Page Loader
Pak Deputy PM: 'పహల్గాం దాడికి పాల్పడినఉగ్రవాదులను 'స్వాతంత్ర్య సమరయోధులు'.. పాక్‌ ఉపప్రధాని అనుచిత వ్యాఖ్యలు..
పాక్‌ ఉపప్రధాని అనుచిత వ్యాఖ్యలు..

Pak Deputy PM: 'పహల్గాం దాడికి పాల్పడినఉగ్రవాదులను 'స్వాతంత్ర్య సమరయోధులు'.. పాక్‌ ఉపప్రధాని అనుచిత వ్యాఖ్యలు..

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 25, 2025
09:04 am

ఈ వార్తాకథనం ఏంటి

జమ్ముకశ్మీర్‌లోని పహల్గాంలో పర్యాటకులపై ఇటీవల చోటుచేసుకున్న ఉగ్రదాడితో భారత్‌, పాక్‌ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈ దాడి సీమాంతర కుట్రలో భాగమేనని భారత ప్రభుత్వం ఘాటుగా స్పందించగా,దీనితో తమకు ఎలాంటి సంబంధం లేదని పాకిస్థాన్‌ నిరాకరించింది. అయితే ఈ పరిణామాల నడుమ పాక్‌ ఉప ప్రధాని ఇషాక్‌ దార్‌ చేసిన వ్యాఖ్యలు మరింత వివాదాస్పదంగా మారాయి. దాడికి పాల్పడిన ఉగ్రవాదులను స్వాతంత్ర్య సమరయోధులుగా పేర్కొంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు దారితీశాయి. ఇస్లామాబాద్‌లో మీడియాతో మాట్లాడిన ఇషాక్‌ దార్‌... ఏప్రిల్‌ 22న జమ్మూకశ్మీర్‌లోని పహల్గాం జిల్లాలో జరిగిన దాడి గురించి స్పందిస్తూ, ఆ దాడికి పాల్పడినవారు "స్వాతంత్ర్య సమరయోధులు" కావచ్చని అభిప్రాయపడ్డారు.

వివరాలు 

ఉగ్రవాదాన్ని ప్రోత్సహించేలా వ్యాఖ్యలు..

ఈ వ్యాఖ్యలు కేవలం అనుచితంగానే కాకుండా, ఉగ్రవాదాన్ని ప్రోత్సహించేలా ఉన్నాయని విమర్శకులు వ్యాఖ్యానిస్తున్నారు. అలాగే, సింధూ జలాల ఒప్పందాన్ని భారత్‌ రద్దు చేసిన నేపథ్యంలో దార్‌ స్పందిస్తూ, "భారతదేశం తీసుకున్న ఈ ఏకపక్ష నిర్ణయాన్ని మేము ఎప్పటికీ అంగీకరించము. దీనికి పాక్‌ నుంచి కచ్చితంగా ప్రతిచర్య ఉంటుంది," అంటూ ఆయన వ్యాఖ్యానించారు.

వివరాలు 

సింధూ జలాల నిలిపివేతపై పాక్‌కు భారత్ లేఖ 

జమ్మూకశ్మీర్‌ను టార్గెట్‌ చేస్తూ సీమాంతర ఉగ్రవాదాన్ని కొనసాగిస్తున్నందున, పాకిస్థాన్‌తో కొనసాగిస్తున్న సింధూ జలాల ఒప్పందాన్ని నిలిపివేస్తున్నట్టు భారత్‌ ఇటీవల అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు భారత నీటి వనరుల కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ పాక్‌ జలవనరుల అధికారి సయీద్‌ అలీ ముర్తుజాకు లేఖ పంపారు. ఆ లేఖలో... "ఏ ఒప్పందాన్నైనా నిజాయితీగా గౌరవించటం ప్రతి దేశపు ప్రాథమిక బాధ్యత. కానీ పాకిస్థాన్‌ తరచూ జమ్మూకశ్మీర్‌ను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాద కార్యకలాపాలను ప్రోత్సహిస్తోంది. ఈ భద్రతా పరిస్థితులు భారత హక్కులను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. అందుకే, మేము సింధూ జలాల ఒప్పందాన్ని తక్షణమే నిలిపివేస్తున్నాం," అని పేర్కొన్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

మాట్లాడుతున్న పాక్‌ ఉపప్రధాని