ఇటలీలో వడగళ్ల వాన.. గాల్లోనే విమానానికి రంధ్రం పడటంతో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసిన పైలెట్లు
యూరోపియన్ దేశం ఇటలీలో భారీ వడగళ్ల వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో విమానాల ప్రయాణాలకు తీవ్ర ఆటంకాలు కలుగుతున్నాయి. ఈ క్రమంలో ఓ విమానం గాల్లోకి ఎగిరిన కాసేపటకే దాని ముందు భాగం దెబ్బతింది. ఈ మేరకు వడగళ్ల తాకిడికి ఫ్లైట్ ముందు వరుసలో రంధ్రం ఏర్పడింది. దీంతో హుటాహుటిన ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. ఇటలీలోని మిలాన్ నగరం నుంచి అమెరికాలోని న్యూయార్క్ (New York) జే.ఎఫ్.కే (JFK) విమానశ్రయానికి బయల్దేరిన విమానం టేకాఫ్ అయింది. ఆ తర్వాత కొద్దిసేపటికే రాజధాని రోమ్ నగరంలో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. డెల్టా ఎయిర్ లైన్స్ కు చెందిన 185 నెంబర్ విమానం 215 మంది ప్రయాణికులతో మిలాన్ ఎయిర్ పోర్ట్ నుంచి బయల్దేరింది.
పైలట్ల అప్రమత్తతో సేఫ్ గా ల్యాండైన విమానం
సదరు ఫ్లైట్ గాల్లోకి ఎగిరిన సమయానికి వాతావరణం అనుకూలంగానే ఉంది. టేక్ ఆఫ్ తీసుకున్న కాసేపటికే వాతావరణం ప్రతికూలంగా మారిపోయింది. విమానం గాల్లోకి ఎగిరిన పదిహేను నిమిషాల్లోనే భారీ వర్షం ప్రారంభమైంది. వడగళ్ల వాన ఎక్కువై విమానం ముక్కు, రెక్కలుపై ధాటిగా పడ్డాయి. ఈ క్రమంలోనే విమానం ముందు భాగం పూర్తిగా ధ్వంసమై రంధ్రం పడిందని న్యూయార్క్ పోస్ట్ నివేదిక వెల్లడించింది. దీంతో అలెర్ట్ అయిన పైలట్లు విమానాన్ని రోమ్ నగరానికి మళ్లించారు. అక్కడ అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. గాల్లోనే వర్ష బీభత్సానికి భయబ్రాంతులకు గురైన ప్రయాణికులు విమానం సురక్షితంగా ల్యాండ్ అవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.