇటలీలో సామూహిక అత్యాచారం ఘటనలు కలకలం రేపాయి.దీనిపై స్పందించిన మోలోని భర్త గియాంబ్రనో వివాదాస్పదంగా మాట్లాడారు. మీరు సరదాగా గడిపేందుకు వెళ్లినప్పుడు మద్యం సేవిస్తారని,అయితే అత్యాచారాలను నివారించాలంటే స్పృహ కోల్పోకుండా ఉండాలన్నారు.మద్యం అతిగా తాగకుండా ఉంటే ఇబ్బందుల్లో పడరన్నారు.
దిద్దుబాటు చర్యలకు దిగినా ఫలితం దక్కలేదు
ఈ అంశం దేశవ్యాప్తంగా రగడ రేపింది. దీంతో మెలోని భర్త దిద్దుబాటు చర్యలకు దిగారు. మద్యం కోసం, డ్రగ్స్ కోసం బయటకు వెళ్లొద్దని చెప్పడమే తన ఉద్దేశమని ఆయన చెప్పుకొచ్చారు. చెడు వ్యక్తుల నుంచి తప్పించుకోవాలంటే అప్రమత్తంగా ఉండాలని చెప్పానన్నారు. మరోవైపు మహిళా ఉద్యోగులను ఉద్దేశించి సైతం ఇటీవలే మెలోని భర్త అసభ్యకరమైన వ్యాఖ్యల రికార్డులు బహిర్గతమయ్యాయి. ఈ పరిణామాల నేపథ్యంలో విసిగిపోయిన ఇటలీ ప్రధాన మంత్రి, భర్తతో విడిపోయేందుకు సిద్ధపడ్డారు. ఈ మేరకే ఆమె ప్రకటన చేశారు. ఇటలీకి తొలి మహిళా ప్రధాన మంత్రిగా మెలోనీ కొనసాగుతుండటం గమనార్హం.